NTV Telugu Site icon

Off The Record: టీడీపీలో చిన్న పోస్ట్‌ను అడ్డం పెట్టుకుని ఆ నాయకురాలు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారా..?

Anuradha Begam

Anuradha Begam

Off The Record: విజయనగరం టీడీపీకి అశోక్‌ గజపతిరాజు బంగ్లానే కేరాఫ్‌. అదే పార్టీ ఆఫీస్‌ కూడా. జిల్లా పార్టీకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఇక్కడి నుంచే జరిగిపోతుంటాయి. జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి కూడా పలువురు సీనియర్‌ లీడర్స్‌ వచ్చిపోతూ… అదో హుందాగా ఉండేదని, అయితే… అదంతా గతం అన్న టాక్‌ నడుస్తోంది ప్రస్తుతం ఇక్కడ. అశోక్‌ వారసురాలు అదితి రాజకీయాల్లోకి వచ్చాక సీన్‌ పూర్తిగా మారిపోయిందన్నది లోకల్‌ టాక్‌. చోటా, మోటా నాయకులు కొందర్ని వెనకేసుకుని తిరుగుతూ అదితి ఎంకరేజ్‌ చేస్తున్నారని, వాళ్లేమో… పేనుకు పెత్తనం ఇచ్చిన చందాన చెలరేగిపోతున్నారన్నది విజయనగరం టీడీపీ సీనియర్స్‌ మాట. ప్రత్యేకించి అశోక్‌గజపతితో కలిసి రాజకీయ ప్రయాణం చేసిన వారిని ఇప్పుడీ ఛోటా మోటా లీడర్స్‌ టార్గెట్‌ చేస్తున్నారట. ఎమ్మెల్యే అదితి వెనక తిరుగుతున్న అనురాధ బేగం అనే నాయకురాలు బంగ్లాలో సర్వం నేనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట.

పార్టీలో ఆమె స్థానం ఎక్కడంటే… పెద్ద చెప్పుకునేదేం కాదన్నది కేడర్‌ వాయిస్‌. కానీ, అంతా తానే అన్న రేంజ్‌లో బంగ్లాలో బిల్డప్‌ ఇస్తున్నారట బేగం. ఇటీవలి కాలంలో ఆమె తీరు తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఉందని, చిన్న చిన్న పంచాయితీలతో మొదలై ఇప్పుడు ఏకంగా సెటిల్మెంట్లు చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కొత్త నాయకురాలి తీరుపై పాత నేతలంతా ఫుల్‌ ఫైర్‌లో ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలైన వెంటనే… గ్రామ సచివాలయాల‌ టూర్‌ వేసిన బేగం తాను చెప్పిన వారికే పనులు చెయ్యాలని హుకుం జారీ చేయడం అప్పట్లో సంచలనం అయింది. ఎలాంటి హోదా లేకున్నా… సచివాలయ సిబ్బంది‌ కుర్చీలో కూర్చోవడం, తానే ఎమ్మెల్యే అన్నట్టుగా దర్బార్ నడపడం తొలి రోజుల్లో కలకలం రేపింది. ఆ వీడియోలు బాగా వైరల్‌ అయి పార్టీ నుంచి వార్నింగ్స్‌ రావడంతో… కాస్త తగ్గినట్టు చెప్పుకున్నారు. ఇప్పుడిక పార్టీ, ప్రభుత్వం పేరు చెప్పి ఎక్కడికక్కడ బేగం దందాలు మొదలైపోయినట్టు చెప్పుకుంటున్నారు. అలాగే… స్థానికంగా ఉన్న కబేళాల నుంచి ఎమ్మెల్యే పేరు చెప్పి నెలవారీ వసూళ్ళు మొదలుపెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ సీనియర్స్‌ విషయంలో అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని, ఐదు దశాబ్దాల పాటు అశోక్‌తో కలిసి నడిచిన వాళ్ళను సైతం పూచికపుల్లతో సమానంగా తీసి పడేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అశోక్ గజపతిరాజుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నాయకుడి విషయంలో బేగం అనుచిత వైఖరిపై పార్టీ శ్రేణులు భగ్గు మంటున్నాయి. ఆయనతో పాటు మరి కొందరు ముఖ్య నేతల విషయంలో కూడా ఈ షాడో ఎమ్మెల్యే ధోరణి సహించ లేనిదిగా ఉంటోందని టీడీపీ కేడరే రగిలిపోతోందట. ఈనెల 8న బంగ్లాలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగిన సందర్భంగా…. ఒక కీలక నేత, జిల్లాలోనే టీడీపీ తొలి సభ్యత్వం తీసుకున్న నాయకుడి విషయంలో అగౌరవంగా ప్రవర్తించిన తీరుతో అక్కడున్న పార్టీ నేతలంతా షాకయ్యారట. అలాగే ఇంకో సీనియర్ నాయకుడు ఐవీపీ రాజు భార్య మహిళాదినోత్సవంలో పాల్గొంటే.. ఆమెను లేపి‌ మరీ…కుర్చీ లాకున్నారని, ఆమె సిగ్గు, అవమాన భారంతో వెనుదిరిగినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని ఎమ్మెల్యే అదితి‌గజపతి చూస్తూ కూడా ఏమీ అనకపోవడం ఇంకా దురణం అన్న టాక్‌ నడుస్తోంది విజయనగరంలో. దీంతో బేగం చర్యల వెనుక ఎమ్మెల్యే ప్రమేయం కూడా ఉండి ఉంటుందని గుసగుసలాడుకుంటోంది టీడీపీ కేడర్‌. అంతే కాదు….‌ బంగ్లాలో ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తూ… అశోక్ వెనక ఉన్న ఓ ఐదుగురు నేతలను బయటికి పంపించే కుట్రలకు కూడా తెర లేచినట్టు ప్రచారం జరుగుతోంది. షాడో ఎమ్మెల్యే విషయంలో ఏమాత్రం తాత్సారం జరిగినా ఆశోక్ గజపతి రాజు పరపతితోపాటు బంగ్లా ప్రతిష్ట కూడా మసకబారడం ఖాయమన్న ఆందోళన ఉందట లోకల్‌ కేడర్‌లో. ఈ విషయంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.