Off The Record: ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది….. కానీ దాని పర్యవసానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌పై చర్యల విషయంలో రచ్చ జరిగింది. తర్వాత మంత్రి దంపతులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి క్షమాపణలు చెప్పేశారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయినా… తెర వెనక అసలేం జరిగిందన్న నివేదిక మాత్రం ప్రభుత్వం దగ్గరే ఉండి పోయింది. దీంతో… కొండా ఎపిసోడ్‌లో వాస్తవాలేంటి..? బాధ్యులు ఎవరు,.. బద్నాం అయ్యింది ఎవరు..? సురేఖ తన osd సుమంత్‌ని కారులో ఎక్కించుకుని ఎక్కడికి తీసుకువెళ్ళారన్న అంశం చుట్టూ అసలు సిసలైన చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో. దీనికి సంబంధించి ఇంటలిజెన్స్ పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రిపోర్ట్‌లోని వివరాలు చూసి సర్కార్ పెద్దలే షాకవుతున్నారట. ఈ ఎపిసోడ్‌లో మరో బీసీ మంత్రికి కూడా వివాదాల మరక అంటినట్టయిందని అంటున్నారు. సాధారణంగా… ఇలాంటి వివాదాల్లో తలదూర్చే నైజం ఆయనది కాదని, మరి ఇందులో ఎందుకు వేలు పెట్టారన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారట వివరాలు తెలిసిన పెద్దలు. ఓఎస్‌డీ సుమంత్ కోసం కొండా సురేఖ ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చిన ఆ రాత్రి…. అతన్ని తన కారులో ఎక్కించుకుని నేరుగా మినిస్టర్స్ క్వార్టర్స్‌కి వెళ్లారట సురేఖ.
అక్కడ కూడా…. తనకు కేటాయించిన భవనంలోకి వెళ్ళకుండా…. కీలకంగా భావించే మరో బీసీ మంత్రి ఇంటికి సుమంత్‌ని తీసుకువెళ్ళినట్టు తెలిసింది. ఓఎస్‌డీని అక్కడే వదిలేయడం ద్వారా… సదరు కీలకమైన బీసీ మంత్రి ఇంట్లోనే ఆ రాత్రికి తలదాచుకునే ఏర్పాటు చేశారని నివేదిక ఇచ్చిందట ఇంటెలిజెన్స్. కానీ… ఆ మంత్రి ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉంటారు, అసలు పెద్దగా వివాదాల జోలికి పోరని, ఇందులో ఎలా ఇరుక్కున్నారని ఆరా తీస్తే… ఇంకో షాకింగ్ మేటర్ వెలుగు చూసిందట. కొండా ఓఎస్డీని మీ దగ్గరే ఉండనివ్వండంటూ…. తెలంగాణ కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన పదవి నిర్వహిస్తున్న ఓ సీనియర్ లీడర్ సూచించారట. సరే… అంత పెద్ద పోస్ట్‌లో ఉన్న నాయకుడు చెప్పాడు కదా.. అని ఆ వివాదరహితుడైన బీసీ మంత్రి సుమంత్‌కు ఆశ్రయం ఇచ్చినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే వివాదాల్లో ఉన్న మంత్రికి ఈ రిపోర్ట్ మరింత తలనొప్పిగా మారినట్టు చెప్పుకుంటున్నారు. పైకి చూడ్డానికి ఇదేదో సాధారణ అంశంలా కనిపిస్తున్నా…. ఇన్‌సైడ్ మేటర్ మాత్రం ఇంకేదో ఉందని, దాల్ మే కుఛ్ కాలా హై అని అనుమానిస్తున్న నిఘా వర్గాలు ఇప్పుడు మరింత లోతుల్లోకి వెళ్తున్నాయట. కొండా ఓఎస్డీకి ఆశ్రయం ఇవ్వమని ఆ బీసీ మంత్రికి చెప్పిన సదరు పార్టీ నాయకుడు ఎవరు..? ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆయన ఇంట్రస్ట్ ఏంటి? పాత్ర ఏంటి? అసలీ వివాదంలో ఎందుకు తల దుర్చాల్చి వచ్చింది? ఎవర్నో కాపాడటానికా…? లేక తనను తాను కాపాడుకోవడం కోసమా..? అంటూ రకరకాల కోణాల్లో ఆరా తీసే పనిలో ఉందట తెలంగాణ ఇంటెలిజెన్స్. లోతుల్లోకి వెళ్తే ఇంకెన్ని సంచలనాలు బయటికి వస్తాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు.
