Off The Record: ఆళ్లగడ్డ అడ్డాలో బస్తీ మే సవాల్.. సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య రచ్చ

  • ఆళ్లగడ్డ అడ్డాలో బస్తీ మే ఫ్రీ సవాల్..
  • జనాలకు వరంగా మారిన ప్రత్యర్థుల వైరం..
  • ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ మధ్య కేబుల్ టీవీ నెట్‌వర్క్‌ రచ్చ..
  • నంద్యాల కమ్యూనికేషన్స్‌కు పోటీగా అఖిల SSV కేబుల్..
  • కేబుల్ టీవీ కనెక్షన్‌ ఫ్రీ అంటూ సుబ్బారెడ్డి బంపర్ ఆఫర్..
  • కొత్త కనెక్షన్‌ ఇస్తామని ఎవరు వచ్చినా ఒప్పుకోవద్దని ప్రచారం..
  • ఏవీ సుబ్బారెడ్డి డిష్ బిల్లు ఫ్రీ ప్రచారంపై మౌనంగా అఖిల వర్గం..
  • నివురుగప్పిన నిప్పులా కేబుల్ టీవీ నెట్ వర్క్ వ్యవహారం ..
Allagadda Cable War

Allagadda Cable War

Off The Record: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీలో ఎమ్మెల్యే భూమా అఖిల, టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి గొడవలు, పోరాటాలు కొత్తకాదు. ఆ గొడవల వేదికలు, రూపాలు మారుతుంటాయి అంతే. రగడ మాత్రం కామన్. తాజాగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేబుల్ టీవీ నెట్ వర్క్ వివాదం రోడ్డెక్కింది. కేబుల్ టీవీ నెట్ వర్క్ పై ఆధిపత్యం కోసం అస్త్రశస్త్రాలు ఎక్కుపెట్టారు. పోటాపోటీతో ఏకంగా కేబుల్ టివి కనెక్షన్ ఫ్రీ ఫ్రీ అంటూ జనాలకు బంపరాఫర్లు ఇస్తున్నారు.

భూమా అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య కొనసాగుతున్న గొడవలు చల్లారాలేదు సరికదా మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయనేదుకు తాజాగా తలెత్తిన కేబుల్ టీవీ నెట్ వర్క్ గొడవ అద్దం పడుతోంది. అంతకుముందు భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు, ఆధిపత్యపోరు రచ్చరచ్చ అయ్యాయి. ఆళ్లగడ్డలో నంద్యాల కమ్యూనికేషన్స్ పేరుతో కేబుల్ నెట్వర్క్ నిర్వహిస్తున్నారు ఏవీ సుబ్బారెడ్డి. అయితే కేబుల్ నెట్ వర్క్ లో ఆధిపత్యం సాధించాలని, తమ ఆధీనంలోనే ఉండాలని భూమా అఖిల అనుచరులు ssv కేబుల్ నెట్వర్క్ ను ప్రారంభించారు. భూమా అఖిల అనుచరులు Ssv కేబుల్ వైర్లు నియోజకవర్గం అంతటా విస్తరించే పనుల్లో వున్నారు. తమ కేబుల్ వైర్లను తొలగించి ssv వైర్లు ఏర్పాటు చేస్తున్నారనేది ఏవి సుబ్బారెడ్డి ఆరోపణ. ఆళ్లగడ్డ లో ssv నెట్ వర్క్ వైర్లు లాగుతుండగా వ్యవహారం రోడ్డుడెక్కింది. ఏవి సుబ్బారెడ్డి బహిరంగంగానే భూమా అఖిలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

ఆళ్లగడ్డలో భూమా అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య కేబుల్ వార్ కొత్త రూపం సంతరించుకుంది. ఎలాగైనా తన కేబుల్ నెట్ వర్క్ ను నిలుపుకోవడానికి ఏవీ సుబ్బారెడ్డి పావులు కదుపుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఏప్రిల్ ఒకటి నుంచి ఆళ్లగడ్డలో డిష్ బిల్లు ఫ్రీ అంటూ ప్రచారం మొదలు పెట్టారు ఏవి సుబ్బారెడ్డి. నంద్యాల సిటీ కేబుల్ పేరుతో ఇతరులు, కొత్తవారు ఎవరైనా మీ ఇంటి దగ్గరకు వచ్చి, మీ పాత సెటప్ బాక్స్ తీసుకుని కొత్త సెటప్ బాక్స్ ను బిగిస్తామంటే తక్షణమే తిరస్కరించాలని కేబుల్‌ టీవీలో ప్రచారం చెయ్యడంతో పాటు ఏకంగా కరపత్రాలు పంచుతున్నారు. ప్రస్తుతానికి ssv కేబుల్ టీవీ వైర్లు లాగడాన్ని భూమా అఖిల అనుచరులు నిలిపేశారు. ఏవి సుబ్బారెడ్డి డిష్ బిల్లు ఫ్రీ అంటూ చేస్తున్న ప్రచారాన్ని భూమా అఖిల వర్గం మౌనంగా చూస్తోంది. ఇప్పటి వరకు తాము కూడా ఫ్రీ కేబుల్ నెట్ వర్క్ వంటి ప్రకటనలు భూమా అఖిల వర్గం నుంచి రాలేదు. అయితే ఆళ్లగడ్డ కేబుల్ టీవీ నెట్ వర్క్ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.