OTR : ఉమ్మడి విజయనగరం ఎమ్మెల్యే సీఎంవోని బదనాం చేస్తున్నారా?

Cmo

Cmo

టీడీపీ ఎమ్మెల్యే ఒకరు మరీ…చిల్లర పనులు చేస్తున్నారా? సొంత ప్రభుత్వం మీదే దుష్ప్రచారం మొదలుపెట్టారా? జిల్లా కలెక్టర్‌తో ఉన్న విభేదాలను ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి అంటగట్టారా? ఆ తరహా ప్రచారం కోసం సార్‌…. ఫండింగ్‌ కూడా చేస్తున్నారన్నది నిజమా? అసలు ఒక జిల్లా కలెక్టర్‌కు సీఎంవోను డిక్టేట్‌ చేసేంత సీన్‌ ఉంటుందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా పెయిడ్ ఆర్టిస్ట్‌ల యవ్వారాలు? ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇప్పుడో ఇంట్రస్టింగ్‌ టాపిక్‌ గురించి హాట్‌ హాట్‌ చర్చలు నడుస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు సొంత పార్టీని, ఏకంగా సీఎం ఆఫీస్‌నే బద్నాం చేస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. అదీకూడా… అమరావతిలో సమర్ధులు లేరు, ఒక జిల్లా కలెక్టర్‌ సీఎంవోను ఆడిస్తున్నారన్న అర్ధం వచ్చేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దాని వెనక ఎమ్మెల్యే ఫండింగ్‌ చేసిన సోషల్‌ మీడియా మూకలు ఉన్నాయన్న గుసగుసలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌ సీఎంవోని మేనేజ్‌ చేయడం సాధ్యమా అన్న డిస్కషన్స్‌ మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఫండింగ్‌ చేసి మరీ…. సోషల్‌ మీడియాలో ఈ తరహా కథనాలను వండి వార్పిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో అలా చేయడం వల్ల ఆయనకు వచ్చే లాభమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే… ఆన్సర్స్‌ వెరీ సింపుల్‌ అన్నది లోకల్‌ టాక్‌. ఓ విభజిత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కు మధ్య బాగా గ్యాప్‌ వచ్చిందట. కలెక్టర్‌కు ముక్కుసూటి మనిషి, రూల్స్‌ ఫాలో అవుతారన్న పేరుంది. కానీ… శాసనసభ్యుడు మాత్రం రూల్స్‌ గీల్స్‌ జాన్తానై. నేను చెప్పినట్టు చేయాలని వత్తిడి చేస్తున్నారట. అందుకు ఒప్పుకోకపోవడంతో…. ఏదో ఒక రకంగా ప్రెజర్‌ పెట్టి దారికి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో సోషల్‌ మీడియాను గట్టిగా వాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కలెక్టర్‌ సీఎం ఆఫీస్‌ను మేనేజ్‌ చేస్తున్నారని, అక్కడి అండదండలతోనే…అవకతవకలకు పాల్పడుతున్నారని, అందు కోసం జిల్లా మొత్తాన్ని తనకు అనుకూల అధికారులతో నింపేస్తున్నారని సోషల్‌ కథనాలు వండి వారుస్తున్నారు. అయితే… ఇక్కడే సదరు శాసనసభ్యుడు ఓ చిన్న లాజిక్‌ మిస్‌ అయ్యారని అంటున్నారు పరిశీలకులు.

ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఈ వివాదంలోకి లాగి దుష్ప్రచారం చేస్తున్నారంటే…. అంతిమంగా ఆయన ఎవర్ని బద్నాం చేస్తున్నారో అర్ధమవుతోందా అని టీడీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. తన చిల్లర పంచాయితీల కోసం సీఎం ఆఫీస్‌నే వివాదాస్పదం చేస్తారా? అసలు ఒక జిల్లా కలెక్టర్‌ చెబితే… సీఎంవోలో ఉండే పెద్దలు గుడ్డిగా తలూపేస్తారా? సోషల్‌ మీడియాలో ఇలాంటి చర్చలు పెట్టడమంటే… ప్రభుత్వాన్ని పలుచన చేయడంతో పాటు ప్రత్యర్థుల చేతికి మనమే కత్తి ఇచ్చినట్టు కాదా..? అంటూ జిల్లా తెలుగుదేశం నాయకులు పలువురు నిలదీస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారికి పోస్టింగ్‌, బదిలీ, కీలక బాధ్యతలు అప్పగించడంలాంటి నిర్ణయాలు పై స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి. అలాంటిది కలెక్టర్ సీఎంవోను ప్రభావితం చేస్తున్నారన్న భావన ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం జరగడం పరోక్షంగా సొంత ప్రభుత్వాన్ని కించపరిచడమేనని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు కేంద్ర బిందువు సీఎం ఆఫీస్‌. అలాంటి వ్యవస్థపై అనుమానాలు కలిగించేలా సోషల్ మీడియాలో ప్రచారం జరగడమంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడమేనని టీడీపీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఏదో అనుకున్నాంగానీ…. ఆ ఎమ్మెల్యే మరీ…. ఇంత చిల్లరగా వ్యవహరిస్తారా అంటూ… సొంత పార్టీ నేతలే క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌లు పెడుతున్నారట. అన్నిటికీ మించి ప్రభుత్వ వ్యతిరేక కథనాలను సొంత పార్టీ ఎమ్మెల్యేనే స్పాన్సర్‌ చేస్తున్నారన్న విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నామన్నది హార్డ్‌కోర్‌ పసుపు నేతల మాట. చాతనైతే… సీఎం దగ్గర కూర్చుని కలెక్టర్‌ని బదిలీ చేయించుకోవాలేగానీ… సీఎంవోని, పార్టీని సోషల్‌ మీడియాలో బదనాం చేయడం సరైనదేనా అని మాట్లాడుకుంటున్నారు. అటు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఆరా తీసినట్టు సమాచారం. అదే సమయంలో సదరు శాసనసభ్యుడి వైఖరిపై కూడా జిల్లా పార్టీలో గట్టిగా మాట్లాడుకుంటున్నారు. పలు అంశాలకు సంబంధించి ఇప్పటికే తన నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారాయన. సహచర టీడీపీ నాయకులతో సమన్వయం పూర్తిగా లోపించిందట. ప్రస్తుతం ఈ పరిణామాలన్నింటినీ కొందరు స్థానిక నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సదరు ఎమ్మెల్యేతో పార్టీ పెద్దలు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఏదన్నా అసంతృప్తి ఉంటే… మా దృష్టికి తీసుకువచ్చి మాట్లాడాలేగానీ… ఇలా రచ్చకు దిగితే…ఎలాగంటూ సీరియస్‌గా క్లాస్‌ పీకినట్టు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.