OTR: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు ఆ ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రికి క్యాంప్ కార్యాలయం కూడా లేకుండా పోయిందా..? సీనియర్ల అతి జోక్యంతో పేరుకే ఆయన ఇన్‌ఛార్జ్ మంత్రిగా మారిపోయారా..? ఎడాదికాలంగా ఆ ఉమ్మడి జిల్లాలో పెత్తనం అంతా ఆ సీనియర్ మంత్రులదేనా..? క్యాంప్ కార్యాలయం ఎపిసోడ్‌లో ఆ జిల్లా సీనియర్ నేతలను… సొంత పార్టీ నేతలే ఎందుకు హెచ్చరిస్తున్నారు..? చూద్దాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అయితే… ఆయన నల్లగొండలో ఓ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఈ విషయంలో సొంత పార్టీ ముఖ్యనేతల నుంచే సహకారం కరువైందట. ఇన్‌ఛార్జ్ మంత్రి హోదాలో… జిల్లాకు వచ్చినప్పుడు అధికారులతో సమావేశం పెట్టుకొవడానికి నల్లగొండలో క్యాంప్ ఆఫీస్ ఉంటే బాగుంటుంది అనుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని తన శాఖ అధికారులకు సూచించారట మంత్రి. ఆయన సూచనలతో రంగంలోకి దిగిన అధికారులు నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్‌లో ఖాళీగా ఉన్న ఓ ప్రభుత్వ క్వార్టర్‌ను క్యాంప్ ఆఫీస్‌గా సెట్ చేయాలనుకున్నారట. అందు కోసం బడ్జెట్ కేటాయింపు కూడా జరగడంతో… పనులు ప్రారంభించారట సంబంధిత అధికారులు. అంతలోనే క్యాంప్ కార్యాయం పనులకు సడన్ బ్రేక్ పడిందని తెలుస్తోంది.
ఇన్‌ఛార్జ్ మంత్రికి క్యాంప్ ఆఫీస్ సిద్ధమవుతుందన్న విషయం తెలుసుకున్న జిల్లా ముఖ్య నేత జిల్లా కేంద్రంలో మరో మంత్రి క్యాంప్ ఆఫీసు ఏంటని అని తనదైన స్టైల్‌లో ప్రశ్నించారట. దాంతో అధికారులు పనులు నిలిపేయడమే కాకుండా… క్యాంప్ ఆఫీస్ కేటాయింపు నిర్ణయం కూడా వెనక్కి తీసుకున్నారట. జిల్లాకు చెందిన ఓ మంత్రి ఆదేశాలతో సంబందిత శాఖ అధికారులు షాక్ అయ్యారట. క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు ఆగిపోయిన విషయం కూడా ఇన్‌ఛార్జ్ మంత్రికి చెప్పడానికి వెనకడుగు వేసిన సంబంధిత అధికారులు… ఆ తరువాత నెమ్మదిగా అసలు విషయం చేరవేశారట. విషయం తెలిసి ఇన్‌ఛార్జ్ మంత్రి కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా 13 నెలల క్రితం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా భాధ్యతలు తీసుకున్నారు. ఆయన మొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… గత కొంత కాలంగా ఆయనను పట్టించుకోవడం మానేశారనే అభిప్రాయం ఉంది.
తమకంటే జూనియర్ కావడం వల్లే… అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టించుకొవడం మానేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట్లో అడ్లూరి లక్ష్మణ్‌ను కార్యక్రమాలకు పిలిచిన మంత్రులు… ఆ తరువాత పిలవడంలేదు. సీనియర్ మంత్రులను కాదని జిల్లా అధికారులు కూడా ముందడుగు వేసే పరిస్థితి లేకపోవడంతో ఇన్‌ఛార్జ్ మంత్రికి ప్రాధాన్యత నామమాత్రంగానే మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి క్యాంప్ కార్యాలయంలోకి ఇన్‌ఛార్జ్ మంత్రికి ఎంట్రీ ఉండి ఉంటే ఇన్‌ఛార్జ్ మంత్రి తనకంటూ ఓ ఆఫీస్ కావాలని ఎందుకు అడుగుతారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారట. ఇన్‌ఛార్జ్ మంత్రి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటును సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారనే విషయం బయటకు వచ్చి… క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో రచ్చ కాకముందే జిల్లా మంత్రులు, సీనియర్ నేతలు జాగ్రత్త పడితే బెటర్ అనే అభిప్రాయం ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని చెబుతున్నారట మరికొందరు నేతలు.

