తెలంగాణ కాంగ్రెస్ మరో కొత్త సంప్రదాయానికి తెర తీయాలని చూస్తోంది. రాహుల్ గాంధీతో జరిగిన సమావేశం మొదలుకొని…ఇటీవల హైదరాబాద్ పర్యటనలో కూడా టికెట్ల కేటాయింపుపై ఒకే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆఖరి వరకు కాకుండా…అరు నెల్ల ముందే అభ్యర్థుల ప్రకటన ఉండాలని చర్చకు పెట్టారు నేతలు. మార్చిలో ఢిల్లీలో జరిగిన సమావేశం లో కూడా సీనియర్ నేతలకు కూడా క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఐతే టికెట్ల కేటాయింపులో ప్రామాణికం ఏంటనే చర్చ మొదలైంది కాంగ్రెస్‌లో. రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సమీక్షలో జనం లో ఉండే వారికి…సమస్యలపై పోరాటం చేసిన వారికి టికెట్లు అని చెప్పడంతో ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారు…ఏం చేస్తారు అనే టాక్ మొదలైంది.
కాంగ్రెస్‌కు ఇన్నాళ్లు వ్యూహకర్తలు లేరు.. కానీ ఇప్పుడు సునీల్ అనే వ్యూహకర్తను తెచ్చుకుంది. ఇప్పటికే సునీల్..పార్టీలో అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా అయన కూర్చుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేశారట. అభ్యర్ధుల ఎంపిక మీదా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు సమాచారం. అభ్యర్ధుల ఎంపికపై..రెండు మూడు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఒకే నియోజక వర్గం నుంచి…రెండు సార్లు పోటీ చేసి ఓడిపోతే…టికెట్ ఇవ్వకూడదనే సూచన చేసినట్టు సమాచారం. ఐతే రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన వారిలో…సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఒక్క ఇంట్లో రెండు సీట్లు వద్దనే పంచాయతీకి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ…ఇప్పుడు ఇంకో లిటిగేషన్ వచ్చి పడేట్టు కనిపిస్తోంది. ఒక నియోజకవర్గం నుండి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోతే టికెట్ వచ్చే ఎన్నికల్లో ఇవ్వద్దనే చర్చ జరుగుతోందట.
2018 ఎన్నికలో ఎవరెవరు ఎక్కడ..ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారనే లెక్కలు తిశారట. దీని ప్రకారమే… అంచనాలు వేస్తున్నారు అని టాక్. వరుస ఓటములు చవిచూస్తున్న నాయకులను ఈసారి పక్కన పెట్టాలని సూచన ప్రాయంగా అధిష్టానానికి చెప్పినట్టు ప్రచారం నడుస్తోంది. రెండుసార్లు ఓడిపోయిన తరువాత .. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తే సానుభూతి కలిసి వస్తుందనే చర్చ సైతం నడుస్తోంది. క్షేత్ర స్థాయిలో నివేదిక ప్రకారం టికెట్ల ఇస్తానని రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో రెండు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ల ఇవ్వరా?గ్రౌండ్‌లో బలంగా ఉంటే..పార్టీ తన ఆలోచనా కూడా మార్చుకుంటుందా?అనేదే చూడాల్సి ఉంది.
2018లోనే ప్యారాచుట్‌లకు టికెట్లు రావు…అని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ…నామినేషన్‌కి ఆఖరు రోజు అనగా.. ఓ ముగ్గురు నాయకులను పిలిచి నల్గొండ జిల్లాలో ఒకరిని…హైదరాబద్‌లో ఇంకొకరిని పోటీ చేయించింది పార్టీ. 2018లో జరిగిన వ్యవహరం మళ్లీ రిపీట్ కాదా?ఇప్పుడు చెప్పిన మాటే ఫైనల్ అయినట్టా?అనే చర్చ జరుగుతోంది.