దశాబ్దాల రాజకీయ అనుభవం, క్రెడిబిలిటీ ఉన్న ఆ ఫ్యామిలీ…నియోజకవర్గం మొత్తాన్ని ఓ మద్యం వ్యాపారికి రాసిచ్చేసిందా? రాను రాను వ్యవహారం మొత్తం పేనుకు పెత్తనం ఇచ్చిన సామెతను గుర్తు చేస్తోందా? ఇద్దకు కొడుకు, తండ్రి పెద్ద పదవుల్లో ఉండి కూడా ఓ అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని పరాయి వ్యక్తి చేతిలో పెట్టేశారా? ఏదా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ? పరిస్థితులు ఎందుకు అంత దారుణంగా దిగజారాయి?
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే షేక్ చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే… ఎమ్మెల్యే, ఎంపీ ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జానారెడ్డి కుటుంబంకంటే… ఆ షాడో మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. జానారెడ్డితోపాటు ఆయన కుమారుడు ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డికి కూడా ఏళ్ళ తరబడి సన్నిహితంగా ఉంటున్నాడు మద్యం వ్యాపారి రాజా ప్రసాద్. ఆయన వ్యవహారశైలే ఇప్పుడు వివాదాస్పదంగాను, నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు పంటికింద రాయిగాను మారిపోయిందట. షాడో సార్ పరపతి అరచేతి మందాన ఉందని, ఆయన చెప్తే పెద్దలు జానారెడ్డితో ఆయన ఇద్దరు కొడుకులు చెప్పినట్టేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి సాగర్‌లో. ఒక రకంగా కుందూరు ఫ్యామిలీ భుజాలెక్కి రాజాప్రసాద్ సవారీ చేస్తున్నారన్నది లోకల్ టాక్. అందుకే నియోజకవర్గంలో అధికారులు కూడా అంతా ఆయనే అన్నట్టు, మిగతా ఎవరైనా ఆ తర్వాతే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. జానారెడ్డితో కలిసి 40 ఏళ్లుగా రాజకీయ ప్రయాణం చేస్తున్నవారిని కూడా పక్కకు నెట్టి పెత్తనం చెలాయించడంతో పాటు కొందర్ని రాజకీయంగా కనుమరుగు చేయడంలో కూడా సక్సెస్ అయ్యారట షాడో ఎమ్మెల్యే కమ్ ఎంపీ. అన్ని విషయాల్లో ఆయన మితిమీరిన జోక్యం నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్, లీడర్స్‌కు ఇబ్బందిగా ఉందని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, జానారెడ్డి, ఆయన కుమారుడు పొజిషన్స్‌లో ఉండటంతో…. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా సదరు షాడో
పోగేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గంలో జరిగే అధికారుల బదిలీలన్నీ ఆయన కనుసన్ననల్లోనే ఉంటాయట. అందులోనూ పోలీస్ ట్రాన్స్‌ఫర్స్ అంటే సార్ యమా ఇంట్రస్ట్ అన్నది లోకల్ టాక్. రాజా ప్రసాద్ ఫోన్ చేస్తే పోలీస్ బాస్ చేసినట్లేనట. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎక్జైజ్ కార్యాలయం అయితే… మొత్తం షాడో ఆదేశాలతోనే నడుస్తుందన్న టాక్ ఉంది. స్వతహాగా లిక్కర్ వ్యాపారి కావడంతో ఆ శాఖలో రూల్స్ బ్రేక్ చేయాలన్నా, వాటిని తన ప్రత్యర్దులపై అమలు చేయాలన్నా అంతా ఆయనేనట. ఇక రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇతర ముఖ్య శాఖలలో షాడో రాజాప్రసాద్ మాటే వేద వాక్కటంటున్నారు. ఎమ్మెల్యేతో పనిలేదు… రాజాప్రసాద్ సార్‌తో ఒక్కమాట చెప్పించండి, మీ పని అయిపోతుందనే స్థాయికి అధికారులు వెళ్ళారంటే… నాగార్జున సాగర్‌లో పెత్తనం ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్స్. ఏపీ సరిహద్దు ఉండడంతో… రాష్ట్ర బోర్డర్‌లో హద్దులు చెరిపేయాలన్నా..వాటిని దాటాలన్నా షాడో చేతులు తడిపితే చాలట.
సార్ సై అంటే సరిహద్దులు చెరిగిపోతాయ్….. నై అంటే రూల్స్ అప్లై అవుతాయి. ఆఫీసర్ ఆన్ డ్యూటీ అన్నట్లుగా అధికారులు వెంటనే రంగంలోకి దిగుతారట.. ఆయనను కాదని అటు నుండి ఇటు… ఇటు నుండి అటు ఏ గ్రానైట్, మట్టి, వడ్ల లారీ బోర్డర్ దాటదని చెప్పుకుంటున్నారు. ఇక లిక్కర్‌ను సరిహద్దులు దాటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఆట. తెలంగాణ మద్యాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏపీకి పంపడంలో షాడో సిద్దహస్తుడన్నది నియోజకవర్గంలో వినింపే మాట. లిక్కర్ వ్యాపారంలో రాటుదేలిన రాజాప్రసాద్… తనకు వైన్స్ షాపులు దక్కకుంటే ఇతరులకు వచ్చిన వాటిని చేజిక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడంటున్నారు. ఆయన లిక్కర్ వ్యాపారంపైనా, షాపుల టర్నోవర్ పై కూడా అనుమానాలున్నాయి అంటున్నారు కొందరు మద్యం వ్యాపారులు. జానా రెడ్డి, ఆయన తనయులు ఎంపీ రఘవీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డితో సుదీర్ఘకాలంగా ఉన్న సానిహిత్యంచోనే వాళ్ళ పవర్స్‌ని వాడుకుని ఇలా చెలరేగుతున్నారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ఈ అరాచకాలకు చెక్ పెట్టకుంటే…. జానా ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ క్రెడిబులిటీ మొత్తం గాలి తీసేసిన బెలూన్‌లా అయిపోతుందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో.
