NTV Telugu Site icon

Munugodu TRS : మునుగోడులో చేరికలు ఊపందుకున్నాయా..?

Munugode

Munugode

Munugodu TRS : ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో మునుగోడులో చేరికలు ఊపందుకున్నాయి. ఆయారాం గయారామ్‌లకు ఫుల్‌ డిమాండ్ ఏర్పడింది. జాయినింగ్స్‌తో బలపడుతున్నట్టు భావిస్తున్నా.. అధికారపార్టీలో కొత్త రాగం అందుకుంటున్నారు లోకల్‌ లీడర్స్‌..! ప్రాధాన్యం దక్కడం లేదని రుసరుసలాడుతున్నారట.

అన్ని పార్టీల దృష్టీ మునుగోడుపైనే ఉంది. జంపింగ్‌లు జోరందుకున్నాయి. మునుగోడులో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. ఇవాళ ఒక పార్టీ శిబిరంలో కనిపించిన లోకల్‌ లీడర్స్‌.. తెల్లారేసరికి కండువా మార్చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే.. టైమ్‌ అలాంటిది అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదల కంటే ముందే పార్టీల అలజడి వేడి పుట్టిస్తోంది. దానికి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మరింత జోష్‌ ఇస్తోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌సహా వివిధ పార్టీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ మారడానికి పెద్దగా సంకోచించడం లేదు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంలో టీఆర్ఎస్‌ కాస్త స్పీడ్‌గా ఉంది. కాకపోతే ఈ వేగమే అధికారపార్టీకి స్థానికంగా కొన్ని చిక్కులు తెచ్చిపెడుతోందట.

ఇతర పార్టీల నుంచి చేరుతున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని.. వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని.. మునుగోడులో మొదటి నుంచి TRSలో ఉన్న నేతలు కినుక వహిస్తున్నారట. అన్నీ వాళ్లకేనా.. మాకేం లేదా అని ముఖం మీదే అడిగే పరిస్థితి ఉందట. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కే విధంగా కామెంట్స్‌ చేస్తున్నారట. కొత్తగా చేరిన వారికి పార్టీ అది ఇచ్చింది.. ఈ పనిచేసింది.. భవిష్యత్‌కూ భరోసా ఇచ్చింది అని స్థానిక నేతలు ఆవేదన చెందుతున్నారట. అసంతృప్తితో లోలోన రగిలిపోతున్నారట. ముఖ్యంగా టీఆర్ఎస్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా గుర్రుగా ఉన్నారట. తమను పార్టీ పెద్దలు లైట్‌ తీసుకుంటున్నారని మథన పడుతున్నారట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం దృష్టికి వెళ్లకపోతుందా? గుర్తించి ప్రాధాన్యం ఇవ్వకపోతారా అని కొందరు ఎదురు చూస్తున్నారట.

కొందరు పార్టీ ప్రజాప్రతినిధులైతే తమ దగ్గరకొచ్చిన పార్టీ పెద్దలను ముఖంమీదే నిలదీస్తున్నారట. ఫలానా పార్టీ నుంచి ఆఫర్‌ ఉంది. అరకోటి ఇస్తామని చెబుతున్నారు? మీ సంగతేంటి.. మాకేం చేస్తారు అని ప్రశ్నిస్తున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంతా చూస్తున్నట్టు కేడర్‌ మాట. ఉప ఎన్నిక రాకపోతే ఇతర పార్టీ వాళ్లను పట్టించుకుంటారా? ఇప్పుడు గళం ఎత్తకపోతే మనల్ని పక్కన పెట్టేస్తారు అని అనుచరులతో జరిగే సమావేశాల్లో చర్చిస్తున్నారట. చాలా మంది మేరా నెంబర్‌ కబ్‌ ఆయేగా అని ఎదురు చూస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదో ఒక హామీ వస్తే మనసు కుదుట పడుతుందని.. లేకపోతే ఆందోళనతో పిచ్చెక్కి పోతోందని వాపోతున్నారట. మరి.. అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు అధికారపార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.