OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్

  • ఉమ్మడి మెదక్‌ బీజేపీ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి దూరం..
  • జిల్లాలో జరిగిన ఏ నిరసన కార్యక్రమానికీ హాజరవని వైనం..
  • జిల్లా బయట పార్టీ కార్యక్రమాలకు హాజరు
Sigga

Sigga

సిగ్గా…? భయమా…? మొహమాటమా…? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన మొహమాటమా….? ఆ బీజేపీ ఎమ్మెల్సీ సొంత జిల్లాలో, సొంత పార్టీ నాయకులతో కలిసి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు? జిల్లాలో ఇతర పార్టీల నేతలతో కలిసి ప్రైవేట్‌ ప్రోగ్రామ్స్‌కు అటెండ్‌. అలాగే జిల్లా దాటితే మాత్రం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌. ఎవరా కాషాయ నేత? ఎందుకా వైరుధ్యం? సొంత ప్రాంతంలో ఆయన్ని ఆపుతున్నదేంటి?

చిన్నమైల్ అంజిరెడ్డి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఆయన తీరు ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీలో చర్చకు దారితీస్తోంది.ఎమ్మెల్సీ సొంత జిల్లా ఉమ్మడి మెదక్. కొద్ది రోజులుగా ఆయన సొంత జిల్లాలో సొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్నది ప్రస్తుతం పొలిటికల్‌ హాట్‌. కేవలం ప్రైవేట్‌ కార్యక్రమాలకు హాజరవుతూ….పార్టీ ప్రోగ్రామ్స్‌కు డుమ్మా కొడుతున్నారట. దాంతో… అంజిరెడ్డికి ఏమైందంటూ గుసగుసలాడుకుంటున్నారు జిల్లా లీడర్స్‌.

ఆగస్ట్ 31న సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట 22A కి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో మహధర్నా జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హాజరయ్యారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాత్రం ముఖం చాటేశారు. అయితే… ఆయనకు ఏదో పనుండి రాలేదని నాయకులు, కార్యకర్తలు అనుకున్నారట. అదే అంశంపై మీదనర్సాపూర్ లోనూ ఈ నెల 2న ధర్నా జరిగింది. ఇందులో పార్టీ ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు పాల్గొన్నా… మళ్ళీ అంజిరెడ్డి రాలేదు.

పటాన్‌చెరు నియోజకవర్గం బీరంగూడలో ఈ నెల 5న సుమారు 1500 22A బాధిత కుటుంబాలతో ఎంపీ రఘునందన్ రావు సమావేశమయ్యారు. బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కానీ… ఈ కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. తన సొంత నియోజవవర్గం పటాన్ చెరులో జరిగిన సమావేశానికి సైతం వెళ్ళకపోవడంతో… ఎక్కడో తేడా కొడుతోందన్న చర్చలు మొదలయ్యాయి. వాటికి ఊతమిస్తూ….అదే రోజు బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో 22A పై ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహాధర్నా కార్యక్రమానికి మాత్రం అంజిరెడ్డి హాజరయ్యారు. మరోవైపు జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ… ప్రైవేట్‌ ప్రోగ్రామ్స్‌కు మాత్రం వితౌట్‌ ఫెయిల్‌ హాజరవడం చర్చనీయాంశమైంది.

పటాన్‌చెరు బాధితుల సమావేశానికి వెళ్లని అంజిరెడ్డి… ఆ మరుసటి రోజు అదే నియోజకవర్గంలో నిర్వహించిన పొల్యూషన్ ఫ్రీ రన్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలసి పాల్గొన్నారు. అదే రోజు నర్సాపూర్ లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రోగ్రామ్‌కు స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డితో కలిసి హాజరయ్యారు. దీంతో…ఎమ్మెల్సీ… ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ కార్యక్రమాలకు ఎందుకు హాజకవడం లేదంటూ ఆరాలు మొదలైపోయాయి. రకరకాల ఊహాగానాలు పెరుగుతున్న క్రమంలో.. ఎంపీ రఘునందన్ రావుతో ఉన్న విభేదాల కారణంగానే గ్యాప్‌ మెయిన్‌ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల టైంలో ఇద్దరు నేతలు మెదక్ ఎంపీ టికెట్ కోసం పోటీపడ్డారు.

కానీ… టికెట్ మాత్రం రఘునందన్‌నే వరించింది. ఆయన లోక్‌సభ సభ్యుడయ్యారు. ఆ తర్వాత అంజిరెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అయినా ఇద్దరి మధ్య అగాధం పూడలేదని చెప్పుకుంటున్నారు. అందుకే రఘునందన్‌రావు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు అంజిరెడ్డి దూరంగా ఉంటున్నారన్న చర్చ మొదలైంది. అయితే.. నేతల మధ్య ఉన్న వైరాన్ని పార్టీ మీద చూపించడం ఏంటని అడుగుతున్నారు కార్యకర్తలు. పార్టీ బలోపేతానికి జోడెడ్లలా పనిచేయాల్సిన వాళ్ళు పంతాలకు పోతే ఎలాగంటూ నిలదీస్తున్నారు. అలాగే ఒక పోలికను కూడా చెబుతోంది కేడర్‌. ఎమ్మెల్సీ ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా… ఎంపీకి రాష్ట్ర వ్యాప్తంగా అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంటుంది.

పైగా… ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి చెప్పుకోదగ్గ నేత ఎవరైనా ఉన్నారా అంటే అది రఘునందనే. అటువంటి నాయకుడితో కలిసి పనిచేస్తే జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందే తప్ప ఏ మాత్రం నష్టం జరగదన్నది కేడర్‌ ఒపీనియన్‌. ఇతర పార్టీల నాయకులతో కలిసి ప్రైవేట్‌ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం మంచిదేకానీ..సొంత వాళ్లతో ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా సర్దుకోలేకపోతే ఎలాగన్నది సగటు కాషాయ కార్యకర్త క్వశ్చన్‌. మీకు మీకు వ్యక్తిగత వైరాలు, ఇగోలు ఉంటే మీరే చూసుకోండిగానీ… పార్టీ ప్రయోజనాలను మాత్రం పణంగా పెట్టవద్దని అంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ వివాదాన్ని ఎలా డీల్ చేస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు.