NTV Telugu Site icon

Khammam Politics : ఖమ్మంపై ప్రధాన పార్టీల కన్ను..బలం పుంజుకునేందుకు స్ట్రాంగ్ ఫోకస్

Khammam

Khammam

Major parties  on Khammam..Strong focus to regain strength

అది రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా. తెలుగు రాష్ట్రాలలో పేరెన్నిక గన్న నేతలు ఎందరో అక్కడ నుంచి చట్ట సభలకు ఎన్నికయ్యారు. జనాల నాడి చిక్కితే పార్టీలకు పండగే. లెక్కలు తేడా కొట్టాయా.. నేతల జాతకాలు మారిపోతాయి. అలాంటి జిల్లాపై ప్రధాన పార్టీలు ఒకేసారి ఫోకస్‌ పెట్టాయి. రాజకీయ చదరంగం మొదలు పెడుతున్నాయి. ఆ జిల్లా ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

మిషన్‌ ఖమ్మం. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చగా మారిన ప్రాంతం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కమ్యూనిస్ట్‌ల ప్రభావం ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో లెఫ్ట్ కూటమితో జత కట్టి జిల్లాలో టీడీపీ బలంగా కనిపించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ సత్తా చాటింది. 2014లో జిల్లాలో టీఆర్‌ఎస్‌కు దక్కింది ఒకే ఒక సీటు. 2018లోనూ అదే పరిస్థితి. రాజకీయ కారణాలతో వివిధ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కారెక్కేసినా.. ఎన్నికల ముఖచిత్రం చెప్పే లెక్కలు వేరు. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతుంటే.. పట్టు నిలుపుకొనేందుకు కాంగ్రెస్‌ చూస్తోంది. ఈ రెండు పార్టీల వార్‌ ఇలా ఉంటే.. కొత్తగా బీజేపీతోపాటు షర్మిల పార్టీ సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే కన్నేశాయి. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు సైతం.. జిల్లాలో టీడీపీ పుంజుకునేందుకు సానుకూల వాతావరణం ఉందని ప్రకటించారు. అందుకే ప్రధాన పార్టీ ఎత్తుగడలు మిషన్‌ ఖమ్మం రాజకీయాలను ఆసక్తిగా మలుస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు జిల్లాలో ఉద్దండులైన నాయకులు ఉన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న కొందరు గతంలో ఇదే జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన వాళ్లే. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో గెలిచిన రెండే రెండు సీట్లు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే. అశ్వారావుపేట.. సత్తుపల్లిలో టీడీపీ పాగా వేసినా.. తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలు సండ్ర వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు గులాబీ గూటికి వెళ్లిపోయారు. ఏపీ రాజకీయాలపై చంద్రబాబు ఎక్కువగా ఫోకస్‌ పెట్టడంతో తెలంగాణలో సైకిల్‌ చతికిల పడింది. ఆ ప్రభావం ఖమ్మంజిల్లాలోనూ కనిపించింది. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. జనాల స్పందన చూశాక కొత్త లెక్కలు వేస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లా టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై.. టీడీపీ పుంజుకునేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంతటితో ఆగకుండా సెప్టెంబరులో భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేయాలని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు పర్యటనకు కొద్దిరోజుల ముందు.. భద్రాచలం తదిత వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పర్యటించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ దఫా పర్యటనలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి జిల్లాలో పార్టీలకు అతీతంగా తుమ్మల నాగేశ్వరరావును పెద్ద మనిషిగా చూస్తారు. గత ఎన్నికల్లో ఓడినా.. ఆయన సైలెంట్‌ అయ్యారు కానీ.. ఇతర నాయకుల్లా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. అంతేకాదు.. జిల్లాలో ఆయనకు అభిమానులు.. అనుచరులు ఎక్కువ. ఆ సంగతి సీఎం కేసీఆర్‌కు తెలుసు. 2018లో రెండోసారి టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో జరిగిన పరిణామాలు డేంజర్‌ బెల్స్‌ మోగించేలా ఉండటంతో.. పరిస్థితిని చక్కదిద్దేందుకే తుమ్మలకు సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. ఇంకోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం టీఆర్ఎస్‌ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ రెండు మార్పులు జిల్లాలో మరింత బలంగా టీఆర్‌ఎస్‌ పాగా వేయడం కోసమే అన్నది విశ్లేషకుల మాట.

కాంగ్రెస్‌కు జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కొందరు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయినా.. మిగతా వాళ్లను ఆపి హస్తం గూటిలోనే ఉండేలా సక్సెస్‌ అయ్యారు. ఈ మధ్య కాలంలో పాదయాత్ర ద్వారా జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో చురుకు పుట్టించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉన్న జిల్లాల్లో ఖమ్మం మొదటి ప్లేస్‌లో ఉందనేది ఆ పార్టీ నేతలు చెప్పేమాట. ఇటీవల మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావును కాంగ్రెస్‌ గూటికి ఆహ్వానించడం ద్వారా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు జిల్లాలో తెరతీసింది కాంగ్రెస్‌.

రాజకీయంగా నిలుదొక్కుకోవాలని చూస్తున్న వైఎస్‌ షర్మిల సైతం వైఎస్‌ఆర్‌టీపీని ఖమ్మంలోనే ప్రారంభించారు. జిల్లాలో విస్తృతంగా పాదయాత్ర చేసిన షర్మిల.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయడానికి చూస్తున్నారు. పాలేరులో పోటీ చేస్తే ఆ ప్రభావం మరికొన్ని నియోజకవర్గాల్లో ఉంటుందని.. పార్టీకి తొలి ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని షర్మిల అండ్‌ కో ఆలోచన. 2014లో వైసీపీకి ఇదే జిల్లాలో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. ఆ కోణంలోనూ జిల్లాపై ఆశలు పెట్టుకున్నారు షర్మిల. ఇక బీజేపీ నేతలు సైతం జిల్లాలో బలం పెంచుకోవాలని చూస్తున్నారు. టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలకు వల వేయాలని అనేక ప్రయత్నాలు చేశారు బీజేపీ నేతలు. అలా మాజీ ఎంపీ పొంగులేటికి గాలం వేశారని ప్రచారం జరిగింది. ఆ మధ్య ఖమ్మంలో జరిగిన ఘటన ద్వారా రాజకీయ లబ్ధికోసం వ్యూహ రచన చేసినా.. అంతగా వర్కవుట్‌ కాలేదు. మరి మిషన్‌ ఖమ్మంలో ఎవరెలా సత్తా చాటుతారో… ఎవరి ఎత్తుగడలు ఫలిస్తాయో చూడాలి.