Site icon NTV Telugu

Leaders Land Kabja: ఖాళీ జాగా కనిపిస్తే హాంఫట్

ఖాళీ జాగా కనిపిస్తే హాంఫట్‌..! కబ్జాల యవ్వారం పార్టీ పెద్దల వరకు వెళ్లిందట. సమస్య శ్రుతిమించడంతో హైకమాండ్‌ క్లాస్‌ తీసుకుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అక్కడి టీఆర్ఎస్‌ రాజకీయం వేడెక్కిందట.

ఆదిలాబాద్‌లో స్థానిక ప్రజాప్రతినిధుల కబ్జాలు
ఇటీవల నిర్మల్ మున్సిపల్ వైస్‌చైర్మన్ ఓ బాలికపై అత్యాచారం కేసులో అరెస్ట్ కావడం చర్చగా మారింది. అప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల పనితీరుపై పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోందట. ఆ క్రమంలోనే ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ల ఆక్రమణల పర్వం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఇక్కడ కొందరు కౌన్సిలర్ల అరాచకాలు శ్రుతిమించినట్టు గుర్తించారట. వార్డుల పరిధిలో ఖాళీ జాగా కనిపిస్తే వెంటనే ఆక్రమించేస్తున్నారట. చివరకు ప్రభుత్వ స్థలాలను స్వాహా చేస్తున్నట్టు తెలిసిందట. డోర్‌ నెంబర్లు ఇప్పించేసుకోవడం.. మ్యూటేషన్లు కానిచ్చేయడం సంచలనంగా మారినట్టు చెబుతున్నారు.

రెడ్‌క్రాస్‌కు ఇచ్చిన భూమిని వశం చేసుకున్న నేతలు?
భూ కబ్జాలపై బీజేపీ నేతలు కొన్ని ఆధారాలను బయటపెట్టడంతో వాటిపై చర్చ జరుగుతోంది. ఇది రాజకీయ రగడగా మారే సూచనలు కనిపించడంతో.. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న అలర్ట్‌ అయ్యారట. పార్టీ పెద్దలు చెప్పారో ఏమో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజాప్రతినిధులను పిలిచి గట్టిగానే చీవాట్లు పెట్టారట. అధికార పార్టీకి 30 మంది కౌన్సిలర్లు ఉంటే.. వారిలో 10 నుంచి 15 మందిపై కబ్జా మరకలు ఉన్నాయట. మాజీ ఎంపీ నగేష్ ఇంటి వెనక ఉన్న భూమిలో కొంత రెడ్‌క్రాస్‌కు ఇచ్చారు. అందులో ముగ్గురు కౌన్సిలర్లు మట్టిపోయించి వశం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఆ గొడవ తీవ్ర చర్చకు దారితీసింది. రచ్చ రచ్చ అయింది.

ప్రభుత్వ భూమిలో ప్లాట్లు.. ఇల్లు కట్టి అమ్మకాలు
మరో ఏరియాలో పెద్ద నాలాకు టీఆర్‌ఎస్‌ నేత ఎసరు పెడితే.. అందులో వాటా కావాలని పత్రాలు సృష్టించారట మరో కౌన్సిలర్‌. చివరకు వారిద్దరూ సెటిల్‌ చేసుకున్నట్టు సమాచారం. అక్కడ బఫర్‌ జోన్‌లో కట్టిన రక్షణ గోడను కూల్చేయడంపై అధికారులు కిమ్మనడం లేదు. రణదివే నగర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీలలో కొందరు కౌన్సిలర్లు ప్లాట్లుగా మార్చి రియల్‌ బిజినెస్‌ చేస్తే..ఇంకొందరు ఇల్లు కట్టేసి వాటిని అమ్మేశారు కూడా. నేతాజీ చౌక్‌లో ఎయిర్‌ఫోర్స్‌ భూమిని మింగేశారు మరికొందరు. స్థలాలు ఖాళీగా ఉంటే భద్రత లేకుండా పోయిందనేది స్థానికులు వాపోతున్నారు. వాటికి డోర్‌ నెంబర్లు ఇచ్చేస్తుండటం.. మ్యూటేషన్లు చేసేస్తుండటం కలకలం రేపుతోంది.

ఎమ్మెల్యే వార్నింగ్‌తో దారికి వస్తారా?
రిక్షా కాలనీలో మున్సిపల్‌ పార్క్‌ కోసం కేటాయించిన భూమిని ఏకంగా 8 ప్లాట్లుగా చేసిన కౌన్సిలర్లు.. వాటిని బంధువుల పేర్ల మీద బదలాయించేశారట. మొత్తం మీద ఆదిలాబాద్‌ టీఆర్ఎస్‌లో భూ కబ్జాలపై పెద్ద రగడే జరుగుతోంది. ఈ చర్యలు పార్టీకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారట. మరి.. ఎమ్మెల్యే వార్నింగ్‌లకు స్థానిక ప్రజాప్రతినిధులు దారిలోకి వస్తారో లేక పార్టీ అధిష్ఠానం కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తుందో చూడాలి.

Exit mobile version