ఐడీపీఎల్ భూముల ఆక్రమణదారులు ఎవరు? ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణల్లో ఏది నిజం? తేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భూముల్ని ఆబగా ఆక్రమించుకుందామనుకున్నది ఎవరు? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? దొంగ ఎవరో, దొర ఎవరో తేలిపోతుందా?
Also Read:Taliban: భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘాన్ తాలిబాన్లు, ఇక పాకిస్తాన్ ఎండిపోవాల్సిందే..
మూతపడ్డ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్ భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో పొగలు పుట్టిస్తోంది. హైదరాబాద్ కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ భూములు ఉన్నాయి. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో భారత ఔషధరంగానికే ఒకప్పుడు తలమానికంగా నిలిచిన ఈ ఫ్యాక్టరీ కాలక్రమంలో మూతపడింది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా రంగం అభివృద్ధి చెందడానికి మూలం ఈ కంపెనీయేనని చెప్పుకుంటారు. అలాంటి ఫ్యాక్టరీకి కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నెంబరు 376లో వందల ఎకరాల భూములున్నాయి. వాటిలో కొంతవరకు ఆక్రమణలు జరిగాయి. స్థానికులు కొందరు.. పాకలు, షెడ్లు వేసుకుని ఉంటున్నారు. పేదల నివాసాల సంగతి అలా ఉంచితే…. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భారీ ఎత్తున ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భూముల్ని ఆక్రమించారని ఆరోపిస్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.
కానీ.. తనకు అలాంటి బుద్దులు లేవని, అసలా అవసరమే లేదని, దానికి సమీపంలో చట్టబద్ధంగా కొంత భూమిని కొనుక్కున్నానని చెబుతున్నారు ఎమ్మెల్యే. ఈ క్రమంలోనే వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూమి చుట్టూ రాజకీయ ముసురు అలముకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించి రకరకాల ఆరోపణలు వచ్చాయి. కానీ… ఈసారి డైరెక్ట్‌గా కూకట్‌పల్లి ఎమ్మెల్యే ప్రస్తావన ఉండటం, అందులోనూ కవిత నోటి నుంచి ఆ మాటలు రావడంతో… సంచలనమైంది. తెర వెనక ఏదో జరిగిపోతోంది. నిప్పు లేకుండా పొగ రాదు కదా, కవిత లాంటి వ్యక్తి అలా ఎందుకు ఆరోపించారంటూ రకరకాల చర్చలు మొదలైపోయాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే… ఇవే భూములకు సంబంధించి కవిత మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్, ప్రస్తుతం ప్రభుత్వంలోని ఓ పెద్దకు చెందిన బినామీ కలిసి బాలానగర్ మండల పరిధిలోని వందల కోట్ల విలువ చేసే 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారంటూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు అక్టోబర్ 23న ఫిర్యాదు చేశారు కొంద స్థానికులు.
కవిత భర్త అనిల్ పేరుతో తప్పుడు పత్రాలను సృష్టించి సర్వే నంబర్ 2010/4లో ఐడీపీఎల్‌కు చెందిన 20 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నది ఫిర్యాదు సారాంశం. ఓవర్లాపింగ్ అయిన సర్వే నంబర్స్‌ను ఆధారంగా చేసుకుని కబ్జా పర్వాన్ని నడిపించారని ఆరోపిస్తున్నారు. తప్పుడు పత్రాలతో నిర్మాణాలు చేసి ఫ్లాట్స్ అమ్మకాలు కూడా మొదలు పెట్టారంటూ ఈటల దృష్టికి తీసుకు వచ్చారు కొందరు. దీనిపై అనేక సార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేసినా, స్పందించడం లేదన్నారు. అయితే… కవిత భర్త భూములు కబ్జా చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావే మొదట ఆరోపించాని, అందుకే గత పదేళ్లలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే చేసిన భూ కబ్జాలు అంటూ… కవిత బయటపెట్టారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి.
Also Read:Himachal Pradesh Video: లోతైన లోయలో పడిపోబోయిన వ్యాన్.. తర్వాత ఏమైందంటే..!
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆరోపణలు, ప్రత్యారోపణల క్రమంలో నిజానిజాలు బయట పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఐడీపీఎల్ భూములను సర్వే చేసి ఆక్రమణకు గురయ్యాయా? లేదా అన్నది తేల్చి చెప్పమంది. ఇందుకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందబోతున్నట్టు సమాచారం. దీంతో పరస్పరం వేళ్ళు చూపించుకుంటున్న వాళ్ళలో ఎవర్ని నివేదిక తప్పు పడుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
