ఒకప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటమి తెచ్చిన నైరాశ్యమో.. లేక పార్టీ ఇచ్చిన పదవితో సంతృప్తి పడుతున్నారో కానీ.. నియోజకవర్గానికి రావడం మానేశారు ఆ కాంగ్రెస్ లీడర్. మాట్లాడితే ఢిల్లీ తప్పితే ఆయన అడ్రస్ సెగ్మెంట్‌లో కానరావడం లేదట. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా.. ఎందుకీ నైరాశ్యం? ఎవరా నాయకుడు?
రెండు ఓటములు కుంగదీశాయా?
చల్లా వంశీచంద్‌రెడ్డి. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే.. AICC కార్యదర్శి. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా కూడా రావడం లేదనే చర్చ కల్వకుర్తి కాంగ్రెస్‌లో ఉంది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటూ 2014లో పార్టీ టికెట్ సంపాదించి.. ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018 ఎన్నికల్లో మాత్రం అదే కల్వకుర్తిలో మూడో ప్లేస్‌కు పడిపోయారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినా.. అక్కడా చేదు ఫలితం తప్పలేదు. ఆ రెండు వరుస ఓటములు కుంగదీశాయో ఏమో.. కల్వకుర్తికి వంశీచంద్‌రెడ్డి వస్తే ఒట్టు. ఏదో కల్వకుర్తికి వచ్చామంటే వచ్చామన్నట్టుగా ఆయన పర్యటనలు ఉంటున్నాయట. పార్టీ క్రియాశీలక కార్యక్రమాల్లోనూ మాజీ ఎమ్మెల్యే కనిపించడం లేదట. దీంతో చుక్కాని లేని నావలా తయారైందట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాపార్టీపై గట్టిగా పోరాడి గెలిచిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. వంశీ వైఖరి వల్లే అంతా వెళ్లిపోతున్నారని చెవులు కొరుక్కుంటోంది కేడర్.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ దూరం
మొదటి నుంచి కల్వకుర్తిలో కాంగ్రెస్‌కు గట్టి పట్టే ఉంది. జైపాల్‌రెడ్డి, చిత్తరంజన్‌దాస్ వంటి నేతలు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి మూడో స్థానానికి పడిపోవడానికి కారణాలేమైనప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకుంది. ఆ సమయంలో వంశీచంద్‌రెడ్డి కాస్త ఫోకస్ పెట్టి ఉంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉండేవనేది పార్టీ శ్రేణుల అభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ.. తర్వాత వంశీ ముఖం చాటేయడంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీపీలు, జడ్పీటీసీలు.. మున్సిపల్ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా పార్టీ వీడే యోచనలో ఉన్నారట. కొందరు ఇప్పటికే ప్లేటు ఫిరాయించేశారు. ఆ మధ్య కల్వకుర్తిలోని వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నేతలతో వంశీ సమావేశం అయ్యారు. అప్పటి వరకు అసంతృప్తిని ఉగ్గబట్టుకుని ఉన్న పార్టీ నేతలు ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఢిల్లీకి, హైదరాబాద్‌కే పరిమితమై.. పారాచూట్ లీడర్‌గా వ్యవహరిస్తే ఎన్నికల వేళ ఓట్లు ఎలా పడతాయని వంశీని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారట.
తానే పోటీ చేస్తానంటున్న వంశీ
వచ్చే ఎన్నికల్లో మీరే పోటీ చేస్తారా.. ఇంకెవరైనా బరిలో ఉంటారో స్పష్టత ఇవ్వాలని కొందరు పార్టీ నేతలు వంశీని గట్టిగా డిమాండ్ చేశారట. తానే పోటీ చేస్తానని వారి ప్రశ్నలకు సమాధానంగా చెప్పారట వంశీ. అయితే ప్రస్తుతం తన అవసరం పార్టీకి.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఎంతో ఉందని.. అందుకే అక్కడ ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని వంశీ చెప్పుకొచ్చారట. తన పరిస్థితిని అర్థం చేసుకుని కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీని మీరే ముందుండి నడిపించాలని కోరారట ఈ మాజీ ఎమ్మెల్యే. అయితే ఈ సమాధానానికి పార్టీ నేతలు పెద్దగా సంతృప్తి వ్యక్తం చేయలేదట. ప్రత్యర్థి పార్టీలు జోరుగా ఉన్న సమయంలో ఈ వైఖరి సరికాదని చెవులు కొరుక్కున్నారట.
కర్చీఫ్ వేస్తోన్న కాంగ్రెస్ ఆశావహులు
ఇదే టైమ్‌లో కల్వకుర్తి కాంగ్రెస్‌లో కొందరు నాయకులు ఓ రాయి వేస్తే పోలా అని టికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారట. పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువ అవుతూ.. కాంగ్రెస్ కేడర్‌ను పలకరిస్తూ జనాల్లో తిరుగుతున్నారు. పరిస్థితులు మారి అధిష్ఠానం టికెట్ ఇస్తే పోటీ చేయాలని చూస్తున్నారట. వంశీ వైఖరితో విభేదిస్తున్న వాళ్లను ఆశావహులు చేరదీస్తున్నారట. ఇతర పార్టీలకు చెందిన ఒకరిద్దరు నేతలు చివరి క్షణంలో కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. మరి.. రానున్న రోజుల్లో కల్వకుర్తి కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.