Site icon NTV Telugu

Jupally Tension: జంక్షన్‌లో జూపల్లి జామ్‌

ఒక్క ఓటమితో పొలిటికల్‌ తెరపైనుంచి కనుమరుగయ్యారు ఆ మాజీ మంత్రి. ఇప్పుడు భవిష్యత్‌ ఏంటో తెలియడం లేదట. ఉన్నచోటే అవమానాలను భరించాలా? లేక పాతచోటుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు ఆ మాజీ మంత్రి. పొలిటికల్‌ జంక్షన్‌లో నిలుచుని అటూ ఇటూ దిక్కులు చూస్తున్న ఆ నాయకుడు ఎవరు? ఏమా కథ?

కొల్లాపూర్‌లో జూపల్లి ఉనికి ప్రమాదంలో పడిందా?
జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ మంత్రిగా పనిచేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీన్‌ రివర్స్‌. జూపల్లి స్పీడ్‌కు బ్రేక్‌లు పడ్డాయి. ఓడినా పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అని సరిపెట్టుకోవడానికి కూడా లేకపోయింది. జూపల్లిపై నెగ్గిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో కొల్లాపూర్‌ రాజకీయాలు మారిపోయాయి. మాజీ మంత్రి ఉనికే ప్రమాదంలో పడిపోయింది.

తన వర్గాన్ని కాపాడుకునే పనిలో జూపల్లి
కొల్లాపూర్‌ టీఆర్ఎస్‌లో వర్గపోరు ఓ రేంజ్‌లో ఉంది. జూపల్లి వర్గానికి.. ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి వర్గానికి అస్సలు పడటం లేదు. పార్టీ పెద్దలు కూడా ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వడం.. చేతిలో ఏ పదవీ లేకపోవడంతో అంతర్మథనంలో పడ్డారు జూపల్లి. ఒకే ఒక్క ఓటమితో రాజకీయ భవిష్యత్‌ అర్థంకాక ఆందోళన చెందుతున్నారట. జరిగిందేదో జరిగిపోయింది.. ఇకపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు మాజీ మంత్రి వర్గీయులు చెబుతున్నారు. తన వర్గాన్ని కాపాడుకుంటూనే.. ప్రత్యర్థి శిబిరంలోని వారితోనూ టచ్‌లోకి వెళ్తున్నారట.

టీఆర్ఎస్‌ టికెట్‌ ఇస్తుందనే ఆశ అలాగే ఉందా?
మాజీ మంత్రి జూపల్లిపై ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీలు గాలం వేసినట్టు లీకులు వస్తున్నా.. స్పందన లేదు. అయితే జూపల్లి తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తే .. హస్తం పార్టీ స్వింగ్‌లోకి వస్తుందని.. మెరుగైన ఫలితాలు సాధించొచ్చని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోందట. కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో జూపల్లికి ఉన్న సంబంధాలు కలిసి వస్తాయని అనుకుంటున్నారట. ఇదే విషయం కాంగ్రెస్‌ హైకమాండ్‌ వరకు వెళ్లినట్టు సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థుల మార్పు తప్పదని.. ఆ కోటాలో మళ్లీ జూపల్లికి టీఆర్ఎస్‌ పిలిచి టికెట్‌ ఇస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. పైగా పార్టీ పెద్దల నుంచి ఆ మేరకు సంకేతాలు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వకపోతే రెబల్‌గా బరిలోకి?
ఒకవేళ గులాబీ పార్టీ టికెట్‌ దక్కకపోతే.. సింహం గుర్తుపై తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగి సత్తా చాటాలనే ఆలోచన కూడా మాజీ మంత్రి శిబిరంలో ఉందట. స్వతంత్ర అభ్యర్థిగా గెలిస్తే.. అధికారంలోకి వచ్చే పార్టీతో జత కట్టడం మేలనే అభిప్రాయంలో జూపల్లి ఉన్నట్టు సమాచారం. 2004లో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ టికెట్‌ దక్కపోతే విమానం గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారట. మరి.. జంక్షన్లో చిక్కుకున్న జూపల్లి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Exit mobile version