Site icon NTV Telugu

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలకు, ప్రజలకు మధ్య గ్యాప్‌..!

ఆ జిల్లాలోని ముఖ్య నేతలంతా కేరాఫ్‌ హైదరాబాద్‌. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేదు. అందరు నాయకులదీ అదే తీరు. ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన నేతలు.. స్థానిక ప్రజలకు దూరంగా ఉంటున్నారట. దీంతో ప్రజలకు.. వాళ్లు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ వస్తుందని టాక్‌. ఇంతకీ ఏంటా జిల్లా? నాయకులు ఎందుకు జిల్లాలో ఉండటం లేదు?

రెండేళ్లుగా ప్రజలకు దూరంగా ప్రజాప్రతినిధులు..!

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా. రాజకీయ చైతన్యం ఎక్కువే. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి కాకలు తీరిన రాజకీయ నాయకులు ఈ జిల్లాలోనే ఉన్నారు. ముగ్గురు మంత్రులు. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. నిత్యం సందడిగా ఉండాల్సిన చోట.. ఎక్కడో లెక్క తేడా కొడుతుందని జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, కరీంనగర్‌ ఎంపీగా ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ఇలా పదవుల్లో ఉన్నవారు.. ఎన్నికల్లో ఓడిన వాళ్లూ చాలా మంది ఉమ్మడి జిల్లాకు చెందినవాళ్లే. గడిచిన రెండేళ్లుగా ప్రజలకు ప్రజాప్రతినిధులెవరూ అందుబాటులో ఉండటం లేదు.

ప్రజలకు అందుబాటులో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలే ఉంటున్నారా?
అధికార, విపక్ష నాయకులంతా హైదరాబాద్‌లోనే మకాం..!

2020 ఆరంభలో కరోనా.. 2021లో కరోనా సెకండ్‌ వేవ్‌.. ఆ తర్వాత హుజురాబాద్‌ ఉపఎన్నిక.. అంతకుముందు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల ప్రజాప్రతినిధులంతా తమ నియోజకవర్గాలను వదిలి ఎలక్షన్స్‌కు పనిచేయాల్సి వచ్చింది. దీంతో ప్రజలకు దగ్గరగా ఉన్నది తక్కువే. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగతావాళ్లు ఎవరూ స్థానికంగా ఉండటం లేదు. అధికార, విపక్ష పార్టీల నాయకులంతా హైదరాబాద్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. స్థానికంగా ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా.. పనులు కావాల్సి ఉన్నా.. తమ ఎమ్మెల్యేనో.. ఎంపీనో కలవడానికి హైదరాబాద్‌ వెళ్లాల్సిందే. వ్యయ ప్రయాసలు కూర్చి భాగ్యనగరం చేరుకున్నా.. ఎమ్మెల్యే ఎంపీలు తమ సమస్యను ఆలకిస్తారన్న గ్యారెంటీ లేదు. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలను చాలా మంది గాలికొదిలేశారనే విమర్శలు పెరుగుతున్నాయి.

ఎమ్మెల్యే, ఎంపీలను ప్రత్యక్షంగా చూసి చాలా రోజులైందని సెటైర్లు..!

హుజురాబాద్‌ ఉపఎన్నిక కోసం ఆరు నెలలు చాలా మంది ఎమ్మెల్యేలు అక్కడే మకాం వేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపులకు తీసుకెళ్లారు. మరి.. ప్రజలను పట్టించుకున్నది ఎవరు అంటే.. సెల్‌ఫోన్లే అని చెప్పాలి. అంతా ఫోన్ల ద్వారా నడిపించేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేను.. ఎంపీని ప్రత్యక్షంగా చూసి చాలా రోజులైందనే సెటైర్లు ప్రజల నుంచి వస్తున్నాయి. పైగా నియోజకవర్గాల్లో కుస్తీ పడుతున్న అధికార, విపక్ష పార్టీల నాయకులు.. హైదరాబాద్‌లో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఖుషీ ఖుషీగా కాలం వెళ్లదీస్తున్నారట.

నెలలో పదిరోజులైనా అందుబాటులో ఉండాలని వినతి..!

రాజకీయంగా పెద్ద పోస్టుల్లో ఉండొచ్చు… కాదనలేం. కానీ.. తాము ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే, ఎంపీలు నెలలో కనీసం పదిరోజులైనా నియోజకవర్గాల్లో అందుబాటులో లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. మరి.. ఈ అంశాన్ని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గమనించారో లేదో..!


Exit mobile version