Site icon NTV Telugu

ధర్మాన కృష్ణదాస్ కు ఆ పదవి కత్తిమీద సామే..అది పెద్ద సవాలేనా ?

Dharmana

Dharmana

ఏపీలో అధికారపార్టీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. ప్రభుత్వపరంగా, పార్టీ రీత్యా అంతా సెట్ చేస్తున్నరు అధినేత. ఇప్పటి నుంచే నేతలు, ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లాలని.. ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌కు శ్రీకాకుళం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు కృష్ణదాస్‌కు భారంగా మారబోతున్నట్టు టాక్‌. సౌమ్యుడిగా పేరున్న ఆయన గ్రూపుల గోలను ఏ విధంగా సెట్‌ చేస్తారో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్లలో వైసీపీకి ఇంటిపోరు తప్పడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తలు పూర్తి నిరుత్సాహంతో ఉన్నారట. వారిని కృష్ణదాస్‌ ఎలా చైతన్యం చేస్తారన్నది ప్రస్తుతం ప్రశ్న.

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ మూడు గ్రూపులు.. ఆరు కూటమూల చందంగా ఉంది. ఎక్కడ చూసినా లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు అన్ని చోట్లా గ్రూపుల గోలే. అసంతృప్తులు ఎక్కువయ్యారు. వారందరినీ కృష్ణదాస్‌ ఎలా బుజ్జగిస్తారన్నది పెద్ద సందేహం. ఇచ్ఛాపురంలో నేతలు ఎక్కువ.. కేడర్‌ తక్కువ. జడ్పీ ఛైర్మన్‌ పిరియా విజయ కుటుంబానికి వ్యతిరేకంగా అక్కడ పావులు కదుపుతోంది ఒక వర్గం. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. మున్సిపాలిటీలో వైసీపీ నేతల వ్యవహారం రచ్చ రచ్చగా మారుతోంది. టెక్కలి వైసీపీలో షరా మామూలే. దువ్వాడ శ్రీనివాస్‌, పేరాడ తిలక్‌, కిల్లి కృపారాణిలు మధ్య మూడు ముక్కలాటలా మారింది. ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ వర్సెస్‌ యాంటీ గ్రూప్‌ అన్నట్టుగా ఉంది. ఎచ్చెర్లలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ద్వితీయశ్రేణి నేతలు ప్రెస్‌మీట్స్‌ పెడుతున్నారు.

ఈ గొడవల్లో కొన్ని వైసీపీ అధిష్ఠానం వరకు వెళ్లాయి. కానీ.. సమస్య పరిష్కారం కాలేదు. ఎవరికి వారు గ్రూపులు కట్టి అవకాశం దొరికితే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. 2019లో జగన్‌ మేనియాలో గ్రూపుల ఎఫెక్ట్‌ పెద్దగా పనిచేయలేదు. కానీ.. ఈసారి అన్నీ లెక్కల్లోకి వస్తాయి. వాటిని సరిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. సిక్కోలు జిల్లాలో టీడీపీకి బలగం ఉంది. వారిని ఎదుర్కోవాలంటే వైసీపీ నేతలు కలిసి సాగక తప్పదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు.. ఇంత వరకు ఉప్పు నిప్పులా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావులు కృష్ణదాస్‌కు ఎంత వరకు సహకరిస్తారన్నది పార్టీలో చర్చ.

ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయంలో మంత్రి సీదిరి అప్పలరాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతా సమానమేనని.. మంత్రి.. కార్యకర్త ఒకటేనని అంటూనే పార్టీ లైన్‌లో లేనివారు ఎవరైనా కొరడా ఝులిపించాలని సూచించారు. మరి.. ఇన్ని సవాళ్ల మధ్య వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్‌ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

Watch Here : https://youtu.be/0s1Hei0jWko

Exit mobile version