NTV Telugu Site icon

ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకుడు ఇప్పుడు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నాడా..?

Mondi Cheyii

Mondi Cheyii

మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు. అప్పట్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్‌ తెరపై మండవ పేరు పెద్దగా వినిపించలేదు. కొన్నాళ్లు రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకొన్నారు. సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్లి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. రాజకీయంగా పాత పరిచయాలు.. స్నేహం ఉండటంతో సైకిల్‌ దిగి.. కారెక్కేశారు మండవ. ఆ సమయంలోనే మాజీ మంత్రికి మంచి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే పదవుల కోసం పార్టీ మారలేదని ఆయన పదే పదే చెప్పినా.. అనుచరులు మాత్రం తమ నేత నెంబర్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటమే సరిపోతోంది. పైగా తెలంగాణలో రాజ్యసభ, శాసనమండలి స్థానాల భర్తీకి షెడ్యూల్‌ వచ్చిన ప్రతిసారీ మండవ పేరు చర్చల్లోకి రావడం.. తర్వాత ఉస్సూరుమనడం కామనైపోయింది. తాజాగా రాజ్యసభ స్థానాల భర్తీలోనూ మాజీ మంత్రికి మరోసారి మొండిచెయ్యేనని చెవులు కొరుక్కుంటున్నారు.

మండవ గులాబీ గూటికి చేరి మూడేళ్లు అవుతోంది. ఆయన కంటే కొద్దీ రోజుల ముందు కారెక్కిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిని రాజ్యసభ సభ్యుడిని చేశారు. మండవకు మాత్రం అలాంటి ఒక్క ఊరట దక్కలేదు. ఇంకా టైమ్‌ రాలేదని అనుకున్నారో ఏమో మళ్లీ కొద్దిరోజులుగా మౌనంగా ఉంటున్నారు మాజీ మంత్రి. ఆయన్ను నమ్ముకున్న అనుచరులు మాత్రం ఏదో ఒక పదవితో మళ్లీ యాక్టివ్ కావాలని ఒత్తిడి తెస్తున్నారట. ప్రస్తుతం ఒక ఉపఎన్నికతోపాటు మరో రెండు రాజ్యసభ స్థానాల భర్తీకి షెడ్యూల్‌ వచ్చింది. వీటిల్లో ఒకటి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీ శ్రీనివాస్‌ పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సీటు ఉంది. ఆ స్థానాన్ని మండవకు కట్టబెడతారని ప్రచారం జరిగింది. అధిష్ఠానం దగ్గర పేరు చర్చకు వచ్చినా.. సామాజిక సమీకరణాల వల్ల చివరి నిమిషంలో రేసు నుంచి తప్పించారని అనుకుంటున్నారట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి మండవ అనుచరులు డీలా పడ్డారట.

జరుగుతున్న పరిణామాలకు నొచ్చుకున్నారో ఏమో రాజకీయాలకు దూరంగా ఉండాలని మండవ భావిస్తున్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది. అనుచరులు మాత్రం దానికి ఒప్పుకోవడం లేదట. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవులు దక్కకపోయినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారట. టీఆర్ఎస్‌ పెద్దల ఆలోచనల్లోనూ మండవ గురించి ఇదే అభిప్రాయం ఉందని టాక్‌. ఈ ప్రతిపాదనపై మండవ ఏమనుకుంటున్నారో బయటకు రాలేదు. పార్టీ పెద్దల బుజ్జగింపులకు స్పందనేంటో అని కేడర్‌ ఆరా తీసే పరిస్థితి ఉంది. ఒకవేళ అసెంబ్లీ బరిలో ఉండాలని నిర్ణయిస్తే.. ఎవరి సీటు ఖాళీ చేస్తారనే చర్చ కూడా ఊపందుకుంటోంది. మరి.. మాజీ మంత్రి మళ్లీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తారో లేదో చూడాలి.