Site icon NTV Telugu

BJP :ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటినుంచే ప్రయత్నిస్తున్నారా?

Somu Veer Raju

Somu Veer Raju

సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. గతంలో ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టారు. ఈసారి మాత్రం ఎన్నికల్లో గెలిచి తీరాలనే లెక్కలు వేస్తున్నారట. అందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట వీర్రాజు. ఆయన సొంతూరు కాతేరు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. అయితే ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఒకవేళ అధిష్ఠానం అసెంబ్లీకి పోటీ చేయమంటే రాజమండ్రి అర్బన్ నుంచి బరిలో దిగాలని లెక్కలేస్తున్నారట. దానికి కూడా ఒక లాజిక్ చెప్తున్నారట వీర్రాజు. 1994లో ఇక్కడ నుంచి ఆయన పోటీచేసి ఓడిపోయారు. 2014లో మాత్రం ఇదే సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున ఆకుల సత్యనారాయణ గెలిచారు. ఆ లెక్కల ప్రకారం బీజేపీ బలంగా ఉందన్నది వీర్రాజు అండ్‌ కో చెప్పేమాట.

ఈ అంశంపై పార్టీలో మరో చర్చ జరుగుతోంది. వీర్రాజు మనసు పార్లమెంట్‌పై ఉందట. అయితే రాజమండ్రి లోక్‌సభకు పోటీ చేయరట. ఎప్పుడో 1998లో బీజేపీ తరఫున గిరజాల వెంకటస్వామినాయుడు గెలవడం తప్ప.. తర్వాత కాపు సామాజికవర్గానికి రాజమండ్రి కలిసి రాలేదని చెబుతున్నారట. ఓడిపోయే సీటుకు మనం పోటీ చేయడం అవసరమా అని అనుచరుల దగ్గర కుండబద్దలు కొడుతున్నారట వీర్రాజు. కాకినాడ లోక్‌సభ సీటు అయితే బాగుంటుందని లీకులు ఇస్తున్నారట. ఒకటి రెండుసార్లు తప్ప కాకినాడ ఎంపీగా కాపులే గెలుస్తున్నారని.. ఆ సీటైతే ప్లస్‌ అవుతుందని లెక్కల చిట్టా విప్పుతున్నారట వీర్రాజు.

బీజేపీకి కాకినాడ లోక్‌సభకు సరైన అభ్యర్థి లేరని.. అనుచరులను కూడా తన శ్రుతిలో కలిపేస్తున్నారట సోము వీర్రాజు. గతంలో ఒకసారి కాకినాడ నుంచి బీజేపీ ఎంపీగా సినీ నటుడు కృష్ణంరాజు గెలిచారు. తర్వాత నరసాపురం నుంచి కృష్ణంరాజు గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. అన్నీ వర్కవుట్ అయితే కాకినాడలో గెలిచి ఆ స్థాయికి వెళ్లొచ్చనే చర్చ వీర్రాజు శిబిరంలో బలంగా ఉందట. తనలాంటి స్టేట్‌ లీడర్‌ పార్లమెంట్‌కు పోటీ చేస్తే ఆ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు కూడా పని సులువు అవుతుందని ఫ్యూచర్‌ పిక్చర్‌ చూపిచ్చేస్తున్నారట ఏపీ బీజేపీ చీఫ్‌. తనకు పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఉన్నా.. పార్టీ ఏం చెబుతుందో చూడాలి కదా అని.. వీర్రాజే మధ్య మధ్యలో కూల్‌ కూల్‌ అంటున్నారట. కానీ.. అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల విషయంలో ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారని సమాచారం.

జనసేనతో పొత్తు కొనసాగితే కాకినాడ లోక్‌సభ సీటు మనదే అని చెప్పిందే చెబుతున్నారట సోము వీర్రాజు. జనసైనికుల బలం తోడైతే తాను పార్లమెంట్‌కు వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదని ధీమాగానే ఉన్నారట కమలం బాస్‌. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజమండ్రి వచ్చినప్పుడు.. కనిపించిన రాష్ట్ర బీజేపీ నేతలతో కాకినాడ గురించి ఎక్కువ వాకబు చేశారట వీర్రాజు. మిగతా నియోజకవర్గాల కంటే.. మన నియోజకవర్గాల నుంచే జన సమీకరణ ఎక్కువగా జరగాలని ఆ ప్రాంతాలను.. అక్కడి నేతలను అప్పుడే ఓన్‌ చేసుకోవడం మొదలు పెట్టేశారట. మొత్తానికి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉందని వీర్రాజు వైఖరిని తలచుకుని చెవులు కొరుక్కుంటున్నారట. మరి.. ఏపీ బీజేపీ చీఫ్‌ లెక్కలు ఎక్కాలు ఏ మేరకు వర్కవుట్‌ అవుతాయో చూడాలి.

Exit mobile version