NTV Telugu Site icon

V. V. Lakshminarayana : ఆ మాజీ పోలీస్ బాస్ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారా..?

Kotha Pataluy

Kotha Pataluy

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2024 టార్గెట్‌గా కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ వంటి ప్రధాన పార్టీల వ్యూహాలతోపాటు మాజీ ఐపీఎస్ వి.వి.లక్ష్మీనారాయణ కదలికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేన తరుఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజాసేవకుడిగా మారతానని “బాండ్ పేపర్” రాసిచ్చినా ఆయన్ని జనం ఆదరించలేదు. ఆ తర్వాత జనసేనకు రాజీనామా చేసి తన ఫౌండేషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. రైతు సమస్యలు, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ విశాఖకు వచ్చి వెళ్తున్న లక్ష్మీనారాయణ.. ఇప్పుడు గేర్ మార్చారనే ప్రచారం జరుగుతోంది. వివిధ వర్గాలకు చెందిన ముఖ్యులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు కూడా. దీంతో జేడీ ఆలోచనల చుట్టూ ఆసక్తికర చర్చ నడుస్తోంది.

లక్ష్మీనారాయణ కొత్తపార్టీ పెట్టే పనుల్లో ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ అది వాస్తవం కాదట. ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్తపార్టీ పెట్టి మనుగడ సాగించడం అసాధ్యమనే అభిప్రాయంలో ఆయన ఉన్నారట. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఫలితాల తర్వాత జోష్ మీద ఉన్న ఆమ్ ఆద్మీపార్టీవైపు లక్ష్మీనారాయణ ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు. ఆప్ నేతలతో వీవీ టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ఒకటిరెండు మీటింగ్‌లు జరిగాయని తెలుస్తోంది. త్వరలో కేజ్రీవాల్‌తో సమావేశం అవుతారని సమాచారం.

గత ఎన్నికల్లో ఎంపీగా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్న తర్వాత మరోసారి అటువంటి ప్రయత్నం చేయకూడదని లక్ష్మీనారాయణ భావిస్తున్నట్టు సమాచారం. అర్బన్ ఓటర్లను ఆకర్షించగలిగినంతగా గ్రామీణ ఓటర్లు కొత్త పార్టీలను, కొత్త ముఖాలను స్వాగతించరనే వాస్తవం తేలిపోవడం కారణంగా చెప్పుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి విశాఖ నుంచి అసెంబ్లీ బరిలో దిగాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నారట. విశాఖ ఉత్తరం లేదా తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే ఫలితం ఏ విధంగా ఉంటుందనే లెక్కలు వేసుకుంటోందట జేడీ టీమ్.

గత ఎన్నికల్లో గాజువాక తర్వాత ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే లక్ష్మీనారాయణకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. కుల, ధన ప్రభావంకంటే అభివృద్ధి మీద ఎక్కువ ఆలోచన చేసే ప్రజలు ఇక్కడ ఎక్కువ. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో లక్ష్మీనారాయణ సామాజికవర్గంపై విస్త్రతమైన చర్చ జరిగింది. ఆయన కులం ముద్రపడకుండా జాగ్రత్తపడినా ఫలితం సాధ్యం కాలేదు. ఈ మధ్యకాలంలో సామాజికవర్గ పెద్దలతో వీవీ సమావేశం అవుతున్నారు. దీంతో లక్ష్మీనారాయణ ఆప్‌ నుంచి పోటీ చేస్తారా లేక ఇంకేదైనా ఆలోచన ఉందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

రాష్ట్రంలో టీడీపీ-వైసీపీకి ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ వేదిక అవసరం అనే దిశగా లక్ష్మీనారాయణ అడుగులు వేస్తున్నట్టు భోగట్టా. అసెంబ్లీకి ఎక్కడ నుంచి పోటీ చేయాలో తేల్చుకున్న తర్వాత దానిపై మాజీ పోలీస్‌ బాస్‌ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.