Site icon NTV Telugu

తెలంగాణ కాంగ్రెస్ ను వీడని అంతర్గత విభేదాలు.. !

అసలే పార్టీ కష్టాల్లో ఉంది..నేతలంతా సపోర్ట్‌ గా ఉండాలి.. లోటు పాట్లు సర్దుకుపోవాలి..కానీ, ఇక్కడ జరుగుతున్నది రివర్స్‌..ఎటూ కఠిన చర్యలు తీసుకోలేరని అలుసుగా భావిస్తున్నారా? టీ కాంగ్రెస్‌ నేతల దూకుడుకు కారణాలేంటి?

కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురం. అయితే…తెలంగాణ కాంగ్రెస్‌ కు కొత్త చీఫ్ రేవంత్ వచ్చిన తర్వాత… క్రమశిక్షణకి ప్రాధాన్యత అనే ఇండికేషన్ పంపించారు. దీంట్లో భాగంగానే… గాంధీ భవన్‌ లో పాస్‌ ల కోసం గొడవ పడ్డ ఇద్దరిలో ఒకరిని పార్టీ నుండి బయటకు గెంటి వేశారు. అయితే…ఈ క్రమశిక్షణ పార్టీలో సీనియర్ నాయకులకు వర్తించే పరిస్థితి లేదనే టాక్‌ నడుస్తోంది.పార్టీని పదే ఇరకాటం లో కి నెట్టే కామెంట్స్ చేస్తున్నా చర్యలు తీసుకోవటం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పిసిసి చీఫ్ గా రేవంత్ నియామకం జరిగిన తర్వాత… ఇంచార్జ్‌ మీద సీరియస్ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పిసిసి పదవిని అమ్ముకున్నారని చేసిన కామెంట్స్ ని ఇప్పటికీ అధికార పార్టీ తనకు అనుకూలంగా వాడుకుంటోంది. కోమటి రెడ్డి వ్యవహారం ఇలా ఉంటే, తాజాగా జగ్గారెడ్డి వ్యవహారం కూడా ఇప్పుడు అలాగే తయారైంది.

పార్టీ వ్యవహారాలపై మీడియాతో మాట్లాడటం…గతంలో పిసిసి నియామకం ఎపిసోడ్… తాజాగా పార్టీ వ్యవహారాలపై కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. ఇక్కడ వ్యక్తిస్వామ్యం ఎక్కువైంది. ఇది కాంగ్రెస్ పార్టీనా….ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా… అంటూ చేసిన కామెంట్స్‌ పెద్ద దుమారం రేపాయి.చివరికి అధిష్టానం జోక్యం చేసుకుని అటు పిసిసి…ఇటు జగ్గారెడ్డి మద్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసింది.ఏఐసీసీ ఇంఛార్జిలు బోసు రాజు…శ్రీనివాసన్ కుదిర్చిన సయోధ్యతో పార్టీ మీద మీడియా సమక్షంలో చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి సారీ చెప్పారు. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యవహారం కొలిక్కి వచ్చింది. జరిగిన పంచాయతీ క్లియర్ అయ్యింది. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది అనేది ఓపెన్ టాక్.

కాంగ్రెస్‌ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అయినా… పార్టీలోని ముఖ్య నాయకుల తీరు మాత్రం తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీలో సీనియర్ నాయకులు పదే పదే నోరు జారడాన్ని కట్టడి చేయడం లేదనే విమర్శలు వచ్చాయి.బడా నాయకులు ఇలా కామెంట్స్ చేయడం వల్ల పార్టీ ఎదుటి పక్షానికి చులకన అవుతోందనే అబిప్రాయం నేతల్లో ఉంది.పార్టీ పరిస్థితి బాలేని సమయంలో ఎమ్మెల్యే, ఎంపీల మీద చర్యలు తీసుకునే అవకాశం లేదు. నిజానికి ఇలాంటి సమయంలో నేతలు పార్టీ లోటుపాట్లను అంతర్గత వ్యవహారంగా చూస్తూ, బలోపేతానికి కృషిచేయాలి.కానీ, కొందరు నాయకులు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి జగ్గారెడ్డి వ్యవహారం ముగిసినా, కోమటిరెడ్డి వ్యవహారం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Exit mobile version