చిరుమర్తి లింగయ్య. నకిరేకల్ ఎమ్మెల్యే. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. ఈయనేమో వేముల వీరేశం. మాజీ ఎమ్మెల్యే. టీఆర్ఎస్ నేత. గత ఎన్నికల్లో లింగయ్య చేతిలో ఓడిపోయారు వీరేశం. ఇక ఈయన కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్లగొండ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. ముగ్గురూ ముగ్గురే. ఈ ముగ్గురి చుట్టూనే ప్రస్తుతం నకిరేకల్ టీఆర్ఎస్ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. లింగయ్య పేరు చెబితేనే వీరేశం.. భూపాల్‌రెడ్డిలు ఒంటికాలిపై లేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ను వీడి కారెక్కినప్పటి నుంచి వీరేశం, భూపాల్‌రెడ్డిలతో ఢీ అంటే ఢీ అనడమే సరిపోతోందని తల పట్టుకుంటున్నారు లింగయ్య.
నియోజకవర్గంలో ఇంటిపోరుతో లింగయ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు నకిరేకల్‌లో జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు వీరేశం. నకిరేకల్‌లో పట్టు కోల్పోకుండా రకరకాల ప్రయత్నాలు చస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న సంఘటనలు చిరుమర్తి వర్సెస్ వేముల అన్నట్టుగా ఉంటున్నాయి. అధినాయకత్వం ఆశీసులతో నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నా.. వీరేశం ప్రత్యర్థిగా మారడంతో ఏం పాలుపోవడం లేదట లింగయ్యకు. గ్రామాల్లో పర్యటిస్తుంటే వీరేశం మనుషులు అడ్డుకోవడంతోపాటు పార్టీ కమిటీల కూర్పులోనూ తగువులు తప్పడం లేదట.
ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యేల మధ్య గొడవ ఇలా ఉంటే.. నకిరేకల్‌లో లింగయ్యకు మరో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నుంచి తలపోట్లు తప్పడం లేదట. భుపాల్‌రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యే అయినప్పటికీ..ఆయన సొంతూరు నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో ఉంది. ఆ మండలంలో ఆధిపత్యం కోసం భూపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారట. అక్కడ తన మాట నెగ్గడం లేదనే ఆవేదనలో ఉన్నారట లింగయ్య. ఒకవైపు వీరేశం.. ఇంకోవైపు భుపాల్‌రెడ్డి కుమ్మేస్తున్నారని అనుచరుల దగ్గర చెప్పి వాపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి వస్తే.. స్వపక్ష నాయకులే విపక్షంగా మారతారని ఊహించలేదని చెబుతున్నారట.
సమస్య శ్రుతిమించి.. రాజకీయంగా ఇబ్బందిగా మారడంతో వేముల వీరేశం.. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిలపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట ఎమ్మెల్యే లింగయ్య. ప్రస్తుతం ఈ వర్గాల మధ్య సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో పోరాటం సాగుతోంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎన్నికల దిశగా వేడెక్కుతుండటంతో అందరి దృష్టీ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయంపై ఉందట. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ సర్వేల ఫలితం ఏంటోకానీ.. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఎవరికి అనుకూలంగా వాళ్లు చర్చకు పెట్టేస్తున్నారు. మరి.. ఎన్నికల నాటికి నకిరేకల్ టీఆర్ఎస్ రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.