Site icon NTV Telugu

YCP : తండ్రి అధికార పార్టీలో ఉంటే…కూతురు ప్రతిపక్షంలో ఉంటుందా..? l

Anamy

Anamy

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనం కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం అనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి వై.సి.పి ఎం.ఎల్.ఏగా ఉన్నారు. 1983లో నెల్లూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధిగానే అనం రామనారాయణ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 వరకూ కాంగ్రెస్ లో ఉన్న ఆనం..అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో టిడిపిలో చేరారు. చంద్రబాబు తనకు ప్రాధాన్యం ఇస్తారని భావించారు. కానీ ఏ పదవి కూడా ఇవ్వకపోవడం..కీలక సమావేశాలకు ఆహ్వానించక పోవడంతో కినుకు వహించారు. 2019 ఎన్నికల సమయంలో వై.సి.పి.లో చేరి అనూహ్యంగా వెంకటగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీలో తనకు ప్రాధాన్యం ఇస్తారని భావించినా.. అది జరగలేదు. తాను రాజకీయాల్లోకి తెచ్చిన అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి లభించడం అనం కు రుచించలేదు. నెల్లూరు నగర రాజకీయాల్లో గతంలో చురుకైన పాత్ర పోషించిన ఆనం వర్గం.. అనిల్ జోరు ముందు రాజకీయాల నుంచి తాత్కాలికంగా దూరమయ్యారు. అంతేకాకుండా నెల్లూరులో మాఫియా రాజ్యం ఏలుతోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఇద్దరు..ముగ్గురు పోటీ చేసే అవకాశం ఉందని గతంలోనే అనం చెప్పారు. ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతామనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యం లోనే అనం కుమార్తె అనం కైవల్య ..టీడీపి నేత నారా లోకేష్ తో భేటీ కావడం కలకలం రేపింది. మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న కైవల్య…ఆత్మకూరు నియోజక వర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే లోకేష్ తో సమావేశమైనట్లు తెలిసింది. కైవల్య.. బద్వేలులో ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత బిజివేముల వీరారెడ్డి కుటుంబంలో కోడలిగా ఉన్నారు. తమ కుటుంబం టిడిపిలో ఉండటంతో తాను కూడా టిడిపి లోకే వెళుతున్నట్లు తన సన్నిహితులతో కైవల్య అంటున్నారు.

కైవల్య టిడిపి వైపు వెళుతుండటంతో ఎం.ఎల్.ఏ.అనం రామనారాయణ రెడ్డి కూడా ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొదట అనం కైవల్య పార్టీలో చేరుతారని…అనంతరం అనం వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద టిడిపి నేత లోకేష్ తో సమావేశమై జిల్లా రాజకీయాల్లో అనం కైవల్య అలజడి సృష్టించారు.

Exit mobile version