ఆరూరి రమేష్. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్దన్నపేట ఎమ్మెల్యే. జిల్లా రాజకీయాలతోపాటు.. టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు రమేష్. ఆయన చుట్టూనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ప్లాన్ రివర్స్ కావడంతో పొలిటికల్‌గా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. ఆయనకు ఆయనే ఇరకాటంలో పడ్డారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట.
గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పేరిట ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. వరంగల్ చుట్టూ 49 కిలోమీటర్ల ORR నిర్మించేందుకుగాను 28 గ్రామాల్లోని మూడు నియోజకవర్గల్లో కలిపి 21వేల 500 ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదించారు. ఇందుకు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. అయితే పచ్చని పొలాలను సమీకరించడంపై స్థానిక రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎకరం 3 కోట్ల నుంచి 4 కోట్లు పలుకుతున్న భూములను ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. రైతుల ఉద్యమాలకు విపక్షాలు అండగా నిలవడంతో..ఆ సమస్యను పరిష్కరించి రాజకీయంగా క్యాష్ చేసుకోవాలని చూశారట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. గ్రేటర్ వరంగల్ చుట్టూ వర్దన్నపేట నియోజకవర్గం ఎక్కువగా ఉండటం.. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఎక్కువగా పోతుండటంతో బుర్రకు పదును పెట్టారట. మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి.. భూ సమీకరణ నిలిపివేశాల ఆదేశాలు ఇప్పించినట్టుగా ఆరూరి రమేష్ ప్రచార ఎత్తుగడ వేశారట. దానిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసేసుకున్నారు. వాస్తవానికి స్టేషన్ ఘనపూర్, పరకాల నియోజకవర్గాల్లోనూ ORR సమస్య ఉన్నప్పటికీ.. ఆరూరి ఒక్కరే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నట్టుగా చాలా కలరింగ్ ఇచ్చినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రయత్నాలను రైతులు నమ్మకపోగా.. ఒకానొక సమయంలో ఆయన్ను నిలదీసే పరిస్థితి వచ్చింది. భూ సమీకరణ ఆపడం కాదు.. దానికి సంబంధించిన జీవోను రద్దు చేయించాలని రైతులు ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆయన ఇరుకునపడ్డట్టు ప్రచారం జరిగింది. ఇంతలో హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్ల గూడెంలో బాధిత రైతులు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. అలా అడ్డుకున్నవారిలో 12 మంది రైతులపై పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. రైతులను తీవ్రంగా కొట్టడంతో సీన్ సితార్ అయ్యింది. ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారని.. కేసులు పెట్టారని ఆరోపణలు రావడంతో రమేష్‌కు ఇబ్బందిగా మారిందట. చివరకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినా.. సమస్యపై ఆరూరి రమేష్ వ్యవహరించిన తీరే రాజకీయ పక్షాలతోపాటు.. టీఆర్‌ఎస్ వర్గాల్లోనూ చర్చగా మారింది.
ORR వల్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లితోపాటు చాలా మంది ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలు టీఆర్ఎస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. ఆ విషయం ఆరూరి రమేష్‌కు కూడా తెలుసని.. కానీ సమస్యను పరిష్కరించిన క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలన్న ఆత్రుతే బెడిసి కొట్టిందని చెబుతున్నారు. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అని టీఆర్ఎస్ నేతలే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. మొత్తానికి ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శిబిరం మింగలేక కక్కలేక సతమతం అవుతోందట.