నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరి మధ్యే మాటల తూటాలు పేలాయి. సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు సాగాయి. కట్ చేస్తే.. అనుచరులు సైతం ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏ శిబిరంపై ఈగ వాలినా రెండోపక్షం అస్సలు ఊరుకోవడం లేదట. ఇదే టెక్కలి రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
టెక్కలిలో వైసీపీ వర్సెస్ టీడీపీ!
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయమంతా ఇప్పుడు టెక్కలి చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా.. టెక్కలి ఎమ్మెల్యేగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. నాటి ఎన్నికల్లో అచ్చెన్న ఓటమే లక్ష్యంగా వైసీపీ అనేక ప్రయోగాలు చేసినా.. ఏదీ వర్కవుట్ కాలేదు. కానీ.. పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలదే పెత్తనం. దువ్వాడ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీని చేసి.. ఏపీ టీడీపీ చీఫ్‌ను రాజకీయంగా దువ్వుతున్నారు.
అచ్చెన్న విమర్శలకు దువ్వాడ కౌంటర్!
టీడీపీ అధికారం కోల్పోయినా.. ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు తొలుత దూకుడుగా వెళ్లారు. ESI కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఆయనలో స్పీడ్ తగ్గింది. కేడర్‌ను కూడా టోన్ డౌన్ చేయమన్నారని ప్రచారం జరిగింది. కానీ.. అచ్చెన్న గేర్ మార్చడంతో టెక్కలి పాలిటిక్స్ జోరందుకున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పర్యటిస్తూనే.. టెక్కలిపైనా ఓ కన్నేసి అధికారపార్టీపై విమర్శలు చేస్తున్నారు అచ్చెన్న. దీంతో ఆయనపై ఒంటి కాలిపై లేస్తున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ. రాష్ట్రంలో అచ్చెన్న.. ఎక్కడ ఏం మాట్లాడినా.. టెక్కలిలో దువ్వాడ వెంటనే లైన్‌లోకి వచ్చేస్తున్నారు. అచ్చెన్నతోపాటు.. చంద్రబాబు, లోకేష్‌లను గురిపెడుతున్నారు వైసీపీ నేత.
టీడీపీ, వైసీపీ శ్రేణులు కూడా పరస్పరం విమర్శలు, సవాళ్లు!
ఇంత వరకు బాగానే ఉన్నా.. టెక్కలిలో ఈ ఇద్దరు నేతలకు టీడీపీ, వైసీపీ కేడర్ కూడా తోడైందట. అదే చర్చగా మారింది. అచ్చెన్న చేసే విమర్శలకు దువ్వాడతోపాటు.. వైసీపీ కేడర్ కూడా ముప్పేట దాడి చేస్తోంది. స్థానికంగా వార్నింగ్‌లు.. ఛాలెంజ్‌లు కామన్ అయ్యాయి. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో.. అచ్చెన్న కూడా ఎదురుదాడికి టీడీపీ కేడర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్న ఉండమన్న నాయకుడే చెప్పడంతో.. హుషారుగా రోడ్డెక్కుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రస్తుతం అచ్చెన్న, దువ్వాడల మధ్య విమర్శలు నడిస్తే.. వాటిని కిందిస్థాయిలో రెండు పార్టీల శ్రేణులు కూడా అందుకుంటున్నాయి. నువ్వొకటి అంటే మేము రెండు అంటామన్నట్టుగా చెలరేగిపోతున్నారట కార్యకర్తలు. ప్రస్తుతం మాటలతో సరిపెడుతున్న రెండు పక్షాలు..పరిధి దాటితే ఏంటన్నదే ఆందోళనగా ఉందట నేతల్లో. మరి..టెక్కలి పొలిటికల్ వార్ ఏ విధంగా టర్న్ తీసుకుంటుందో చూడాలి.
