Site icon NTV Telugu

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల మధ్య దూరం పెరిగిందా?

పైన పటారం.. లోన లోటారం. తెలంగాణ బీజేపీలో ఇదే పరిస్థితి ఉందట. ఉన్న కొద్దిమంది నేతలూ ఒక్కమాట మీద లేరట. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడొకరు ఆ సమస్యకే మందు పూసి వెళ్లారట. కూర్చోబెట్టి క్లాస్‌ తీసుకున్నట్టు టాక్‌. మరి.. ఆయన మాటలు కమలనాథుల చెవికి ఎక్కాయా? పార్టీ నేతల మధ్య ఉన్న ఇబ్బందేంటి?

బీజేపీలో ముఖ్యనేతల మధ్య గ్యాప్‌ ఉందా?

శరీరానికి దెబ్బ తగిలితే మందు రాస్తారు. చికిత్స చేస్తారు. అదే మనసుకు గాయమైతే..? కోలుకోవడానికి టైమ్‌ పడుతుంది. ప్రస్తుతం తెలంగాణలోని బీజేపీ నాయకులు చాలా మంది .. మనసుకు గాయాలై ఇబ్బంది పడుతున్నారట. ఒకరంటే ఒకరికి గిట్టక జరిగిన గాయాలు కావివి. చిన్న చిన్న కారణాలు.. మనస్పర్థలతో గ్యాప్‌ వచ్చేసిందట.. అవే గాయాలై కూర్చున్నాయట. వాస్తవానికి బీజేపీలో రాష్ట్రస్థాయి నేతలు పిడికెడు మంది కూడా ఉండరు. ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులు చేరడంతో ఆ సంఖ్య కొద్దిగా పెరిగింది. అక్కడి నుంచి పురానా.. నవీన్‌ అనే తేడాలు వచ్చాయట. ఈ నాయకులంతా పైకి మేమంతా ఒకటే అని బిల్డప్‌ ఇచ్చినా లోపల మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నది వారికే తెలుసు. నాయకుల మధ్య చాలా పెద్ద గ్యాపే ఉందట.

కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం!

ముఖ్య నాయకులు అనుకునేవారు ఎవరికి వారు దూరంగా ఉండటంతో.. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందట. తమకెందుకు వచ్చిన గొడవ అని కొందరు పార్టీ అంశాల్లో జోక్యం చేసుకోవడమే మానేశారట. ఇటీవల కాలంలో ఈ తరహా పోకడలు ఎక్కువైనట్టు చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు కూడా.. ఎవరిని కలిస్తే ఇంకెవరికి కోపం వస్తుందో అని పార్టీ ఆఫీస్‌కు.. నేతలకు దూరం దూరంగా ఉంటున్నారట. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేరిక నుంచి మొదలు పెట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర వరకు ఈ అంశంలో కనెక్టివిటీ కొరవడిందట.

ముఖ్యనేతలతో ప్రత్యేకంగా మాట్లాడిన బీఎల్‌ సంతోష్‌!
కీలక నాయకులైన వారిని మందలించిన సంతోష్‌?

ఇటీవల తెలంగాణ ప్రర్యటనకు వచ్చిన బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌.. నేతల మధ్య ఉన్న గ్యాప్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారట. ఎవరైతే కలిసి పనిచేయడం లేదో.. దూరంగా ఉంటున్నారో వారందరినీ పిలిచి.. ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాట్లాడారట. సర్ది చెప్పాల్సిన వారికి ఆయన సర్దిచెప్పారట. క్లాస్‌ తీసుకోవాల్సిన వారికి క్లాస్‌ తీసుకున్నారట. రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోంది? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇలా వారి నుంచి వివరాలు రాబట్టారట సంతోష్. అంతా విన్నాక.. కీలక నాయకులను ఆయన మందలించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇకనైనా విభేదాలు విడి.. ఐక్యంగా పనిచేయాలని.. బీజేపీ ఆశించిన ఫలితాలు రాబట్టాలని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారట. అయితే ఇక్కడి వ్యవహారాలు బీఎల్‌ సంతోష్‌కి ఎలా తెలిశాయి అని బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయట.

ఇకనైనా కీలక నేతల మనసులు కలుస్తాయా?

సంతోష్‌తో జరిగిన భేటీలు.. వార్నింగ్‌లపై పార్టీలో ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ఆయన చెప్పిన తర్వాతైనా కలిసి పనిచేస్తారా? నాయకుల మనసులు కలుస్తాయా అన్న చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో కీలక నాయకుడు చెప్పిన తర్వాత కూడా దారికి రాకపోతే.. అలాంటి నాయకులకు రానున్న రోజుల్లో పార్టీలో ప్రాధాన్యం తగ్గడం ఖాయమని అనుకుంటున్నారట. మరి.. ఢిల్లీ నాయకుడి వార్నింగ్‌ తెలంగాణ బీజేపీ నేతల విషయంలో ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Exit mobile version