ఏపీ టీడీపీలో మహానాడు ఉత్సాహం కనిపిస్తోంది. ఒకే ఒక్క సభతో కేడర్ మనసు మారిపోయిందన్న ప్రచారం మొదలైంది. శ్రేణుల్లో దూకుడు చూశాక.. సభా వేదికపై పొత్తుల మాటే వినిపించలేదు. ఇప్పుడు టీడీపీ కేడర్ సైతం కొత్తరాగం అందుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చగా మారిపోయింది. మహానాడుకు ముందు జనసేనతో వన్‌సైడ్ లవ్‌లో ఉంది టీడీపీ. జనసేనాని నేరుగా చెప్పకపోయినా.. టీడీపీకి సానుకూల సంకేతాలు ఇచ్చేలా ప్రకటనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ, జనసేన అవగాహనతో పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని చర్చ సాగింది. ఇంతలో మహానాడు వాతావరణం టీడీపీ మైండ్ సెట్ మార్చేసినట్టుగా కనిపిస్తోంది.
ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లాల్సిన అవసరం లేదని తెలుగు తమ్ముళ్లు ఢంకా బజాయిస్తున్నారట. టీడీపీ బలం, బలగం ఏంటో మహానాడులో అందరికీ తెలిసిందని.. అందువల్ల వేరొక పార్టీలతో పొత్తులు అవసరం లేదని కొత్త పల్లవి అందుకుంటున్నారట. నిన్న మొన్నటి వరకు జనసేన కేడర్, నాయకులు కనిపిస్తే.. కలిసి ముందుకెళ్దాం.. ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వొద్దని చేతిలో చెయ్యేసి మాట్లాడుకున్న టీడీపీ కేడరే.. ఇప్పుడు మీదారి మీదే.. మా దారి మాదే అనేస్తోందట. ఈ కామెంట్స్‌కు జనసేన శ్రేణులు సైతం గ్రౌండ్ లెవల్లో గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాయట. జనసేనాని ఓడిపోతే సినిమాలు చేసుకుంటారు. మీ నాయకుడికి ఈసారి అధికారం రాకపోతే ఏం చెయ్యలో తేల్చుకోండి అని ఘాటుగానే తిప్పికొడుతున్నారట జనసైనికులు.
ఇదే సమయంలో మరో చర్చా సాగుతోంది. ఒక్క మహానాడు సభతో రాష్ట్రంలో టీడీపీ ఓటు బ్యాంక్ బలపడిందా అంటే.. ఆ ప్రశ్నకు తెలుగుదేశం లీడర్స్ దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. అయినప్పటికీ కేడర్ పొత్తులకు వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తుందన్నదే కొందరి ప్రశ్న. మహానాడులో టీడీపీ నేతల ప్రవర్థన చూశాకే కేడర్‌లో ఈ తెగింపు వచ్చిందనే వారూ లేకపోలేదు. మహానాడులో నాయకుల ప్రసంగాల్లో, రాజకీయ తీర్మానాల్లో పొత్తుల గురించి ప్రస్తావించలేదు. తరలి వచ్చిన కేడర్‌ను చూశాక.. పొత్తుల ఊసే ఎత్తలేదని చెవులు కొరుక్కుంటున్నారు. అదే అంశాన్ని తెలుగు తమ్ముళ్లు తలకెక్కించుకున్నట్టు టాక్.
వాస్తవానికి ఏపీలో టీడీపీ, జనసేన కలవకుండా చేయాలని అధికారపార్టీ వైసీపీ వేయని ఎత్తుగడలు లేవు.. విమర్శలు లేవు. ఇప్పుడు సడెన్‌గా మహానాడు తర్వాత తెలుగు తమ్ముళ్లలో వచ్చిన మార్పు ఆసక్తిగా మారింది. కేడర్ ఆలోచనలు ఎలా ఉన్నా.. పొత్తులపై చంద్రబాబు మదిలో ఏముందన్నదే ఉత్కంఠగా మారింది. మరి.. తెలుగు తమ్ముళ్ల వైఖరికే పార్టీ బాస్ పెద్దపీట వేస్తారో.. కొత్త చిక్కులు వద్దనుకుని వారిని వారిస్తారో చూడాలి.