Site icon NTV Telugu

Off The Record: కేరాఫ్ కాంట్రవర్సీ గా గుమ్మనూరు జయరాం..

Otr Gummanur Jayaram

Otr Gummanur Jayaram

Off The Record: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది ఎమ్మెల్యేల్ని రకరకాల వివాదాలు వెంటాడుతున్నాయి. కానీ… ఒకాయన మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా… ఎక్కడున్నా కేరాఫ్‌ కాంట్రవర్శీ అవుతున్నారు. అదీ ఒకటీ రెండు కాదు. ఒకదాని వెంట ఒకటిగా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరు వినిపిస్తూనే ఉంది. గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చాలా వివాదాలు రేగాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తనకు టిక్కెట్‌ ఇవ్వదని కన్ఫామ్‌ చేసుకుని ఎలక్షన్స్‌కు ముందు టీడీపీలోకి జంప్ అయ్యారు. పార్టీలోకి ఎంటర్ అవుతూనే తన సొంత నియోజకవర్గం ఆలూరు కాకుండా, పక్క జిల్లాలో ఉన్న గుంతకల్లు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అక్కడ బోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం, ఆలూరుకు ఆనుకుని ఉండటం, గుమ్మనూరు ఆర్ధిక బలం ఇలా… అన్ని లెక్కలేసుకుని గుంతకల్లు టిక్కెట్‌ ఇచ్చారట టీడీపీ పెద్దలు. ఇక ఆ ఎన్నికల్లో విజయం సాధించడం వరకు బాగానే ఉన్నా… రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదన్నట్టు జయరామ్‌ నియోజకవర్గం మారినా వెంటాడే వివాదాలు మాత్రం తగ్గలేదు. గతంలో టీడీపీ సంస్థాగత కమిటీల నియామకానికి సంబంధించి గుంతకల్లులో జరిగిన సమావేశంలో తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేయాలని, లేదంటే వారి తోక కత్తిరించి సున్నం పెడతామని హెచ్చరించారు. వైసీపీ తరపున ఎవరు నామినేషన్లు వేసినా.. రెడ్ బుక్ ఓపెన్ చేస్తానని హెచ్చరించారు ఎమ్మెల్యే. ఆ గొడవ అలా కొనసాగుతుండగానే… ఇటీవల జయరాం పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో రౌడీషీటర్ అజయ్‌తో పాటు మరో వ్యక్తి హల్ చల్ చేశాడు. గంజాయి మత్తులో తూగుతూ… రోడ్డు మీద వచ్చేపోయే వాహనాలకు ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును అడ్డుపెట్టి బెదిరిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం సమాచారం ఇచ్చారు కొందరు. పోలీసులు అక్కడికి వస్తే… వాళ్ళ మీదికి కూడా దూసుకొచ్చి పరారయ్యేందుకు ప్రయత్నంచారు. చివరికి పోలీసులు సినిమా తరహాలో ఛేజ్‌ చేసి పట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళని అడ్డగించి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు.

అయితే పట్టుబడ్డ వాళ్ళకు టీడీపీతో గాని, వ్యక్తిగతంగా నాకుగాని ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గుమ్మనూరు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయనకు తెలియకుండా కూడా కొందరు అనుచరులు రెచ్చిపోతున్నారా? ఓవరాక్షన్‌తో ఎమ్మెల్యేని ఇరికిస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు. జయరామ్‌ తన అనుచరుల్ని కట్టడి చేయలేకపోతున్నారా? అందుకే ఆయన్ని వివాదాలు వెంటాడుతున్నాయా అన్న డౌట్స్‌ కూడా ఉన్నాయట కొందరికి. కారణం ఏదైనా, ఎవరు ఎక్స్‌ట్రాలు చేసినా…. అంతిమంగా ఎమ్మెల్యే ఇమేజ్‌ మాత్రం గట్టిగానే డ్యామేజ్‌ అవుతోందన్న అభిప్రాయం బలంగా ఉంది గుంతకల్లులో. కొన్ని ఆయన సృష్టించుకున్నవి, మరికొన్ని అనుచరులు చేసేవి. ఇలా వోవరాల్‌గా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్శీ రేగుతోందని, దీనికి చెక్‌ పెట్టకుంటే మాత్రం వ్యక్తిగతంగా గుమ్మనూరుతో పాటు పార్టీగా తెలుగుదేశం కూడా నష్టపోవాల్సి వస్తుందన్న హెచ్చరికలు పెరుగుతున్నాయి.

Exit mobile version