ఉపఎన్నికలో బంపర్ మెజారిటీతో గెలిచిన ఆ నియోజకవర్గం TRSలో గ్రూప్‌ఫైట్ మొదలైందా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్యపోరు రాజుకుందా? గ్రూపులు యాక్టివ్ అవుతున్నాయా? ఏంటా నియోజవర్గం? ఎవరా నాయకులు?
భగత్‌పై అసంతృప్తులు.. వ్యతిరేక సెగలు..!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్. ఆ మధ్య ఉపఎన్నిక రావడంతో అందరి దృష్టీ ఈ నియోజకవర్గంపై నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు నోముల భగత్ గెలిచారు. ఆ పోరు ముగిసిన 8 నెలలకే అక్కడ ఎమ్మెల్యే భగత్‌పై టీఆర్ఎస్‌లోనే అసంతృప్తులు.. వ్యతిరేక సెగలు మొదలై అధికారపార్టీలో కలకలం రేపుతున్నాయి.
నాగార్జునసాగర్ టీఆర్ఎస్లో మూడుముక్కలాట..!
భగత్ స్థానికుడు కాకపోయినా ఎన్నికల్లో గెలిపించుకుంటే.. తమను పట్టించుకోవడం లేదన్నది లోకల్ టీఆర్ఎస్ కేడర్ ఆరోపణ. కొత్తగా ఎమ్మెల్సీ అయిన కోటిరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే తేరా చిన్నపరెడ్డిల సూచనలను MLA పట్టించుకోవడం లేదన్నది వారి మాట. దీంతో మూడు వర్గాల మధ్య గ్రూపుఫైట్ రాజుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న వాళ్లంతా ఎమ్మెల్సీ కోటిరెడ్డి పంచన చేరుతున్నారట. ఇప్పటికే అక్కడ చిన్నపరెడ్డికి ఒక గ్రూప్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే భగత్.. ఎమ్మెల్సీ కోటిరెడ్డిలకు గ్రూపులు వచ్చాయి. దీంతో నాగార్జునసాగర్ టీఆర్ఎస్లో మూడుముక్కలాట మొదలైంది.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన సర్పంచ్ కుటుంబం
ఈ మధ్య సొంతపార్టీకి చెందిన ఓ సర్పంచ్ తండ్రి అభివృద్ధి పనులు చేస్తే.. ఆ పనులకు సంబంధించిన బిల్లులు రాకుండా ఎమ్మెల్యే భగత్ అడ్డుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ సర్పంచ్ కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ- నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై ఆందోళన దిగడం టీఆర్‌ఎస్‌లో చర్చకు దారితీసింది. బిల్లుల వసూలుకు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వివాదంతో తనకెలాంటి సంబంధం లేదని తెలిపారు భగత్.
ముగ్గురు నేతల ఫోకస్ వచ్చే ఎన్నికలపైనే ఉందా?
అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అధికాపార్టీ నేతలు నాగార్జునసాగర్‌లో రాజకీయ చదరంగం మొదలుపెట్టారని టాక్. సాగర్‌ను అడ్డాగా చేసుకోవాలని ఎమ్మెల్యే భగత్ చూస్తుండగా.. ఛాన్స్ చిక్కితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోటిరెడ్డి చూస్తున్నారట. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ రాని తేరా చిన్నపరెడ్డి సైతం సాగర్ సీట్‌పై కన్నేశారు. ఈ క్రమంలోనే ఎవరి వర్గాన్ని వారు బలోపేతం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆరోపణలను, విమర్శలను ఆ కోణంలోనే చూడాలన్నది కొందరి వాదన. ఇదే నిజమైతే.. రానున్న రోజుల్లో నాగార్జునసాగర్ టీఆర్ఎస్ రాజకీయాలు మరింత ఆసక్తిగా ఉంటాయని.. రోజుకో పంచాయితీ తెరమీదకు వస్తుందని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.