ఒకప్పుడు సర్వీసు పూర్తయితే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం ఆలోచించేవారు ఉద్యోగులు. ఇప్పుడు సీన్ రివర్స్. డ్యూటీలో ఉండగానే ఆలోచనలు మారిపోతున్నాయ్. ఖద్దరును లవ్వాడే పనిలో ఉన్నారు కొందరు ఉద్యోగ సంఘాల నేతలు. రాజకీయ నాయకులుగా కొత్త అవతారం ఎత్తే.. ఎత్తుగడల్లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఆ జాబితాలో చేరి హడావిడి చేస్తున్న ఓ ఉద్యోగ సంఘం నేతపై ప్రస్తుతం ఆసక్తిర చర్చే జరుగుతోంది? ఆయనెవరో? ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం.
షార్ట్ కట్‌లో లీడరైపోవచ్చనే పోకడలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేయాలి..! ఉద్యోగంలో ఉండగానే పొలిటికల్ బాట వేసుకోవాలి..!! ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న ట్రెండ్ ఇదే. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఆ సమయంలో ఉద్యోగ సంఘాలకు నేతృత్వం వహించిన వారికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయంగా మంచి గుర్తింపు వచ్చింది. ఉద్యోగ సంఘం నేత అయితే చాలు.. భవిష్యత్ హ్యాపీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అలాగే ప్రభుత్వ అధికారిగా అధికారపార్టీకి దగ్గరైతే.. షార్ట్ కట్‌లో పొలిటికల్ లీడరైపోవచ్చనే పోకడలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు.. అధికారులు చేస్తున్న పనులే రచ్చ రచ్చగా మారుతున్నాయి.
రాజకీయ నేతగా మారేందుకు రాజేందర్ తహతహ..? ఇటీవల కాలంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. కొత్తగూడెంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సేవా కార్యక్రమాల స్పీడ్ పెంచారు. అక్కడితో ఆగిపోతే మనసులోని ఆలోచన వర్కవుట్ కాదని అనుకున్నారో ఏమో.. విచిత్రమైన పూజలతో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. కొత్తగూడెంలో పొలిటికల్‌గా ఏదో ఆశించే అక్కడ DH పావులు కదుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు రాజకీయ నాయకులుగా మారే ఈ జాబితాలో TNGO ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్ కూడా చేరిపోయినట్టు టాక్.
సంగారెడ్డిలో ఎక్కువగా కనిపిస్తున్న రాజేందర్ గతంలో TNGO అధ్యక్షులుగా పనిచేసిన స్వామిగౌడ్, దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డిలు తర్వాతి కాలంలో పొలిటికల్‌గా సెటిల్ అయ్యారు. వాళ్ల బాటలోనే నడవాలని భావించారో ఏమో మామిళ్ల రాజేందర్ సైతం ఖద్దరుపై ప్రేమ ఒలకబోస్తున్నారట. ఆయన సొంతూరు సంగారెడ్డి. అక్కడి నుంచి 2023 ఎన్నికల్లో పోటీ చేయాలని రాజేందర్ అనుకుంటున్నట్టు TNGO వర్గాల టాక్. ఇప్పటి వరకు TNGO ప్రెసిడెంట్‌గా నిత్యం సంఘం ఆఫీసులో ఉద్యోగులకు అందుబాటులో ఉండేవారు. రాజకీయాలపై దృష్టి మళ్లాక.. యూనియన్ ఆఫీసులో కంటే సంగారెడ్డిలోనే ఎక్కువ కనిపిస్తున్నారట రాజేందర్.
2023 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేస్తారా? వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి టీఆర్‌ఎస్ టికెట్‌పై రాజేందర్ పోటీ చేస్తారన్నది TNGO వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే సంగారెడ్డిలో ఇప్పటికే TRS ఇంఛార్జ్‌గా చింతా ప్రభాకర్ ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఓడిన తర్వాత మంత్రి హరీష్‌రావుతో కోఆర్డినేట్ చేసుకుంటూ నియోజకవర్గంలోనే ఉంటున్నారు. ఇప్పుడు TNGO ప్రెసిడెంట్ ఎంట్రీతో అక్కడ రచ్చ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజేందర్‌కు ప్రభుత్వ ఉద్యోగిగా ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉంది. కానీ.. 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంగారెడ్డిలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. ఆయన ఆశిస్తున్నట్టు జరుగుతుందో లేదో కానీ.. ప్రస్తుతానికి సంగారెడ్డిలోని ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగులతో ఉన్న పరిచయాలు.. అన్ని పార్టీలతోపాటు మంత్రి హరీష్‌రావుతో ఉన్న సంబంధాలు కలిసి వస్తాయని లెక్కలేసుకుంటున్నారట రాజేందర్. మొత్తానికి ఉద్యోగ సంఘాల నాయకులు.. ఉన్నతాధికారులు సర్వీసులో ఉండగానే చక్కబెడుతున్న తెరవెనక రాచకార్యాలు ఆసక్తిగా మారుతున్నాయి.