కొత్త జోనల్ విధానం ప్రకారం జీవో 317 అమలుపై రాజకీయ రగడ నెలకొంది. ఇలాంటి సమయంలో సీఎం నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడి.. వారిని మందలించినంత పనిచేసినట్టు సమాచారం. ఇంతకీ ఏం జరిగింది?
జీవో 317పై ఉద్యోగుల్లో గందరగోళం.. టెన్షన్
317 జీవో. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశం. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుపై 317 జీవో ప్రకారమే మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ జీవోపై పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నమెంట్ ఆర్డర్‌ను సవరించాలని.. స్థానికతను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నది వారి డిమాండ్. భార్యాభర్తల కేసులను ముందే పరిష్కరించి.. వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి. దీంతో ఉద్యోగుల్లో గందరగోళం.. టెన్షన్ నెలకొంది.
ఆ మూడు సంఘాల తీరుపై సీఎం ఫోకస్..!
జీవో 317కి అనుకూలంగా ఉన్న ఆ మూడు సంఘాలు TNGO, TGO, PRTUలు ఈ అంశంపై బహిరంగంగా ఎక్కడా పెద్దగా స్పందించలేదు. రాజకీయంగా కూడా దుమారం రేగుతున్నా.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడింది లేదు. ఎక్కడి సంఘాలు అక్కడే గప్‌చుప్ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. దీంతో ఆ మూడు సంఘాలు కూడా జరుగుతున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయనే ప్రచారం జరిగింది. అదే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు వెళ్లిందట.
‘ఏంది సంగతి’ అని సీఎం ఆరా?
నేరుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ మూడు సంఘాల నేతలతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. జరుగుతున్న ప్రాసెస్‌ను ఆపాలని అంటున్నారట..! ఏంది సంగతి అని సీఎం అడిగారట. ఆ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మీరే ఆపాలని అంటున్నట్టు అధికారులు చెబుతున్నారని సీఎం ప్రశ్నించడంతో ఉద్యోగ సంఘాల నేతలకు నోట మాట రాలేదట. కాసేపటికి తేరుకుని అదేం లేదు సార్ అని వారు ముఖ్యమంత్రికి బదులిచ్చారట. అంతా సజావుగానే సాగుతోందని చెబుతూనే.. కొన్ని సమస్యలు ఉన్నాయని అతికష్టంమీద సీఎం కేసీఆర్ చెవిన వేశారట.
ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం ఫోన్ సంభాషణపై ఆసక్తికర చర్చ
ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో.. TNGO, TGO, PRTU నేతలకు వచ్చిన ఫోన్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉద్యోగుల్లో డ్యామేజీ జరగకుండా.. తమ గౌరవానికి భంగం కలగకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారట ఆ నాయకులు. తమతో సీఎం ఫోన్‌లో మాట్లాడింది వాస్తవమే అయినప్పటికీ.. ఆ సందర్భంగా తాము లేవనెత్తి అంశాల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారట.
భార్యాభర్తలు, అంతజిల్లా బదిలీలు క్లియర్ చేయాలని సీఎస్‌కు చెప్పారని వెల్లడిస్తున్నారు. అయితే పైనుంచి వస్తున్న ఒత్తిళ్లు.. క్షేత్రస్థాయిలో చెలరేగుతున్న సెగల మధ్య ఆ మూడు సంఘాల నేతలు చిక్కుకున్నారనే చర్చ మొదలైంది. మరి.. కొత్త జోనల్ విధానంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్న సందేహాలను ఈ మూడు సంఘాల నేతలు ఏ విధంగా నివృత్తి చేస్తారో.. చూడాలి.