NTV Telugu Site icon

TRS : అధికార పార్టీలో కలకలం రేపుతున్న బ్రదర్స్..?

Nalugo

Nalugo

కంచర్ల భూపాల్‌రెడ్డి.. కంచర్ల కృష్ణారెడ్డి. టీఆర్ఎస్‌లో కంచర్ల బద్రర్స్‌గా ఫేమస్‌. వీరిలో భూపాల్‌రెడ్డి ప్రస్తుతం నల్లగొండ ఎమ్మెల్యే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోదరులిద్దరూ ప్రస్తుతం చర్చగా మారారు. వారి దూకుడు పార్టీ నేతలను, కార్యకర్తలను కలవర పెడుతుందట. నకిరేకల్, మునుగొడు నియోజకవర్గాలను నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ నేతలకు తలనొప్పిగా మారినట్టు చర్చ నడుస్తోంది. కార్యకర్తల్లోనూ కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తున్నారట. దీంతో ఎక్కడ నెగ్గాలో… ఎక్కడ తగ్గాలో తెలియక పార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయట.

కంచర్ల బ్రదర్స్‌ స్వస్థలం నకిరేకల్ నియోజకవర్గం. అది ఎస్సీ రిజర్డ్వ్‌ సెగ్మెంట్‌ కావడంతో.. టీడీపీలో ఉన్న ఇద్దరూ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకొన్నారు. 2018లో భుపాల్‌రెడ్డి నల్లగొండ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి నల్లగొండలో సోదరులు ఏం చెబితే అదే శాసనం. అలాంటిది కంచర్ల కృష్ణారెడ్డి మునుగోడుపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారట. అక్కడ తానే ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రచారం చేసుకోవడం దుమారం రేపింది. అక్కడితో ఆగకుండా నకిరేకల్‌లో రాజకీయాల్లోనూ వేలు పెడుతున్నారట. వీటిని పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకోవడంతో ఆ మధ్య కంచర్ల సోదరులు వెనక్కి తగ్గారు. ఆ కూలింగ్‌ పిరియడ్‌ అయిపోయిందని అనుకున్నారో ఏమో.. మునుగోడులో మరోసారి కృష్ణారెడ్డి కదలికలు ఎక్కువయ్యాయట. పార్టీతో సంబంధం లేకుండా.. టీఆర్ఎస్‌, టీడీపీ, కాంగ్రెస్‌ నేతలను వెంటేసుకుని కార్యక్రమాలు నిర్వహించడం చర్చగా మారింది.

ఇప్పటికే మునుగోడు టీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, మరో పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్‌లు నియోజవర్గంలో పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కంచర్ల కృష్ణారెడ్డి వంతు వచ్చింది. నల్లగొండలో పని చూసుకోకుండా మా దగ్గరకు వచ్చి వేలు పెట్టడం ఎందుకని టీఆర్ఎస్‌ నేతలు ఓపెన్‌గానే ప్రశ్నలు సంధిస్తున్నారు. ముందు ఇంట గెలవాలని గట్టిగానే చురకలు వేస్తున్నారట. ఇంకోవైపు మునుగోడులో టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న గులాబీ నేతలకు కృష్ణారెడ్డి పంటికింద రాయిలా మారినట్టు చర్చ జరుగుతోంది.

ఇదేదో మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారో ఏమో.. మునుగోడులోని పార్టీ నేతలు కృష్ణారెడ్డి తీరును టీఆర్ఎస్‌ పెద్దల దృష్టికి తీసుకెళ్లే పనిలో పడ్డారట. ఆయన మాత్రం దూకుడు తగ్గించేలేదన్నట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఆధిపత్యపోరాటం చూశాక మునుగోడులో మూడు ముక్కలాట .. నాలుగు స్తంభాలాటగా మారిందని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.