Site icon NTV Telugu

అడ్రస్ మిస్ అవుతుందేమోనని బలప్రదర్శనకు దిగిన వైసీపీ మాజీ మంత్రి

Ballineni

Ballineni

మంత్రివర్గ విస్తరణలో స్ధానం కోల్పోయిన అనంతరం తొలిసారి ప్రకాశం జిల్లాకు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయన అభిమానులు అనూహ్య రీతిలో ఘన స్వాగతం పలికారు. గుంటూరు, బాపట్ల జిల్లాల సరిహద్దు బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు చేరుకున్న ఉమ్మడి జిల్లా వైసీపీ శ్రేణులు వందల కార్లతో ర్యాలీగా వెళ్లి ఆయనను జిల్లాకు తీసుకు వచ్చారు.

గుంటూరు, బాపట్ల జిల్లాల సరిహద్దుల వద్ద పర్చూరు, చీరాల నియోజకవర్గాల వైసీపీ నేతలు.. బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అద్దంకి నియోజకవర్గాల వైసీపీ నేతలు.. గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద సంతనూతలపాడు, దర్శి, నియోజకవర్గాల వైసీపీ నేతలు.. ఒంగోలు వద్దకు చేరకునే సమయానికి మిగతా అన్నీ నియోజకవర్గాల వైసీపీ నేతలు భారీ వాహనాలతో స్వాగతం పలికారు. ఆయన మంత్రిగా భాద్యతలు స్వీకరించి ఒంగోలు వచ్చే సమయంలో జరిగిన ర్యాలీలకు భిన్నంగా ఈ ర్యాలీ సాగిందట. బాలినేని మంత్రిగా లేకున్నా ఆయన వెన్నంటే మేమున్నాం అన్నట్లుగా వ్యవహారం సాగటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

నిజానికి మంత్రి పదవి కోల్పోయిన అనంతరం బాలినేని ఇప్పట్లో బయట కనిపించరేమో అనుకున్నారట. కానీ, అంచనాలను భిన్నంగా అడుగులు వేశారు బాలినేని. కార్యకర్తలు, జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తోడవ్వటంతో జనసంద్రాన్ని తలపించేలా భారీ ర్యాలీల నడుమ ఆయనను జిల్లాకు వచ్చారు బాలినేని. ఎవరికీ వారే వచ్చారనుకుంటున్నా చివరికిది బల ప్రదర్శన అన్నట్లుగానే మారింది. ఇంతకీ ఆయన జిల్లాలో వైసీపీ శ్రేణుల్లో తనకున్న బలాన్ని చెప్పాలనుకున్నారా.. నేతలే ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని చాటాలనుకున్నారా..అనేది ఇప్పుడు చర్చగా మారింది.

ఈ ర్యాలీలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మినహా మిగిలిన మొత్తం ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జులు హాజరవటం చర్చనీయాంశంగా మారిందట.. మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గం నుండి స్పల్ప సంఖ్యలో మాత్రమే హాజరయ్యారట.. ర్యాలీలో మాజీ మంత్రి బాలినేని మాత్రం ఎక్కడా మాట్లాడకుండా కేవలం అభివాదాలకే పరిమితమయ్యారట.

ఒంగోలు లోని తన ఇంటికి వెళ్లిన తర్వాతే బాలినేని మాట్లాడారు. పదవులు శాశ్వతం కాదని.. వెన్నంటే ఉన్న జనంతోనే.. సీఎం జగన్ తోనే.. ఎప్పుడూ తన పయనిమని తేల్చి చెప్పారట.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలను గెలిచి ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారట. అయితే ఏపీలో మంత్రి పదవి కోల్పోయిన కొందరు మాజీలు తమ సొంత వ్యవహారాలకు వెళ్లిపోవటం.. ఇళ్లు.. ఫాం హౌస్ లకు పరిమితం కావటంతో ముందుగా అందరూ బాలినేని కూడా కార్యకర్తలకు కాస్త దూరమవుతారని భావించారట. అయితే అనూహ్యంగా దూకుడుగా జనాల్లోకి వచ్చారు బాలినేని.

ఈ ర్యాలీని చూస్తే, జిల్లా మొత్తం బాలినేని వెంటే ఉందనిపిస్తోందనే కామెంట్స్‌ వినిపించాయట. దీంతోపాటు మంత్రి సురేష్ ఇంటికి వెళ్లి మరీ బాలినేనిని కలవటంతో, ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని కేడర్ కు సంకేతాలు పంపినట్లు బావిస్తున్నారట. బాలినేని ఈ ర్యాలీ ద్వారా సీఎం జగన్ కు సంఘీబావం ప్రకటించారా.. తన బలాన్ని తెలిపారా..మంత్రిపదవి రాకున్నా, జిల్లాలో తనదే పైచేయి అని చెప్పాలనుకున్నారా అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. అయితే, ఈనెల 22న ఒంగోలులో సీఎం జగన్ పర్యటన నేపధ్యంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారనే ఆసక్తి కొనసాగుతోంది.

Watch Here : https://youtu.be/IjN91drtuaE

Exit mobile version