Site icon NTV Telugu

Early Elections.. Off The Record: ముందస్తు వస్తే బీజేపీ పరిస్థితి?

early polls

Maxresdefault (4)

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట వినిపిస్తుంది. సమరానికి సిద్ధమని అన్ని పార్టీలు చెబుతున్నాయి. రాజకీయ వేడి ఒక రేంజ్‌లో ఉంది. ముందస్తు ఎన్నికలు వస్తే బీజేపీ పరిస్థితి ఏంటి? క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న సీన్ ఎంత?
తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి?
తెలంగాణలో పొలిటికల్‌ టెంపరేచర్‌ చాలా ఎక్కువగా ఉంది. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ముందస్తుకు వెళ్తారని విపక్షాలు అనుమానిస్తున్నాయి. ఎందుకైనా మంచిదని సమర సన్నాహాలకు పదును పెట్టే పనిలో పడ్డాయి పార్టీలు. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ పరిస్థితి ఏంటి అన్నది కాషాయ శిబిరంలోనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు వస్తే అధికారపార్టీకి ఎన్నిచోట్ల గట్టి పోటీ ఇస్తుందనే ప్రశ్నలు ఉన్నాయి.

2018లో వందకుపైగా నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు
2018 ముందస్తు ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్‌ స్థానాలను కోల్పోయింది. కేవలం ఒక్కచోటే గెలిచింది. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో రెండుచోట్ల గెలిచి.. ప్రస్తుతం ఆ సంఖ్యను మూడుకు చేర్చింది. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఏడు. వందకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిపాజిట్‌ దక్కలేదు. కానీ.. తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచింది బీజేపీ. 20 శాతం ఓట్లు వచ్చాయి. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కమలం పార్టీకి మిశ్రమ ఫలితాలు దక్కాయి. రెండుచోట్ల గెలిచి.. మూడు సెగ్మెంట్లలో ఓడిపోయింది. ఇందులో రెండుచోట్ల డిపాజిట్‌ కూడా రాలేదు.

టార్గెట్‌ రీచ్‌ కాని పోలింగ్‌ బూత్‌ కమిటీలు
బీజేపీ ఇంకా రాష్ట్రమంతా విస్తరించలేదని ఆ పార్టీ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. క్షేత్రస్థాయిలోకి బలంగా వెళ్లలేదని.. గ్రామీణ ప్రాంతాల్లో వీక్‌గా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. బీజేపీలో కార్యక్రమాలన్నీ పోలింగ్‌ బూత్‌ కేంద్రాలుగా జరుగుతాయి. రాష్ట్రంలో 35 వేల పోలింగ్‌ బూత్‌లు ఉంటే.. 20 వేల పోలింగ్‌ బూత్‌లకే బీజేపీ చేరుకుందట. పోలింగ్‌ బూత్‌ కమిటీలు వేయడానికి ఎంత ఎఫర్ట్‌ పెట్టినా టార్గెట్‌ రీచ్‌ కాలేకపోతోందట. పార్టీ నేతలు సైతం బూత్‌ కమిటీల విషయంలో అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని.. పర్యటనలు లేవని కమలనాథులు ఆగ్రహంగా ఉన్నారట.

 

రూరల్‌లో కొన్ని చోట్ల అభ్యర్థులు కరువు
కాంగ్రెస్‌ను గ్రౌండ్‌లెవల్లో బలహీన పర్చాలని బీజేపీ చేస్తున్న కసరత్తు అనుకున్న స్థాయిలో సక్సెస్‌ కావడం లేదట. ఆ పార్టీ నుంచి భారీగా నేతలను చేర్చుకుంటే తప్ప.. ప్రభావం చూపలేమనే అభిప్రాయం వ్యక్తం అవుతోందట. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రంలో బలపడాలంటే వ్యూహాలు మార్చుకోవాలని.. చెమటోడ్చాలని అగ్రనాయకత్వం భావిస్తోందట. అడపా దడపా బీజేపీలో కొందరు చేరుతున్నా.. నియోజకవర్గాల్లో వారు ఎంత వరకు ప్రభావం చూపుతారో అంచనా వేయలేని పరిస్థితి ఉందట. గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల పట్టణ ప్రాంతాల్లో తప్పితే.. రూరల్‌లో కొన్నిచోట్ల అభ్యర్థులు లేరు. ఎన్నికల ఖర్చును చూసి చాలా మంది భయపడుతున్నారట.

ముందస్తు ఎన్నికలొస్తే సవాలేనా?
తెలంగాణలో పక్కాగా అధికారంలోకి వస్తామని ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్‌ షా జాతీయ మీడియాతో చెప్పారు. జాతీయ నేతలు తెలంగాణలో అడుగు పెడితే.. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని అనుకుంటున్నారట. రాష్ట్రంలో గెలుస్తామనే నమ్మకం వచ్చాకే మోడీ షాలు ఇక్కడ దృష్టి పెట్టారని కొందరి వాదన. అయితే గ్రౌండ్‌ లెవల్లో పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ముందస్తు ఎన్నికలు వస్తే కాషాయ పార్టీకి పెను సవాలే అని టెన్షన్‌ పడుతున్నారట. మరి.. ఈ సమస్యను బీజేపీ ఎలా అధిగమిస్తుందో చూడాలి.

Exit mobile version