Site icon NTV Telugu

GHMC : ఆ మున్సిపల్ కార్పొరేటర్ల మధ్య ఆధిపత్య పోరు తార స్థాయికి చేరుకుందా..?

Goay

Goay

రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఎన్నికల కోసం హడావుడి కొనసాగుతుంటే, రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పాలకవర్గం మార్పుపై చర్చ సాగుతోంది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, పదవులతో పాటు ఆర్థిక లావాదేవీలే లక్ష్యంగా నేతలు సాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడింది. మేయర్ వర్గానికి వ్యతిరేకంగా డిప్యూటీ వర్గం పావులు కదుపుతోంది. మేయర్ కు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ కు ఎంపీ మద్దతు ఉన్నట్లు కార్పొరేషన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మున్సిపాలిటీ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ ఎవరిగుప్పిట్లో ఉంటుందో, నియోజకవర్గంలో వారి ఆధిపత్యం కొనసాగుతుందనే ప్రచారం ఉంది. అయితే భవిష్యత్తులో ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భాగమైన రాజేంద్ర నగర్, పరిగి నియోజకవర్గాల్లో ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీ చేస్తారని ఉహాగానాలున్నాయి. ఇదే అదనుగా ఎంపీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న బండ్లగూడ డిప్యూటీ మేయర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విపక్షంతో పాటు స్వపక్ష నేతలు రగిలిపోతున్నారు.

బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో 22మంది కార్పో రేటర్లు ఉన్నారు. ఇందులో 16 మంది టీఆర్ఎస్, ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ. ఒకరు ఎంఐఎం. అయితే పూర్తి కోరంతో ఎమ్మెల్యే ఆశీస్సులతో ప్రస్తుత మేయర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా ఎన్నికైన తర్వాత, పార్లమెంట్ పరిధిలో తమ వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు, వ్యక్తిగత క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో కార్పొరేషన్ పరిధిలోని టీఆర్ఎస్ శ్రేణులు రంజిత్ రెడ్డికి దగ్గరయ్యారు. అందులో పాలక వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యేలు ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు?

ప్రధానంగా ఎమ్మెల్యేలు ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? ఎవరికి అధిష్టానం ఆశీస్సులుం టాయి? ప్రజల్లో ఆరోపణలు లేని నేతలు ఎవరున్నారనే చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంలో రాజేంద్రనగర్ నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలనే డిమాండ్ ను అనుచరులు తెరపైకి తెచ్చినట్లు సమాచారం. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి, బండ్లగూడ జాగీర్ పాలకవర్గంలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అధికార పార్టీ మద్దతుతో గెలిచిన 16 మంది కార్పొరేటర్లలో నలుగురు మేయర్ వైపు వుంటే, 12 మంది డిప్యూటీ మేయర్ వైపున్నారు. ఇదంతా మేయర్ వ్యక్తిగత వ్యవహారంతో విసుగెత్తివర్గాలుగా విడిపోయాయనే వాదన వుంది. కానీ అదే డిప్యూటీ మేయర్ కు కాంగ్రెస్ కార్పొరేటర్లు ముగ్గురు, ఎంఐఎం కార్పొరేటర్ల మద్దతు ఉండటం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ జరుగుతోంది. ఇదే తరుణంలో కార్పొరేటర్ల గోవా టూర్ అగ్నికి ఆజ్యం పోసింది.

12 మంది కార్పొరేటర్లను గోవా టూర్ తీసుకెళ్లారట డిప్యూటీ మేయర్. మరో నలుగుర్ని అండర్ గ్రౌండ్ లో ఉంచారట. క్యాంపు రాజకీయాల తరహాలో గోవా టూర్, అండర్ గ్రౌండ్ ఏంటి అంటూ చర్చ జరుగుతోంది. డిప్యూటీ మేయర్ ఉద్దశమేంటని అడుగుతున్నారట. ఇదంతా ఎమ్మెల్యే, ఎంపీల ఆధిపత్యం నిరూపించుకునేందుకేనని చర్చ జరుగుతోంది. పాలకవర్గంలో మార్పు తెచ్చేందుకూ తెరవెనక పావులు కదుపుతున్నారన్న మాటలూ వినపడుతున్నాయి.

 

Exit mobile version