Off The Record: దేవరకద్ర నియోజకవర్గంలో రాజకీయ రచ్చకు పెద్ద వాగు కేంద్ర బిందువైంది. కృష్ణా జలాలు పారించాలని డిమాండ్ చేస్తూ… మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వట్టి పోయిన వాగులో పాదయాత్ర చేపట్టారు. మూసాపేట మండలం నిజాలపూర్ శివారు నుండి కందూరు వరకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నడవడం రాజకీయ రచ్చకు దారితీసింది. గతంలో తమ హయాంలో ఘనపురం బ్రాంచ్ కెనాల్ నుంచి పెద్ద వాగులోకి కృష్ణా జలాలు పారిస్తూ.. వాగుకు ఊపిరి పోశామని , దీంతో పెద్దవాగు పరిసర ప్రాంతాల్లో భూగర్బ జలాలు కూడా పెరిగాయని, ఎలాంటి నీటి కష్టాలు లేకుండా రైతులు సాగు చేసేవారని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్. ప్రస్తుతం శ్రీశైలంలో నీళ్ళున్నాయి…కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లు రన్ అవుతున్నప్పటికీ ..పెద్ద వాగుకు నీళ్ళు ఎందుకు రాలేదన్నది వాళ్ల ప్రశ్న.
ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ నేతలు ముందు చూపు లేని కారణంగా ఏర్పడ్డ దుస్థితి అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. వాగును ఎండబెట్టి ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారంటూ ఎమ్మెల్యేను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు మాజీ శాసనసభ్యుడు. గత బీఆర్ఎస్ పాలనలో సాధ్యమైన నీటి తరలింపు.. ఇప్పుడెందుకు కావట్లేదని గులాబీ నాయకుడు గుస్సా చేయడం దేవరక్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. అయితే పెద్దవాగులో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన పాదయాత్ర , చేసిన విమర్శలకు సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అండ్ టీం గట్టి కౌంటర్లు ఇస్తోంది. ఆల వెంకటేశ్వర్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉండి నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదంటోంది ఎమ్మెల్యే వర్గం. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వచ్చిన కరువు పరిస్థితులను రాజకీయం చేస్తున్నారంటూ మండిపడుతోంది. ప్రకృతి విపత్తును ఆసరాగా చేసుకొని రైతులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల వైఖరిని తప్పుబడుతున్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.
ఇక ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా …జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు హామీలిచ్చి నెరవేర్చలేదంటు రివర్స్ పంచ్‌లు విసురుతున్నారు. అప్పట్లో చెరువుల్లో నల్లమట్టి అమ్ముకుని, చెక్ డ్యాంల నిర్మాణం మాటున అవినీతి చేశారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జీయంఆర్. పెద్ద వాగులో జరిగిన రాజకీయ రచ్చ నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే… ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలన్నీ ఒక ఎపిసోడ్ మాత్రమేనని, అంతకు ముందు రాజకీయాన్ని దాటి పర్సనల్‌గా వెళ్ళిన ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు. ఇక ఇదే సమయంలో ప్రతి సందర్భంలోనూ దేవరకద్ర నియోజకవర్గంలో రంజుగా మారుతున్న రాజకీయాన్ని గుర్తు చేస్తూ… అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరయ్యేకొద్దీ… ఇది ఇంరెలా మారుతుందోనంటూ ఉత్కంఠగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.

