MLA Danam Nagender : తెలంగాణ శాసనసభ జీరో అవర్ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌తో పాటు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసెంబ్లీ వేదికగా స్పందించారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు అంశాన్ని దానం నాగేందర్ పరోక్షంగా ప్రస్తావించారు. రాజకీయంలో తన భవిష్యత్తు ఏమవుతుందో, ఏ నిర్ణయం వస్తుందో చివరికి తనకు కూడా తెలియదని వ్యాఖ్యానించడం సభలో చర్చనీయాంశమైంది.
ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో ప్రోటోకాల్ ఉల్లంఘన
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా ప్రక్రియలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. అయితే అదే సమయంలో కార్వాన్ నియోజకవర్గంలో మాత్రం అధికారులు నిబంధనలకు అనుగుణంగా ప్రోటోకాల్‌ను పాటిస్తున్నారని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు.
అధికారుల బాధ్యత.. ఎమ్మెల్యేలకు సమాన గౌరవం
నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరికీ సమానమైన గౌరవం దక్కాలని, అధికారులు ఎవరిపైనా వివక్ష చూపకూడదని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులను చూసి భయపడాల్సిన పనిలేదని, అందరికీ చట్టబద్ధమైన హక్కులు ఉంటాయని గుర్తుచేశారు. తన నియోజకవర్గంలో జరిగిన లబ్ధిదారుల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియలో లోపాలు ఉంటే దానికి పూర్తిగా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని, అధికారులు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

