వైసీపీలో వర్గ విభేదాలకు.. సరికొత్త రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది హిందూపురం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై అసమ్మతి ప్రభావం కనిపిస్తోంది. వీటిన్నింటి మధ్య ఎమ్మెల్సీ ఇక్బాల్ ఒంటరి పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మహ్మద్ ఇక్బాల్. ఆయన మాజీ పోలీస్ అధికారి. ఎన్నికల్లో ఓడినా.. ఎమ్మెల్సీని చేసింది వైసీపీ. అయితే ఇక్బాల్ హిందూపురం వచ్చిన్పటి నుంచీ పార్టీలో అసమ్మతి కాక రేపుతూనే ఉంది.
2019 వరకు హిందూపురం వైసీపీకి అన్నీ తానై నడిపిన నవీన్ నిశ్చల్‌ను కాదని ఇక్బాల్‌కు ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వడంతో మొదలైన పంచాయితీ మూడేళ్లయినా సమసి పోలేదు. ఇక్బాల్ పెత్తనాన్ని సహించలేని నవీన్ నిశ్చల్ వర్గం యాంటీగా మారిపోయింది. ఇటీవల ఇక్బాల్ విదేశాలకు వెళ్లిన సమయంలో అసమ్మతి వర్గమంతా ఏకమైంది. కర్నాటకలోని ఒక రిసార్ట్‌లో ప్రత్యేకంగా సమావేశమై కలకలం రేపింది. తర్వాత అలాంటి మీటింగ్స్ హిందూపురంలోనూ జరిగాయి. చివరకు అంతా కలిసి తాడేపల్లి వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. ఇక్బాల్‌పై ఫిర్యాదు చేశారు. కానీ.. అక్కడ నుంచి ఎలాంటి పురోగతి లేదని భావించిన అసమ్మతి వర్గం ఇంకా స్పీడ్ పెంచింది.
విదేశాల నుంచి వచ్చాక హిందూపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పాల్గొంటున్నారు. ఈ ప్రొగ్రామ్‌కు నవీన్ నిశ్చల్ వర్గం దూరంగా ఉంటోంది. అంతా కలిసికట్టుగా కార్యక్రమం నిర్వహించాలని పార్టీ పెద్దలు చెప్పినా.. తమ పంచాయితీ తేలేవరకు గడప దాటేది లేదని తెగేసి చెబుతోంది అసమ్మతివర్గం. దీంతో ఇక్బాల్ కూడా అసమ్మతి నేతల తీరు.. చేష్టలపై వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా సహాయ నిరాకరణ పాటించినా.. ఈ దఫా మాత్రం గట్టిగా నిలబడంతో అసమ్మతివర్గం భవిష్యత్ కార్యాచరణపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠకు దారితీస్తోంది.
ప్రస్తుతం హిందూపురం వైసీపీలో క్యాంపు రాజకీయాలు జోరుగా ఉన్నాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి శంకర నారాయణ చొరవ తీసుకుని ఇక్బాల్, నవీన్ నిశ్చల్ వర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నించడం లేదు. ఈ తగువు పార్టీ పెద్దలే తేల్చాలని అనుకుంటున్నారో ఏమో.. మాజీ మంత్రి చప్పుడు చేయడం లేదు. అసమ్మతి వర్గానికి తెరవెనక అండగా ఉన్న నవీన్ నిశ్చల్ .. జరుగుతున్న పరిణామాలపై నోరు మెదపడం లేదు. పార్టీ కేడర్ దృష్టంతా తాడేపల్లి వైపే ఉందట. రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం.. విభేదాల పరిష్కారానికి అక్కడేం చేస్తున్నారో అని ఆరా తీస్తున్నారు. మరి.. హిందూపురం రగడకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
