తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ నిర్మాణంపై చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన తర్వత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపడతారు. ఇప్పటికే పీసీసీ కొంత కసరత్తు చేసిందని ప్రచారం నడుస్తోంది. రాహుల్ టూర్ ఉండటంతో ఆ కసరత్తుకు బ్రేక్ పడింది. కాకపోతే కమిటీపై మెలిక పంచాయితీ మాత్రం గ్రేటర్ మీద పడింది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలంగానే ఉన్నా.. పాతికకు పైగా సెగ్మెంట్లు ఉన్నా నాయకత్వం అంతంత మాత్రమే. ప్రస్తుతం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పరిస్థితిపై హైకమాండ్ సంతృప్తిగా లేదు. నాయకులను మార్చడమా..? లేదంటే గ్రేటర్‌నే సంస్థాగతంగా విభజించడమా అనేది చర్చకు పెడుతోందట.
గ్రేటర్ హైదరాబాద్ కమిటీని ఇలాగే కొనసాగించాలని అంజన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నట్టే పార్టీ ఉంటే.. ఒప్పుకొనేది లేదని చెబుతోంది AICC. ఆఖరికి గ్రేటర్ హైదరాబాద్‌ను సంస్థాగత కమిటీల పరంగా మూడు ముక్కలు చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ కమిటీని సైబరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్‌గా మూడు ముక్కలు చేస్తారని టాక్. ఈ మూడు ముక్కలకు కూడా కాంగ్రెస్‌లో పోటీ నెలకొంది.
సైబరాబాద్ పరిధిలోకి పాత రంగారెడ్డి జిల్లా వస్తుంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులకు బాధ్యతలు అప్పగించే అవకాశము ఉందట. ఇక్కడ డీసీసీ పగ్గాలు చేపట్టడానికి పార్టీ నేతలు మధుసూదన్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి పోటీ పడుతున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరు రేవంత్‌కు సన్నిహితంగా ఉంటారు. సికింద్రాబాద్ పరిధిలో పార్టీ పోస్ట్ కోసం నేతలు అడం సంతోష్, పార్టీ సోషల్ మీడియా విభాగం చూస్తున్న దీపక్ జాన్ రేస్‌లో ఉన్నారట. నాంపల్లి ఇంఛార్జ్ ఫిరోజ్ ఖాన్ సైతం పగ్గాలు అప్పగించాలని లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే హైదరాబాద్ ఏరియా విషయంలో పార్టీ ఫిరోజ్‌ఖాన్ వైపు ఆసక్తి చూపిస్తోందట. కాంగ్రెస్ మైనారిటీ విభాగానికి చెందిన సోహెల్, మరో నేత వెంకటేష్ ముదిరాజ్‌లు తమ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
గ్రేటర్ కమిటీ విషయంలో పార్టీ నిర్ణయంపై ఇంకా క్లారిటీ రాకపోయినా.. నాయకులు మాత్రం ఇప్పటి నుంచే పదవుల కోసం పోటీ పడటం విచిత్రం. రాహుల్ పర్యటన తర్వాత దీనిపై పార్టీలో పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. కమిటీని మూడు ముక్కలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న అంజన్ తన పంతం నెగ్గించుకుంటారో లేక.. పీసీసీ అనుకున్నదే అవుతుందో చూడాలి.