Site icon NTV Telugu

Off The Record: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారా?

Mainampally

Mainampally

Off The Record: కాంగ్రెస్‌ పార్టీ అంటేనే విచ్చలవిడి అంతర్గత ప్రజాస్వామ్యం. ఒక్క గాంధీల కుటుంబాన్ని తప్ప… మిగతా వాళ్ళలో ఎవరు ఎవర్ని అయినా, ఏమైనా అనవచ్చంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ స్వేచ్ఛ ముసుగులో ఇప్పుడు కోవర్ట్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని ప్రకటించి కలకలం రేపారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అలాంటి వాళ్ళవల్ల పార్టీకి తీరని నష్టం జరిగిపోతోందని, గాంధీభవన్‌లో తీసుకున్న నిర్ణయాలు క్షణాల్లో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు చేరిపోతున్నాయన్నది ఆయన వాదన. ఆ పార్టీ అధికారం కోల్పోయినా మాజీ మంత్రి హరీశ్ రావుకు ఇప్పటికీ పోలీసులు, అధికారులపై పూర్తిస్థాయి కమాండ్ ఉందని చెప్పి ఇంకో సంచలనానికి తెర తీశారు మైనంపల్లి. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యర్థులకు సమాచారం అందిస్తున్నారని, వాళ్ళ వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారాయన. ఈ కోవర్ట్‌ సిస్టం పోతే తాము వంద శాతం గెలుస్తామన్నది మాజీ ఎమ్మెల్యే మాట. మెదక్ నియోజకవర్గంలో 75 శాతం మేర పార్టీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులు గెలిచారని, కోవర్ట్‌ రాజకీయాలు లేకుంటే గనక ఈ పర్సంటేజ్‌ ఇంకా పెరిగి ఉండేదన్నది మైనంపల్లి విశ్లేషణ.

READ ALSO: VC Sajjanar: నేర నియంత్రణలో ‘సరిహద్దులు’ చూడొద్దు: సీపీ సజ్జనర్

మాజీ సీఎం కేసీఆర్ రాజకీయాలను కలుషితం చేశారని, ఆ ప్రభావంతోనే డబ్బులు లేనిదే రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇలా… రకరకాల కోణాల్లో మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని, వారివల్లే పంచాయితీ ఎన్నికల్లో కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని అనడంలో ఆంతర్యం ఏంటని నాయకులు చర్చించుకుంటున్నారు. మైనంపల్లి వ్యాఖ్యల్లో నిజం ఉందా, లేదా? ఒకవేళ లేకుంటే గనక ఆయన టార్గెట్‌ ఏంటన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. అదే సమయంలో హన్మంతరావు కాంగ్రెస్ నేతలందర్నీ కలుపుకుని పోవడం లేదని, మండల స్థాయి నాయకులు కలిసేందుకు సమయం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక మెదక్ జిల్లాకు, సిద్దిపేట జిల్లాకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు లేడు. దీంతో ఆ రెండు చోట్ల ఆయనే పెద్ద దిక్కులా మారారు. మైనంపల్లి మనుషులే పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలుగా చెలామణి అవుతున్నారు. అలాంటప్పుడు హన్మంతరావు ఎవర్ని తప్పు పడతారన్నది ఇంకొందరి ప్రశ్న.

మెదక్, సిద్దిపేట జిల్లాల్లో చాలా గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్స్ ఎక్కువగా పోటీ చేసి గెలిచారు. వాళ్ళకు బీఆర్ఎస్ ఆర్థిక సహాయం చేసి గెలిపించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకుని పని చేస్తే… చివరికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా మైనంపల్లి అవకాశం ఇవ్వకపోవడంవల్లే వాళ్ళు రెబెల్స్‌గా బరిలో దిగారని, వచ్చిన అవకాశాన్ని బీఆర్‌ఎస్‌ సద్వినియోగం చేసుకుంటే…. చేసుకుని ఉండవచ్చన్నది కొందరు కాంగ్రెస్‌ నేతల మాట. అలాగే పార్టీ సీనియర్లతో మైనంపల్లి హన్మంతరావుకు సఖ్యత లేదని… అందర్నీ కలుపుకోకపోవడం వల్లే కాంగ్రెస్ మద్దతుదారులు కొందరు ఓడిపోయారన్న వెర్షన్‌ సైతం ఉంది. తాను చెప్పినట్టు వినని, తన దగ్గరకు రాని నాయకులందరిపై బీఆర్ఎస్ కోవర్టులంటూ ముద్ర వేస్తున్నారన్న చర్చ సైతం జరుగుతోంది. మైనంపల్లి వ్యాఖ్యలపై పిసిసి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

READ ALSO: IND vs SA 4th T20: భారత్- సౌతాఫ్రికా 4వ T20 మ్యాచ్ రద్దు..

Exit mobile version