Site icon NTV Telugu

YCP : వైసీపీ స్వపక్షంలోనే వైరిపక్షంగా మారి ఘర్షణలు

Dsd

Dsd

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత కుమ్ములాటలతోనే కాలం గడిచిపోయింది. పార్టీ నేతలే కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం..కామన్‌గా మారింది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిధార్థ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వర్గపోరు రక్తపోరుగా మారడానికి గీతలేవీ లేవు. సమయం సందర్భం వస్తే వైరిపక్షాలుగా మారి ఘర్షణ పడుతుంటారు.

నందికొట్కూరు వైసీపీలో విభేదాలను పరిష్కరించడానికి గతంలో పార్టీ పెద్దలు విఫలయత్నం చేశారు. ఈ దఫా మాత్రం కాస్త గట్టిగానే ఫోకస్‌ పెట్టారట. ఆర్థర్, సిద్దార్థరెడ్డి గ్రూపులను కలిపేందుకు పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫీల్డ్‌ ఎంట్రీ ఇచ్చారట. ఈ టీమ్‌లో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఉన్నారట. ఎమ్మెల్యే ఆర్థర్‌ను, సిద్దార్థరెడ్డిని తాడేపల్లికి పిలిచి గట్టిగానే క్లాస్‌ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం ఇద్దరూ కలిసి పనిచేయాలని కాస్త కఠినంగా చెప్పారట. గడప గడపకు మన ప్రభుత్వంలోనూ ఐక్యంగా పనిచేయాలని సూచించారట. ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటే కేడర్‌ ఇబ్బంది పడుతోందని.. చివరగా పార్టీకి నష్టం జరుగుతోందని తలంటారట పార్టీ పెద్దలు. ఆ సమయంలోనూ ఆర్థర్‌, సిద్ధార్థరెడ్డిలు ఎవరి వాదన వారు వినిపించారట.

ఇక కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మధ్య ఏమాత్రం పోసగడం లేదు. ఇక్కడ కూడా పరస్పరం కేసులు పెట్టుకున్నారు. బహిరంగ వేధికలపైనే పరస్పరం విమర్శలు హీటెక్కుతున్నాయి. ఈ గొడవల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి, ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో గడప గడప కార్యక్రమంలోను ఎమ్మెల్యే సుధాకర్‌కు నిరసనలు తప్పడం లేదు. అందుకే సుధాకర్‌, హర్షలను తాడేపల్లికి పిలిపించి చర్చించారట. మంత్రులు బుగ్గన, అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే కాటసానిల సమక్షంలోనే కోడుమూరు పంచాయితీ జరిగిందట.
ఇక్కడ కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం. టీడీపీని ప్రోత్సహిస్తున్నారని ఒకరిపై.. కేసులు పెడుతున్నారని మరొకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతా విన్న తర్వాత ఇకపై గొడవలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారట పార్టీ పెద్దలు.

మొత్తానికి నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వివాదాలపై సర్దుబాటు చేసినా ఆయా గ్రూపులు కలిసి పనిచేస్తాయా అనేది పెద్ద ప్రశ్న. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదని గుర్తు చేస్తున్నారు. అయితే ఇపుడు కూడా కలిసి పనిచేయకపోతే అధిష్ఠానం గట్టిగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. ఎట్టకేలకు ఎమ్మెల్యే ఆర్థర్‌, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు.. ఎమ్మెల్యే సుధాకర్‌, కోట్ల హర్షలు కలిసి ఫొటోలు దిగి.. ఇకపై ఐక్యంగా ఉంటామని కేడర్‌కు మెజేస్‌లు చెప్పారట. మరి.. చేతులు కలిసినట్టే.. నేతల చేతలు కూడా కలుస్తాయో లేదో చూడాలి.

 

Exit mobile version