NTV Telugu Site icon

Off The Record: ఇచ్చాపురంలో కోల్డ్ వార్.. ఎవరి దారి వారిదే!

Cold War

Cold War

ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్... ఈసారైనా అక్కడ పార్టీ గెలుస్తుందా? | Off The Record

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇంత వరకు గెలవలేదు. ఈసారైనా గెలవడానికి ప్రయత్నించాల్సిన నేతలేమో గ్రూపులు కట్టి కలేసుకుంటున్నారు. సీటు కోసం పోటీ పడుతున్న నలుగురు నేతలు నాలుగు దారులయ్యారు. ఎవర్ని ఎవరు పెద్ద నేతగా అంగీకరించకపోవడం ఒక సమస్య అయితే.. అధిష్ఠానం ఇంఛార్జ్‌గా పెట్టిన నేతను సైతం ఆ నాయకులు లైట్‌ తీసుకుంటున్నారు. అంత గాలిలోనూ ఓడిన పార్టీని గట్టెక్కించల్సిన నేతలు కోల్డ్‌వార్‌తో.. ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ కుతకుత ఉడుకుతోందట.

బలమైన నేతలు.. కలిసిసాగే పరిస్థితులు లేవు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియెజకవర్గం. ఒడిస్సా బోర్డర్‌కు ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గం టిడిపికి కంచుకోట. వైఎస్‌ఆర్, షర్మిల, జగన్ పాదయాత్రలు ముగింపు కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించింది ఇక్కడే. అధికార వైసీపీలో ఉత్సాహంగా పనిచేసే కేడర్‌కు కొదవ లేదు. కానీ ఇచ్చాఫురంలో ఏదో తేడా కొడుతోంది. ఈ నియోజకవర్గంలో పట్టుకోల్పోపోకుండా చూసుకుంటోంది టీడీపీ. మొన్నటి వైసీపీ హావాలోనూ టెక్కలిలో అచ్చెన్నాయుడు, ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్‌ ఎమ్మెల్యేగాగా గెలిచారు. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లో వైసీపీకి బలమైన లీడర్లు ఉన్నారు. అదే పార్టీకి ఆ పార్టీకి సమస్యగా మారింది. గట్టి వాళ్లం అనుకుంటున్న నేతలంతా ఎమ్మెల్యే టికెట్‌ రేసులో తామున్నామంటే తాముంటూ చెప్పుకొన్నవారే.

ఇంఛార్జ్‌ సాయిరాజ్‌ను లైట్‌ తీసుకుంటున్న నేతలు
మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నా.. ఇతర నేతలు ఆయనతో టచ్‌మీ నాట్‌ అన్నట్టు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిన పిరియా సాయిరాజ్‌ను లైట్‌ తీసుకుంటున్నారు ఆయన కంటే మాకేం తక్కువ అని ఎవరికి వారు రేస్‌లో ఉన్నారు. నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్‌ కుమార్‌, నర్తు నరేంద్ర ఎవరికి వారే టికెట్‌ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. నాలుగు మండలల్లో అత్యధిక శాతంగా ఉన్న యాదవులకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశం నిర్వహించింది యాదవ సంఘం. ఈ కమ్యూనిటీ మీటింగ్ నియెజకవర్గంలో నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారట నర్తు రామారావు, నర్తు నరేంద్ర. సాయిరాజ్ ప్రజల్లో తిరుగుతుండటంతో సీటు కోసం పోటీ పడుతున్న మిగిలిన నేతలు అలర్ట్ అయ్యారు. ఏదో కార్యక్రమం ద్వారా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అసంతృప్తులు.

గ్రూపు రాజకీయాలతో కాలం వెళ్లదీస్తున్న నేతలు
ఇచ్ఛాపురం వైసీపీలో లుకలుకలు ఎప్పటి కప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. ఈ నేతలంతా పైకి కలిసి ఉన్నట్టు కనిపిస్తారు కానీ.. కడపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారట. వీళ్లలో ఎవర్ని ఎవరూ అగ్రనేత అనో.. బలమైన వారనో అనడానికి అస్సలు ఇష్టపడరట. పార్టీ హైకమాండ్ ఎన్నిసార్లు చెప్పినా, ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు సదరు నేతలు. పార్టీ బలోపేతం గాలికొదిలేసి గ్రూపు రాజకీయాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. గత ఎన్నికలలో వర్గవిభేదాలే పార్టీ ఓటమికి కారణమనేది బహిరంగ రహస్యం. విభేదాలను ప్రక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స, పార్టీ పార్లమెంటరీ నేత ధర్మాన కృష్ణదాస్ సమావేశాలు పెట్టారు. అధినేత జగన్ కూడా సుతిమెత్తగా నేతలకు తలంటారు. కానీ నేతల తీరులో మాత్రం మార్పు రావడంలేదట. గత ఎన్నికలలో ఓడిన పిరాయా సాయిరాజ్ కు పార్టీ అధిష్టానం అండగా నిలబడింది. ఆయనకు డిసిఎంఎస్ చైర్మెన్ పదవి కట్టబెట్టింది. పదవీ కాలం ముగిసిన అనంతరం సాయి రాజ్ సతీమణి పిరియా విజయను జడ్పీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు జగన్‌. నియోజకవర్గ బాధ్యతలను కూడా సాయిరాజ్‌కే అప్పగించారు. ఇది రుచించని రెబల్ నేతలు గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారట.

ఇచ్ఛాపురం పరిణామాలపై అధిష్ఠానం సీరియస్‌
టిక్కెట్ ఎవరికి వస్తే వారిని గెలిపిద్దామని, పార్టీకోసం కష్టపడదామని సాయిరాజ్ చెబుతున్నా నేతలు తలో దారిన ఉన్నారట. ఇచ్ఛాపురంలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, అధిష్టానానికి తలనోప్పిగా మారింది. ఇంచార్జ్ గా ఉన్న సాయిరాజ్‌పై కారాలు మిరియాలు నూరుతున్న నేతలను ఒక్కతాటి పైకి తెచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు కార్యకర్తలు. ఇచ్ఛాపురం పరిణామాలపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉందట. ఆధిపత్యపోరుతో పార్టీని దెబ్బతీస్తే ఉపేక్షించేదిలేదని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. సాయిరాజ్‌‌ తో కలసి ముందుకు వెళ్లాలని చెప్పేశారట. మరి.. ఈ హెచ్చరికలు ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి.