Site icon NTV Telugu

Off The Record: ప్రకాశం టీడీపీలో అన్నదమ్ముల కోల్డ్ వార్!

Pkm

Pkm

Off The Record: ప్రకాశం జిల్లా టీడీపీలో అన్నదమ్ముల కోల్డ్‌వార్‌ నడుస్తోందా? అధ్యక్ష పదవి కోసం త్రిసభ్య కమిటీ ఎంపిక చేసిన పేర్లకు కాదని కొత్తవి ఎందుకు తెర మీదికి వస్తున్నాయి? ఎస్సీకి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే జనార్థన్‌ సన్నాయి నొక్కులు నొక్కడం వెనక స్టోరీ వేరే ఉందా? పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసమే దామచర్ల ఎస్సీ పాట పాడుతున్నారా? ప్రకాశం టీడీపీలో అసలేం జరుగుతోంది?

Read Also: Bandi Sanjay : కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం

ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి నియామకంలో ట్విస్ట్‌ మీద ట్విస్ట్‌లు పెరుగుతున్నాయి. చినికి చినికి చివరికి ఇది అన్నదమ్ముల సవాల్‌గా మారుతోందంటున్నారు పరిశీలకులు. జిల్లా అధ్యక్ష పదవి కోసం గతంలో ముగ్గురు నేతల పేర్లను ప్రతిపాదించారు. కానీ, ఆ లిస్ట్‌ పక్కకు వెళ్ళి తాజా పరిశీలన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి జిల్లా నేతలతో ఇప్పటికే పార్టీ అధిష్టానం తరఫున కీలక నేతలు మాట్లాడినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాను దృష్టిలో పెట్టుకుని అధ్యక్ష ఎన్నిక ఉండవచ్చని భావిస్తున్నారు. ఒంగోలు లోక్ సభ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం నూకసాని బాలాజీ కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్ధ చైర్మన్ గా అవకాశం దక్కింది. దీంతో పాటు మూడేళ్లుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతుండటంతో అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. ఒంగోలు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకుగాను ఐదింటిని గెలుచుకుంది టీడీపీ. దాంతో.. సంస్దాగతంగా పార్టీని బలోపేతం చేయటంతో పాటు జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతోంది.

Read Also: YIPS : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం

ఈ క్రమంలోనే.. జిల్లా అధ్యక్ష ఎంపిక కోసం మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సభ్యులు గత నెలలో ఏడు నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఒంగోలు, మార్కాపురం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, కందుల నారాయణరెడ్డితోపాటు ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు పేర్లను కీలక నేతలు సిఫార్సు చేశారు. కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, దర్శి టీడీపీ ఇన్‌చార్జి లక్ష్మి తాము అధ్యక్ష పదవిని ఆశించడం లేదని ముందే చెప్పేశారు. అయితే అప్పటి ప్రతిపాదనలు పక్కకు పెట్టిన పార్టీ అధిష్టానం… ప్రస్తుతం ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ మారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరికి కచ్చితంగా అవకాశం ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొత్త ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నూకసాని బాలాజీ ఖాళీ చేసే స్థానంలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇస్తే రాంగ్‌ ఇండికేషన్ వెళ్తుందని చెబుతూ.. ఆ ప్లేస్‌లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ పేరును తెర మీదకు తీసుకువచ్చినట్లు సమాచారం.

Read Also: Himachal Pradesh: ఓ వీరుడి సోదరి వివాహాన్ని జరిపించిన సైనికులు.. అతిథులు కన్నీటిపర్యంతం

అయితే, బీసీ స్ధానాన్ని ఎస్సీతో భర్తీతో చేస్తేనే బాగుంటుందని ఆయన చెప్పడం వెనక కారణాలు వేరే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది జిల్లాలో. దామచర్ల జనార్ధన్‌కు, ఆయన కజిన్ దామచర్ల సత్యకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్నది జిల్లా టాక్‌. పైకి చెప్పేందుకు సంతనూతలపాడు నియోజకవర్గం ఒంగోలుకు అంతర్భాగంలా ఉంటుంది కాబట్టి అధ్యక్షుడు జిల్లా కేంద్రానికి అందుబాటులో ఉంటాడని, బీసీ స్థానంలో ఎస్సీకి ఛాన్స్‌ ఇస్తే బాగుంటుందని అంటున్నా… లోపల మాత్రం సత్యకు చెక్‌పెట్టే ప్లాన్‌ ఉందన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు సత్య వైపు మొగ్గితే జిల్లా టీడీపీలో తన ఆధిపత్యానికి గండి పడుతుందని భయపడుతున్నారట జనార్ధన్. అందుకే సిట్యుయేషన్ ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఎస్సీ అభ్యర్థి ప్రతిపాదన పేరుతో… తన సొంత ఇంటి నుంచి ఎదురవబోయే సమస్యలకు ఆదిలోనే చెక్ పెట్టే ప్రయత్నంలో ఒంగోలు ఎమ్మెల్యే ఉన్నారన్నది ఎక్కువమంది అంచనా. విజయ్ కుమార్ అధ్యక్షుడిగా ఉంటే జిల్లా పార్టీ తన కనుసన్నలలోనే ఉంటుందని భావిస్తున్నారట జనార్దన్. మరి టీడీపీ అధ్యక్షుడి విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి పార్టీ వర్గాలు.

Exit mobile version