NTV Telugu Site icon

TDP Leader :చింతమనేని కి ప్రాణహాని ఉందని కోర్టులో పిటిషన్..!

Reverse Attacky

Reverse Attacky

చింతమనేని ప్రభాకర్‌. దెందులూరు మాజీ ఎమ్మెల్యే. ప్రభాకర్‌ ఎక్కడుంటే అక్కడ వివాదం అన్నట్టు రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన దూకుడే ఆ ప్రచారాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం అధికార బలం లేకపోయినా అనుచరగణం వెంటే ఉంది. ఈ క్రమంలో చేసిన పనుల వల్ల వరసగా కేసుల్లో కూరుకుపోయారు చింతమనేని. అధికారంలో ఉన్నప్పుడు.. గత ఎన్నికల టైమ్‌లో వైసీపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయంగా కాకరేపుతున్నాయి. కేసులంటే భయపడని చింతమనేని.. తాజాగా కొత్తదారి ఎంచుకోవడంతో చర్చగా మారింది. తనకు ప్రాణహాని ఉందని.. తన అనుచరులనూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ కోర్టుకు, కేంద్ర హోంశాఖకు, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు చింతమనేని.

2019 ఎన్నికల తర్వాత తనపై భౌతికంగా దాడులు చేస్తున్నారన్నది చింతమనేని ఆరోపణ. తనతోపాటు ఉన్నవారినీ.. చివరకు తన లాయర్‌ను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఫైర్‌ అవుతున్నారు. ఇప్పుడు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఏలూరు కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ వేసేశారు చింతమనేని. ప్రభుత్వ సలహాదారు సజ్జలతోపాటు మాజీ డీజీపీ గౌతంసవాంగ్‌ తదితర 21 మందిపై ఆ పిటిషన్‌లో ఆరోపణలు చేశారు. నిన్నమొన్నటి వరకు కేసులంటే లెక్కేచేయని చింతమనేని ఇపుడు తన ప్రాణానికి ముప్పుందని గవర్నర్, కేంద్ర హోంశాఖలతోపాటు కోర్టును ఆశ్రయించడమే ఆసక్తి కలిగిస్తోంది.

ఈ పరిణామాలు చూసిన వారు చెబుతున్నది ఒక్కటే.. అధికారిపార్టీపై చింతమనేని రివర్స్‌ అటాక్‌ మొదలు పెట్టారని. చేతిలో అధికారం ఎలాగూ లేదు. ఇప్పుడు తిరగబడి పోరాడితే పోయేదేం లేదని ఫిక్స్‌ అయినట్టు కనిపిస్తోంది. ఈ ఆలోచనతోనే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదులు మొదలుపెట్టారు చింతమనేని. పైగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇబ్బంది పెడుతున్నారని స్వరం పెంచారు. ఈ చర్యలతో డీలాపడ్డ కేడర్‌కూ ధైర్యం వస్తుందని లెక్కలు వేస్తున్నారట. దెందులూరులో తాను అమలు చేయబోయే యాక్షన్‌ ప్లాన్‌కు కేడర్‌ అంతా ధైర్యంగా సహకరిస్తుందని అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే బాదుడే బాదుడు పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న చింతమనేని ఇకపై ఏం జరిగినా అమీతుమీ తేల్చుకోవాలని అనుకుంటున్నారట. మరి.. చింతమనేని ఎంచుకున్న ఈ మార్గం ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.