Site icon NTV Telugu

పుంగనూరుపై చంద్రబాబు ఫోకస్‌..?

చిత్తూరు జిల్లాలో ఆ ఇద్దరు నాయకుల మధ్య వైరం పీక్స్‌కు చేరింది. ఓపెన్‌గానే సవాళ్లు విసురుకుంటున్నారు. మాటలతో ఒకరు.. కవ్వింపులతో ఇంకొకరు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. దీంతో పుంగనూరు గిత్తకు పొగరెంత అని లెక్కలేసుకుంటున్నాయి శ్రేణులు. వారెవరో.. ఏంటో లెట్స్‌ వాచ్‌..!

చంద్రబాబు కుప్పంలో గెలవలేరని మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్‌..!

చిత్తూరు జిల్లా రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ పొలిటికల్‌ హీట్‌ నడుస్తోంది. ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీలో చదువుకొనే రోజుల నుంచే ప్రత్యర్థులు. 2014 ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది. 2019లో కుప్పంలో చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మంత్రిగా కేబినెట్‌లో.. వైసీపీలో కీలకంగా ఉన్న ఆయన.. ఆపరేషన్‌ కుప్పం చేపట్టి అక్కడ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య శ్రీకాళహస్తిలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా చంద్రబాబు గెలవలేరని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే తాను రిటైర్మెంట్‌ తీసుకుంటానని ప్రకటించారాయన. దమ్ముంటే పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లిలో ఎక్కడ నుంచైనా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు కూడా. ఇక టీడీపీ అధినేత కుప్పాన్ని మర్చిపోవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పెద్దిరెడ్డి పుంగనూరులో ఎలా గెలుస్తారో చూస్తానని బాబు సవాల్‌..!

మంత్రి పెద్దిరెడ్డి ఎన్ని విమర్శలు చేసినా.. ఇన్నాళ్లూ స్పందించని చంద్రబాబు.. ఈసారి కుప్పం పర్యటనలో మాత్రం తొలిసారి పెదవి విప్పారు. నేరుగా పెద్దిరెడ్డికే గురిపెట్టారు. ఈసారి పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్‌ విసిరారు చంద్రబాబు. దాంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. చంద్రబాబు ఎందుకు ఈ సవాల్‌ చేశారు? వరస ఓటములతో డీలాపడ్డ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకొచ్చేందుకు ఈ మాటలు అన్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అని ఆరా తీస్తున్నారట.

ముగ్గురు టీడీపీ నేతలకు ఆపరేషన్‌ పుంగనూరు అప్పగింత..!

పుంగనూరు అసెంబ్లీ పరిధిలో జరిగిన పంచాయతీ, పరిషత్‌, ఎన్నికల్లో టీడీపీ నుంచి నామినేషన్లు వేయడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. కొత్తగా ఆ నియోజకవర్గానికి చల్లా రామచంద్రారెడ్డిని టీడీపీ ఇంఛార్జ్‌గా నియమించారు. చల్లాపై ఉన్న నమ్మకంతోనే చంద్రబాబు అలాంటి ప్రకటన చేశారని కేడర్‌ అనుకుంటోందట. కుప్పం పర్యటనలో చంద్రబాబు వెంటే ఉన్నారు పార్టీ నేత చల్లా. అయితే నిన్న మొన్నటి వరకు ఒకటి రెండు మండలాలకే పరిమితమైన చల్లాబాబును రాటుదేల్చే పనిని పుంగనూరు బాధ్యతలను టీడీపీ సీనియర్‌ నేతలు అమర్నాథ్‌రెడ్డి, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి అప్పగించారట. ఈ ముగ్గురు కలిసి ఆపరేషన్ పుంగనూరు చేపడతారని టాక్. అందుకే మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడుతున్నారు. మరి.. ఇద్దరి మధ్యా 30 ఏళ్లుగా ఉన్న వైరంలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో.. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో కాలమే చెప్పాలి.

Exit mobile version