ఆ…ఎన్నికల్లో గెలుపు అధికారపార్టీ అగ్ర నాయకుడి పనితీరుకు గీటురాయిగా మారనుందా? సార్వత్రిక సమరానికి సెమీఫైనల్స్ కావడంతో చాలెంజింగ్ టాస్క్ అయ్యిందా? టీడీపీ కోటను ఆయన బద్దలు కొట్టగలరా? ఆ దిశగా ఆ ముఖ్య నాయకుడి ముందున్న సవాళ్లేంటి? సిద్ధమవుతున్న వ్యూహాలు సక్సెస్ అవుతాయా?
రాజకీయాల్లో గెలుపే గీటురాయి. అధికారపార్టీకైతే ప్రతీ ఎన్నిక ప్రతిష్టాత్మకమే. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ హవా చాటింది. ఇప్పటి నుంచే 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయ్. కలిసివచ్చే ప్రతీ అవకాశాన్నీ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ రేసులో వైసీపీ పది అడుగులు ముందే ఉంది. వచ్చే ఏడాది ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే వైసీపీ తమ అభ్యర్థిగా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌ను ప్రకటించింది. కీలకమైన ఓటర్ల నమోదు, ప్రచారంపైన ఫోకస్ పెట్టింది. సాధారణంగా పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అధికారపార్టీ దూరంగా ఉంటుంది. 2017లో జరిగిన ఎన్నికలోను ఇక్కడ టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ గెలిచారు. కానీ ఈ సారి వైసీపీ నాయకత్వం చాలా ముందుగానే అభ్యర్థిని ప్రకటించి.. గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి భుజాలపై పెట్టింది.
సార్వత్రిక సమరానికి ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న వేళ అందరికంటే వైవీకి ఇది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్‌గా చర్చ జరుగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. పట్టభద్రుల ఎన్నికలు మిగిలిన వాటి కంటే భిన్నంగా జరుగుతాయి. ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు 2019 అక్టోబర్ నాటికి డిగ్రీ లేదా ఇంటర్ తర్వాత మూడేళ్ల డిప్లొమా చేసిన వారు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. గతంలో రిజిస్ట్రేషన్స్ చేయించుకున్న వాళ్లు తిరిగి ఇప్పుడు ఓటు హక్కును పొందడం తప్పనిసరి. పట్టభద్రుల ఓటర్ల సంఖ్య అర్బన్ ఏరియాల్లో ఎక్కువ. ఒక అంచనా ప్రకారం మొత్తం ఓటర్లలో అధికశాతం వైజాగ్ పరిధిలోనే ఉండనున్నారు. ఈ లెక్కలు వేసుకున సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ వేచి చూసే ధోరణిలో ఉంది. వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్న పీడీఎఫ్ ఇప్పటి వరకు బయటపడలేదు. పార్టీల వ్యూహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ బహుముఖ పోటీ అనేది అనివార్యం. ఈ యాంగిల్లో అధికారపార్టీకి., అందులోను ఎన్నికల సమన్వయకర్తగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి ఛాలెంజ్ తప్పదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నలుగుతోంది.
విశాఖ నగరంలో దక్షిణ, గాజువాక, పెందుర్తి, భీమిలిలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కీలకమైన సిటీపై టీడీపీ ఎమ్మెల్యేల ఆధిపత్యం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ నాలుగు చోట్ల గెలవగా అవన్నీ అర్బన్ పరిధిలోనివే. దీంతో సిటీ ఓటర్లు, విద్యావంతులు వైసీపీకి దూరం అనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. ఆ తర్వాత గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 30స్థానాల్లో గెలిచినా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో ఆ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలనేది వైవీ ఆలోచన. ఇక్కడ గెలిస్తే క్లాస్., మాస్ అన్ని సెగ్మెంట్స్ వైసిపి వైపే చూస్తున్నాయనే బలమైన సంకేతాలు ప్రజల్లోకి పంపించాలని చూస్తోంది అధికారపార్టీ. అలాగే మూడేళ్ల జగన్ పాలనకు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల ఆమోదం ఉందనేది ఉత్తరాంధ్ర వైపు నుంచే మొదలు పెట్టాలని సుబ్బారెడ్డి చూస్తున్నారట.
ఉమ్మడి జిల్లాల సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సుబ్బారెడ్డి ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు ఇవే. పోటీకి దిగితే వైసీపీదే గెలుపు అనే ముద్రను గతంలో ఉన్న నాయకత్వం ప్రదర్శించింది. అంతకు మించిన ఘనమైన గెలుపు సాధించడం ద్వారా తనదైన శైలిని ఇక్కడ నాయకత్వాన్ని అలవాటు చేయడం వైవీకి ముఖ్యం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచిస్తున్నారు. ఆ దిశగా పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు మీద ఫోకస్ పెట్టారు. ఓటర్లను ఆకట్టుకోవడమే కాదు వాళ్లు లేవనెత్తే సమస్యల పరిష్కారం చేసేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం కీలకం అనేది సీనియర్ల ఒపీనియన్. నగర పరిధిలోని ప్రతీ అపార్ట్ మెంట్ కు వెళ్లి డోర్ టు డోర్ ఎన్ రోల్ చేయించడం ద్వారా సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీ ఓట్ బ్యాంక్ ను పెంచుకునే ప్రయత్నం కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో వైవీ సుబ్బారెడ్డి విస్త్రతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతర్గత వ్యవహారాలను పక్కనబెట్టి ఎమ్మెల్సీ గెలవాలని ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపించాలనేది ఆలోచన. మరి అధికారపార్టీ ఎత్తుగడలను ప్రతిపక్షాలు ఏ విధంగా ఎందుర్కొంటాయో చూడాలి.