Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?

Nalgonda

Nalgonda

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు కొందరికి గులాబీ ముళ్ళు గట్టిగానే గుచ్చుకుంటున్నాయా? ఆ ఉమ్మడి జిల్లాలో సొంత పార్టీ వాళ్ళే నిద్ర లేకుండా చేస్తున్నారా? మాకేం కాదనుకుని ఇన్నాళ్ళు కాళ్ళు ఆరజాపి కూర్చున్న వాళ్ళ సీట్ల కింద ఇప్పుడు సెగలు పుడుతున్నాయా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అసలేం జరుగుతోంది?

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు కొన్ని నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారట. పక్కలో బల్లెంలా తయారై వాళ్లు కత్తులు నూరుతుంటే…. మరికొన్ని నియోజకవర్గాలలో కొత్త నేతల దూకుడు మాజీ ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందంటున్నారు. దీంతో ఇక్కడి గులాబీ మాజీల్లో కొందరికి భవిష్యత్ అంధకారంగా కనిపిస్తుంటే…. మరికొందరికి ఫ్యూచర్ ఏంటో అర్దంకాక తలలు పట్టుకుంటున్నట్టు చెబుతున్నారు. తమకు ఎదురుగా కనిపిస్తున్న, డ్యామేజ్‌ చేస్తున్న శత్రువుతో ఏ ఆయుధంతో పోరాడాలో తెలియక మాజీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా బరిలో దిగబోతున్నానని, బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేది నేనే… పార్టీ ముఖ్యుల ఆశీస్సులు నాకే ఉన్నాయంటూ సదరు ద్వితీయ శ్రేణి నాయకులు చేసుకుంటున్న ప్రచారం మాజీ ఎమ్మెల్యేలకు అస్సలు మింగుడు పడ్డం లేదట. ఇంకొందరైతే…కీలక నేతల దగ్గర ఆ విషయాన్ని ఓపెన్‌గానే మాట్లాడుతున్నట్టు తెలిసింది. కేవలం మాటలతో ఆపకుండా… అదే ఎమోషన్‌ను కంటిన్యూ చేస్తూ… సోషల్ మీడియాలో కూడా వరస పోస్టులు పెట్టి క్యాడర్‌ను సైతం కన్ఫ్యూజ్ చేస్తున్నారట.  దీంతో ఈ ముళ్ళు మాజీ ఎమ్మెల్యేలకు గట్టిగానే గుచ్చుకుంటున్నాయని అంటున్నారు.

సదరు నేతల సోషల్ మీడియా పోస్టులపై ఎలా నిలదీయాలి…. ఎవర్ని అడగాలి, ఇంకెవరిని కడిగిపారేయాలో అర్థం కాక తలలు బాదుకుంటున్నారట సీనియర్స్‌. ఓ మాజీ మంత్రి పీఏ.. తన సొంత నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్న మరో నియోజకవర్గంలో కూడా కర్ఛీఫ్ వేసి అందుకు అనుగుణంగా క్యాడర్‌ను కలుపుకుని కార్యక్రమాలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తనకు ఫ్యూచర్ ఉంటుందన్నట్టు సదరు పీఏ పొలిటికల్ స్టెప్స్ వేస్తుండటం ఓ మాజీ ఎమ్మెల్యేను పరేషాన్ చేస్తోందట. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తనకు తన బాస్‌ అయిన మాజీ మంత్రి ఆశీస్సులు ఉన్నాయని ఆ పీఏ గులాబీ వర్గాలకు చెబుతుండటం ఇంకా మంట పుట్టిస్తోందట. ఇక ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం దేవరకొండలో ప్రజారాజ్యం నుండి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేత బీఆర్ఎస్ నేతలతో కలిసి తిరుగుతూ పెద్ద ఎత్తున క్యాడర్ కోసం, జనం కోసం ఖర్చు చేస్తున్నారట మరొకాయన. తనకు కేటీఆర్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మునుగోడు నియోజకవర్గానికి చెందిన రియల్టర్ ఒకరు బెంగుళూరులో బాగా సంపాదించి స్థానికంగా తన తల్లిపేరిట ఫౌండేష్ ఏర్పాటు చేసిగుడికి, బడికి, అభివ్రుద్దికి నిధులు ఇస్తూనే ఉన్నారు. ఆయన తాజాగా సాగునీటి సాధన పోరాటానికి సిద్దం కావడం, ప్రభుత్వ ఆసుపత్రుల కోసం ప్రజలతో కలిసి రోడ్డెక్కి పోరాటం చేస్తుండటం.. అందుకు గులాబీనేతలను కలుపుకుని వెళ్ళడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

సదరు సామాజిక సేవకుడు ఇక గులాబీ తీర్ధం పుచ్చుకోవడమే తరువాయి అన్నట్లుగా యాక్టీవిటీ ఉండం స్థానిక మాజీ ఎమ్మెల్యేకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కూడా ఓ రియల్టర్ తమ ఫౌండేషన్ కార్యకలాపాల స్పీడ్ మళ్లీ పెంచినట్టు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించినప్పటికీ.. సిట్టింగ్‌లకే ఇవ్వడంతో వెనక్కి తగ్గిన వ్యాపారి కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. తాజాగా మనసుమార్చుకుని బీఆర్ఎస్ కీలక నేతలతో సఖ్యతగా తిరుగుతూ… నియోజకర్గంలో తన ఫౌండేషన్ యాక్టీవిటిని పెంచారట. ఫౌండేషన్ పేరుతో యువత, నిరుద్యోగులకు దగ్గర అవుతున్నారట.

వచ్చే ఎన్నికలను బేస్ చేసుకుని ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా… గులాబీ పార్టీలో చురుకుకైన పాత్ర పోషించేందుకు సదరు రియల్టర్ తెర వెనుక ప్రయత్నాలు చేస్తుండటం మాజీ ఎమ్మెల్యే గుండెల్లో గుబులు రేపుతోందట.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళు ప్రజాక్షేత్రంలో, క్యాడర్ కోసం తిరగడం ఎప్పుడో మానేశారని, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు కూడా దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం గులాభీ దళంలో చాలా కాలంగా ఉంది. అందుకే సొంత పార్టీ నేతలు కొందరు, కొత్తవాళ్ళు మరికొందరు గులాబీ గూటికి ఎంట్రీ ఇచ్చేందుకు అడుగులువేస్తున్నారని… చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదంటూ గుర్తు చేస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.