మూడు సార్లు ఒకే నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు. అది కూడా ప్రతిపక్ష పార్టీ తరపున. నాలుగోసారి అధికార పార్టీ తరపున విజయం సాధించాడు. సిఎంను కలసి వచ్చాక… ప్రత్యర్ధులపై ఎదురు దాడి చేస్తున్నాడు. రెండు రోజులుగా తన అసంతృప్తిని అంతా వెల్లగక్కాడు. ఇంతకీ ఎవరా నేత ?
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్‌హాట్‌గా సాగుతున్నాయ్. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య…మూడు సార్లు ప్రతిపక్షం నుంచి గెలిచాడు. అంతకు ముందు పాలేరు నుంచి విజయం సాధించాడు. ఎప్పడు ప్రతిపక్షంలోనా ఉండాలా…అధికార పక్షంలో ఎందుకు ఉండకూడదు అనుకున్నాడో ఏమో…ఈ సారి గెలిచి..గులాబీ చొక్కా తొడిగేశాడు. మూడు చొక్కాలు మార్చిన ఆయన…సత్తుపల్లిలో హేమాహేమీలతో తలపడుతున్నాడు. నాడు జలగం వెంగళరావు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. జలగం ప్రసాద రావు, తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి…అందరూ ఈ ప్రాంతానికి చెందిన వారే.
వారం రోజులుగా సండ్ర వెంకట వీరయ్య…తన ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నాడు. కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆవేదన ఆయనకు ఉందంట. తాను ముసుగు రాజకీయాలు చేయనని..టీడీపీలో అనేక కేసులను ఎదుర్కొన్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పని చేశానని… ఏ పదవులను అనుభవించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఇరవై ఏళ్ల క్రితం వేసిన రోడ్లుమావే అంటూ…ప్రచారం చేయడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎస్సీ నియోజకవర్గమని…ఇక్కడ ఓసీలు పోటీ చేస్తారా.. ? రాజ్యంగ బద్దంగా ఎస్సీలు మాత్రమే పోటీ చేయాలని అన్నారు. వారంతా తమదే అభివృద్ది అని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని ప్రశ్నించిన సండ్ర..వారేమన్నఇక్కడ పోటీ చేస్తారా ? అది సాధ్య పడుతుందా ..అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గతంలో సత్తుపల్లి నియోజకవర్గంలో పని చేసిన వారు…ఇప్పటి పనులను కూడా తమ పనులుగానే ప్రచారం చేసుకోవడంపై సండ్ర మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయ్. కొన్ని రోజులుగా అధికార పార్టీలో ఉన్న నేతలతో సండ్రకున్న విభేదాలు తారాస్థాయికి చేరాయ్. మునుగోడు ఎన్నికల వేళ…సత్తుపల్లి టిడిపి నేతలు భారీ ర్యాలీ నిర్వహించి… టిఆర్ఎస్‌లో ఉన్న నేతకు ఆహ్వానం పలికారు. అప్పటి నుంచి సండ్ర కుతకుత లాడుతున్నారట. నియోజకవర్గంలో మాజీ ఎంపీ నిర్వహించిన అభినందన సభకు కూడా ఆ నేతకు ఆహ్వానం రాలేదట. దీంతో అప్పటి నుంచి…ఆ నేతతో అసలు సరిపడడం లేదట. తాజాగా ఆ నేత వర్గీయులందరూ…ఇప్పుడు సండ్రను టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట.
అవకాశం కోసం ఎదురు చూస్తున్న సండ్ర…గత వారం రోజుల నుంచి ప్రత్యర్ధి శిబిరంపై దాడి చేస్తూనే ఉన్నారు. ఈ దాడికి పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఉందా… అంటే అవుననే అంటున్నారట ఆయన వర్గీయులు. పార్టీ అధినేతను కలసి వచ్చినప్పటి నుంచి తన ప్రత్యర్ధిపై బాణాలు ఎక్కుపెడుతున్నారట. టిడిపి నుంచి వచ్చిన సండ్ర వెంకటవీరయ్య…పాత టిడిపి వర్గాలతో అసలు సరిపడటం లేదట. గ్రామాల్లో పాతుకుపోయిన టిడిపి వర్గాలకు…సండ్రకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయట. ఈ కారణంగానే సండ్ర.. అక్కసును బహిర్గతం చేస్తున్నాడని అంటున్నారు. ఎన్నికల వేళ ఆ వర్గాన్ని మొత్తం సండ్ర దూరం చేసుకుంటున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయ్. ఈ వ్యవహారం భవిష్యత్‌లో సండ్రకు దెబ్బ కొడుతుందని…ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారట. పాతతరాన్ని వదిలేసి…కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారట సండ్ర వెంకటవీరయ్య.
సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని…సండ్ర రెండు వర్గాలుగా చీల్చారన్న అపవాదు ఉంది. సండ్రకు మాత్రం తన పార్టీలోనే…ఒక్క వర్గం వ్యతిరేకంగా పని చేస్తోందని…అనుమానిస్తున్నారట. మొత్తం మీద సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయ్.