Site icon NTV Telugu

BJP :తెలంగాణ పై బీజేపీ కొత్త లవ్వు..ఢిల్లీలో ప్రత్యేకంగా వేడుకలు

Amit

Amit

దక్షిణాదిలో తెలంగాణలో కూడా పాగా వేయాలని చూస్తోన్న బీజేపీ అగ్రనాయకత్వం.. రాష్ట్రంపై అన్నిరకాల ఎఫర్ట్స్‌ పెడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నది గోల్‌. ఆపై లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడున్న నాలుగు సీట్లే కాకుండా మరిన్నిచోట్ల పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్య నేతలు తరచుగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్‌కు ప్రధాని మోడీ వచ్చారు. ఆయన నగరంలో ఉన్నది కొద్ది గంటలే అయినప్పటికీ.. అందులో పార్టీకి కూడా సమయం కేటాయించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌పై పదునైన విమర్శలు చేశారు మోడీ.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల బహిరంగ సభలు కూడా జరిగాయి. పొలిటికల్‌గా స్పీడ్‌ పెంచాలని తగిన సూచనలు చేశారు కూడా. ఇదే సమయంలో బీసీ వర్గానికి చెందిన డాక్టర్ కే. లక్ష్మణ్‌ను ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పంపుతోంది బీజేపీ. ఇప్పుడు కమలనాథుల దృష్టి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై పడింది. ఆ కార్యక్రమాన్ని కూడా పార్టీకి మైలేజ్‌ వచ్చేలా మార్చుకోవాలని చూడటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరవుతున్నారు. దీనిపై పెద్దఎత్తున బీజేపీ ప్రచారం మొదలు పెట్టేసింది. గత ఏడాది సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహించింది. అమిత్ షా ఆ కార్యక్రమానికి వచ్చారు. హైదరాబాద్‌లో అమరుల యాదిలో ఆకాంక్షల సాధన సభను కూడా ఏర్పాటు చేసింది బీజేపీ. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఇలాంటి అన్ని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు కమలనాథులు. ఇటీవల మోడీ ప్రసంగంలోనూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని.. ఒక కుటుంబం చేతిలో తెలంగాణలో బంధీ అయిందని తీవ్ర విమర్శలు చేశారు.

ఎప్పుడూ తెలంగాణ అవతరణ వేడుకలు బీజేపీ ఆఫీస్‌కే పరిమితం అయ్యేవి. తొలిసారి ఢిల్లీస్థాయిలో చేయడం.. దానికి అమిత్‌షా రాక రాజకీయ వ్యూహంలో భాగంగానే విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లోనే బీజేపీ స్టాండ్‌ గట్టిగా చెప్పాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. మరి.. కొత్త ప్రేమ.. సరికొత్త వ్యూహాలు బీజేపీకి ఏ మేరకు వర్కవుట్‌ అవుతాయో చూడాలి.

 

Exit mobile version