పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ మనసు బస్సుయాత్రపైకి మళ్లింది. ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం వల్లే వ్యూహం మారుస్తున్నారట. కాషాయ శిబిరంలోనూ అదే చర్చ. ఇంతకీ సంజయ్ నిర్ణయం వెనుక అదే కారణమా? ఇంకేదైనా వ్యూహం ఉందా?
జంట నగరాల్లోనూ సంజయ్ పాదయాత్ర
తెలంగాణలో ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. తాజా యాత్ర ఈ నెల 15నున కరీంనగర్‌లో ముగియనుంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఆరో విడత పాదయాత్రను జంట నగరాల్లో పదిరోజులపాటు చేయాలన్నది కమలనాథుల ఆలోచన. చివరగా పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభతో ఆరో విడత పాదయాత్ర ముగించాలన్నది సంజయ్ అండ్ కో ప్లాన్ వేసుకుంది. అలా ఆరు విడతల్లో పాదయాత్రకు ఫుల్ స్టాప్ పెట్టి.. బస్ యాత్ర చేయాలనే ఆలోచనతో ఉన్నారట బీజేపీ నేతలు. బస్సు యాత్రపై బీజేపీలో చర్చ కూడా మొదలైంది. తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనే ప్రచారం వల్లే బస్సుయాత్రకు మొగ్గు చూపుతున్నారని సమాచారం. పాదయాత్ర ద్వారా అన్ని సెగ్మెంట్లకు తక్కువ సమయంలో వెళ్లలేమని.. అదే బస్సును నమ్ముకుంటే కొంతలో కొంతైనా రీచ్ కాగలమని భావిస్తున్నారట.
బీజేపీలో ముందస్తు ఎన్నికల హడావిడి
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకంటే బీజేపీలోనే ముందస్తు ఎన్నికలపై ఎక్కువగా చర్చ జరగడం ఆసక్తి కలిగిస్తోంది. ముందస్తు ఎన్నికలపై వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యాత్రను పూర్తి చేయాలని బీజేపీ అధినాయకత్వంతోపాటు.. పార్టీ అగ్రనేత సునీల్ బన్సల్ సూచించారట. యాత్రవల్ల ప్రజల్లో స్పందన బాగున్నా.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పార్టీ యాక్టివిటీ.. సంస్థాగత అంశాలు స్లో అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారట. దీనికితోడు సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వచ్చే ఏడాది మార్చి 11తో ముగుస్తుంది. పార్టీ రాష్ట్ర సారథిగా ఆయన పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతుంది. మరోదఫా ఆయన్ని కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని సంజయ్‌ను అధ్యక్షుడిగా కొనసాగిస్తారని కాషాయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
అన్ని నియోజకవర్గాలను తిరిగొచ్చే ఆలోచనలో సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన పదవీకాలం పొడిగించినా.. పొడిగించకపోయినా.. ఫస్ట్ టర్మ్ ముగిసేలోపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను టచ్ చేయాలని సంజయ్ అనుకుంటున్నారట. ఇలా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను తిరిగిన అధ్యక్షుడిగా పార్టీ చరిత్రలో నిలిచే అవకాశమూ కలుగుతుంది. అయితే మారిన పరిస్థితులు.. పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బస్సుయాత్రకు వెళ్లే యోచనలో ఉన్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారం కూడా నిర్ణయం మార్పునకు ఒక కారణంగా భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్ర ద్వారా ఆయన 70 నియోజకవర్గాలను టచ్ చేసినట్టు అవుతుంది. మిగిలిన 50 సెగ్మెంట్లను రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున బస్సుయాత్ర ద్వారా 25 రోజుల్లో తిరిగి వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారట. సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర చేపట్టి.. ఫిబ్రవరిలో ముగించాలనే ఆలోచనలో కమలనాథులు ఉన్నట్టు సమాచారం. మరి.. ఈ ప్లాన్ బీజేపీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.
