కేబినెట్‌లో చోటు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న శిల్పా చక్రపాణిరెడ్డికి ఎక్కడ తేడా కొట్టింది? ఆయనకు ప్రతికూలంగా మారిన పరిణామాలేంటి? శిల్పా అనుచరుల్లో ఏ అంశంపై చర్చ జరుగుతోంది? పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తున్న వాదనేంటి?
మంత్రి పదవి రాకుండా ఎక్కడ తేడా కొట్టింది?
నంద్యాల జిల్లాలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని చివరి వరకు ప్రచారం జరిగింది. వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం.. అధికారంలో ఉన్న టీడీపీ నుంచి ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని, మండలి చైర్మన్ పదవిని త్యాగం చేసి వైసీపీలో చేరడంతో తప్పకుండా మంత్రిని చేస్తారని అనుకున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా వాటిని గుర్తిస్తుందని భావించారట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీని నడిపించడంలో లీడ్ రోల్ తీసుకోవడంతో 2019లోనే కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావించారు. అప్పుడూ లేదు.. ఇప్పుడు లేదు. కానీ.. అంతా రివర్స్. ఏం జరిగిందో.. ఎక్కడ తేడా కొట్టిందో ఆరా తీసే పనిలో పడ్డారు అనుచరులు.
ఆత్మకూరు ఘటన ప్రతికూలంగా మారిందా?
చక్రపాణిరెడ్డికి కేబినెట్‌లో స్థానం దక్కకపోవడానికి బీజేపీ ముఖ్యనేతల ప్రమేయం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతోందట. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో ఒక ప్రార్థనా మందిరం నిర్మాణం విషయంలో బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై దాడి జరిగింది. ఆ సమయంలో కొందరు పోలీస్‌స్టేషన్‌లోనూ విధ్వంసం సృష్టించి.. వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ ఘటనలో ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి పాత్ర ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే పదవికి చక్రపాణిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని చక్రపాణిరెడ్డి వివరణ ఇచ్చినా కమలనాథులు సంతృప్తి చెందలేదట.
చక్రపాణిరెడ్డి తీరుపై ఢిల్లీ బీజేపీ నేతలు గుర్రు..?
బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చాలాకాలంపాటు సబ్‌జైలులో పెట్టారు. ఢిల్లీ స్థాయిలో నాయకులు వచ్చి శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు కూడా. ఆ ఘటనను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ నేతలు.. సమస్యను ఢిల్లీ అగ్రనాయకత్వం వరకు తీసుకెళ్లారట. ఆ సందర్భంగానే బీజేపీ జాతీయ నాయకత్వం.. చక్రపాణిరెడ్డి విషయంలో వైసీపీ పెద్దల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ఆత్మకూరు ఘటన ఎఫెక్టే ఇప్పుడు చక్రపాణిరెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కకుండా చేసిందని స్థానికంగా చెవులు కొరుక్కుంటున్నారు.
త్యాగాలకు గుర్తింపు లేకపోతే ఎలా అని కేడర్ ప్రశ్న..!
కారణం ఏదైనా.. మంత్రివర్గంలో చక్రపాణిరెడ్డికి ప్లేస్ లేకపోవడంతో అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. కొందరు ఎమ్మెల్యేకు మద్దతుగా రాజీనామాలు చేశారు. కేడర్‌ను సముదాయించడానికి చక్రపాణిరెడ్డి ప్రయత్నించినా.. త్యాగాలకు గుర్తింపు లేకపోతే ఎలా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట అనుచరులు. అయితే సామాజిక సమీకరణాలు లేదా పార్టీ ప్రయారిటీని బట్టి మంత్రి కాలేదనే చర్చ కంటే.. బీజేపీ వల్లే కేబినెట్‌లో చోటు దక్కలేదన్న ప్రచారం వారిని మరింత నిరాశకు లోను చేస్తోందట. ఇప్పటికే కొంత నిరాశలో ఉన్న చక్రపాణిరెడ్డి ఈ ప్రచారానికి ఎలా చెక్ పెడతారో చూడాలి.